Razole Assembly Constituency: జనసేన పార్టీ ఏర్పడ్డాక 2019 ఎన్నికల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేయగా ఒక్క రాజోలు నియోజకవర్గంలోనే విజయకేతం ఎగురవేసింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. దీంతో రాష్ట్ర ప్రజల చూపంతా రాజోలు నియోజకవర్గంపైనే పడింది. అక్కడ నెగ్గిన రాపాక వరప్రసాదరావును జనసైనికులు ఆకాశనకెత్తారు. అయితే అనూహ్యంగా ఆయన ఎమ్మెల్యేగా నెగ్గిన స్వల్ప వ్యవథిలోనే వైసీపీ గూటికి చేరి జనసేన పార్టీకి షాక్ ఇచ్చారు.
రాపాక వైసీపీ గూటికి చేరడంతో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు స్వరం పెంచారు. రాపాకపై మాటల దాడి మొదలు పెట్టారు. ఒకరిపై ఒకరు బూతుపురాణాన్ని సైతం అందుకున్నారు. గొల్లపల్లి, రాపాక మాటల దాడి అప్పట్లో సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొట్టాయి. జనసైనికులు సైతం గొల్లపల్లి పక్షాన నిలబడి రాపాకపై విమర్శలు ఎక్కుపెట్టారు.
గొల్లపల్లి పార్టీ మారడంతో మారిన సీన్...
రాజోలు నియోజకవర్గంలో 2014-19 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా పని చేసిన గొల్లపల్లి సూర్యారావు ఇంతవరకు రాజోలు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా వ్యవహరించారు. అయితే పొత్తులో భాగంగా ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసే పోటీ చేయాలన్న నిర్ణయంలో భాగంగా రాజోలు జనసేనకు సిట్టింగ్ స్థానం కావడంతో మళ్లీ జనసేనకు దక్కింది.. దీంతో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న గొల్లపల్లి అయోమయంలో పడ్డారు. పూర్తి సందిగ్ధంలో ఉన్న గొల్లపల్లిపై వైసీపీ చూపు పడడంతో ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఐప్యాక్ టీం కసరత్తు చేసింది. దీనికి కారణం రాజోలులో గొల్లపల్లిలో మంచి పట్టు ఉండడం.. దీంతో ఇప్పటికే పార్టీలో ఉన్న రాపాకను ఒప్పించి గొల్లపల్లిని పార్టీలోకి తీసుకువచ్చింది వైసీపీ నాయకత్వం.
గొల్లపల్లికి రాజోలు వైసీపీ పగ్గాలు..
వైసీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించింది వైసీపీ. అయితే అదే సమయంలో అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలు రాపాక వరప్రసాదరావుకు అప్పగించింది. దీంతో మొన్నటి వరకు బద్ధశత్రువులుగా ఉన్న గొల్లపల్లి, రాపాక ఇద్దరినీ అధిష్ఠానం పిలిపించి మాట్లాడింది. ఇది ఫలించడంతో ఇద్దరూ కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సన్నివేశం చూసిన రాజోలు ప్రజలే కాదు వీరి మాటల యుద్ధం గురించి తెలిసినవారంతా పాత వీడియోలు గుర్తు చేసుకుని చర్చించుకుంటున్నారు.
తెర మీదకు పాతవీడియోలు..
గొల్లపల్లి సూర్యారావు, రాపాక వరప్రసాదరావు గతంలో ఒకరిపై ఒకరు తిట్టిపోసుకున్న వీడియోలు మళ్లీ సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. వీరి బూతు పురాణాలను మరింత ట్రోల్ చేస్తున్నారు జనసేన కార్యకర్తలు. ఒకరు ఒక పార్టీ గుర్తుపై నెగ్గి మరోపార్టీకి ఊడిగం చేస్తున్నారని, మరొకరు ఒక పార్టీలో పదవి అనుభవించి మళ్లీ మరో పార్టీలో చేరారని, ఇద్దరికీ విలువలు లేవని విమర్శలు గుప్పిస్తున్నారు. సూర్యారావు తొందరపడ్డారని, టీడీపీలోనే గనుక ఆయన ఉంటే పి.గన్నవరం సీటు ఆయనకే దక్కేదని విశ్లేషిస్తున్నారు..