పవన్‌ వారాహి యాత్రకు లైన్‌ క్లియర్‌..?

ఇప్పటికే అనుమతులు ఇచ్చిన కాకినాడ జిల్లా పోలీసులు..

రూట్‌ మ్యాప్‌ పరిశీలించిన అమలాపురం డీఎస్పీ

 

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో చేయనున్న వారాహి యాత్రకు వైసీపీ ప్రభుత్వం కావాలనే అడ్డంకులు సృష్టిస్తుందన్న విమర్శల నేపథ్యంలో కాస్త వెనక్కు తగ్గినట్లే కనిపిస్తోంది. వారాహి వాహనానికి అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పూజాకార్యక్రమాలు అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి నుంచి భారీ సభ అనంతరం వారాహి యాత్ర ప్రారంభం అవుతుందని ఇప్పటికే జనసేన నాయకత్వం ప్రకటించింది. కాకినాడ జిల్లా నుంచి ముమ్మిడివరం నియోజకవర్గం ద్వారా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోకి వారాహి యాత్ర ఎంటర్‌ కానుంది.

ఇప్పటికే కాకినాడ జిల్లా పరిధిలో ఈనెల 14న ప్రారంభమయ్యే యాత్రలో రోడ్‌షో, కత్తిపూడి జంక్షన్‌ వద్ద బహిరంగ సభ, 16న పిఠాపురంలో రోడ్‌షో, సాయంత్రం బహిరంగ సభ,ఆ తరువాత 18న కాకినాడలో రోడ్‌షో, సాయంత్రం బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై ఇప్పటికే కాకినాడ పోలీసులకు అనుమతులకోసం దరఖాస్తు చేయగా పోలీసులనుంచి అనుమతులు లభించాయి. ఇక ముమ్మిడివరం నియోజకవర్గం ద్వారా అమలాపురం చేరుకుని 20న రోడ్‌షో, బహిరంగ సభ జరగనుండగా 22న పి.గన్నవరం నియోజకవర్గం నుంచి రాజోలు నియోజకవర్గం చేరుకుని అక్కడ రోడ్‌షో, బహిరంగ సభ నిర్వహించేందుకు రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు. దీనిపై సోమవారం జిల్లా ఎస్పీ శ్రీధర్‌ను కలిసి అనుమతులు కోరనుండగా ఆదివారం అమలాపురం డీఎస్పీ అంబికాప్రసాద్‌, అమలాపురం సీఐ లు కలిసి జనసేన నాయకులతో కలిసి రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు.

 

పోలీస్ యాక్ట్‌ లు స‌ర్వ సాధార‌ణ‌మే.. డీఎస్పీ అంబికా ప్ర‌సాద్‌ 
శాంతి భ‌ద్ర‌త‌ల నిర్వ‌హ‌ణ‌లో భాగంగా సెక్ష‌న్ 30 పోలీస్ యాక్ట్‌లు విధించ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మేన‌ని, ఎటువంటి అస‌త్య ప్ర‌చారాలు న‌మ్మ‌వ‌ద్ద‌ని అమ‌లాపురం డీఎస్పీ అంబికా ప్ర‌సాద్ తెలిపారు. అమ‌లాపురం స‌బ్ డివిజ‌న్ ప‌రిధిలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు ఎటువంటి విఘాతం క‌లుగ‌కుండా, గ‌తంలో చోటుచేసుకున్న అనేక ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకుని సెక్ష‌న్ 30 పోలీసు యాక్ట్ విధించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇది రొటీన్‌గా పోలీస్ డిపార్ట్ మెంట్ చేసే ప‌నే అన్నారు. ఎటువంటి అస‌త్య ప్ర‌చారాలు న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. ఇదిలా ఉంటే ఆదివారం అమ‌లాపురం పోలీస్ స‌బ్ డివిజ‌న్ ప‌రిధిలో ప‌వ‌న్ క‌ళ్యాన్ వారాహి యాత్ర‌లో భాగంగా రోడ్ షో, బ‌హిరంగ స‌భ లు జ‌ర‌గ‌నున్న రోడ్ మ్యాప్‌న్ అమ‌లాపురం జ‌న‌సేన పార్టీ ఇంఛార్జ్ శెట్టిబత్తుల రాజ‌బాబు, త‌దిత‌ర ముఖ్య నాయ‌కుల‌తో క‌లిసి డీఎస్పీ అంబికా ప్ర‌సాద్‌, సీఐ దుర్గా శేఖ‌ర్ రెడ్డి ప‌రిశీలించారు. దీనిపై రాజ‌బాబు, జ‌న‌సేన నాయ‌కులు డీఎస్పీ, సీఐల‌కు, పోలీసుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 




 

వారాహి యాత్ర సాగేదిలా.. 

కాకినాడ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర షెడ్యూల్ ఇలా ఉంది...

ఈ నెల 14న ఉదయం 9 గంటలకు అన్నవరంలోని సత్యదేవుని దర్శనం, వారాహి వాహనానికి పూజలు.. అనంతరం సాయంత్రం 4 గంటలకు వారాహి యాత్ర ప్రారంభం అవుతుంది..

సాయంత్రం 5 గంటలకు కత్తిపూడి కూడలిలో బహిరంగ సభ, 6 గంటలకు పిఠాపురం నియోజకవర్గం చేరుకుని అక్కడ బస. 

 

15 ఉదయం 9 గంటలకు పిఠాపురంలో ప్రముఖులు, విద్యావేత్తలు, వృత్తి నిపుణులు, ఎన్జీఓ ప్రతినిధులతో సమావేశం ఉంటుంది. పది గంటలకు జనవాణి, స్థానిక సమస్యలపై వినతుల స్వీకరణ. 11కు వీర మహిళా విభాగం, మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారు. 

 

16 ఉదయం 9 గంటలకు పిఠాపురంలో స్థానిక నాయకులతోను,  పది గంటలకు కార్మిక, రైతు, చేతి వృత్తుల వారితో సమావేశం. 11 గంటలకు క్షేత్ర స్థాయి పరిశీలన, సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ. రాత్రి ఏడు గంటలకు కాకినాడ చేరుకుని బస చేస్తారు. 

 

17న కాకినాడలో ఉదయం 9 గంటలకు మేధావులతో సమావేశం, 10 గంటలకు జనవాణి, వినతుల స్వీకరణ, 11 గంటలకు వీర మహిళల విభాగంతో, మధ్యాహ్నం 12కు మీడియాతో సమావేశాలు.

 

18న ఉదయం 9 గంటలకు కాకినాడలో స్థానిక నాయకులతో, పది గంటలకు  కార్మిక, రైతు, చేతి వృత్తుల వారితో సమావేశాలు. 11 కు కాకినాడ గ్రామీణం పరిధిలో క్షేత్ర స్థాయి పరిశీలన. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద సాయంత్రం 5. గంటలకు బహిరంగ సభ.

 

19న ఉదయం 9 గంటలకు స్థానికులతో సమావేశం, 

12కు కాకినాడ అర్బన్ పరిధిలో క్షేత్రస్థాయి పరిశీలన, ఒంటి గంటకు ముమ్మిడివరం నియోజకవర్గానికి ప్రయాణం.

 

డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వారాహి యాత్ర షెడ్యూల్ ఇలా... 
ఈనెల 19న మధ్యాహ్నం ఒంటి గంటకు కాకినాడ నుంచి ముమ్మిడివరం నియోజకవర్గానికి యాత్ర బయలుదేరి యానాం మీదుగా ముమ్మిడివరం చేరుకుంటుంది. సాయంత్రం ముమ్మిడివరంలో బస,

 

20న ఉదయం 9 గంటలకు ముమ్మిడివరంలో మేధావులతో సదస్సు, 10 గంటలకు జనవాణి, వినతుల స్వీకరణ, 11 గంటలకు వీర మహిళ విభాగంతో, మధ్యాహ్నం 12కు రైతు కూలీలు, గీత కార్మికులతో సమావేశాలు ఉంటాయి. సాయంత్రం 5 గంటలకు ముమ్మిడివరం లో బహిరంగ సభ.  అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు అమలాపురం చేరుకుని అక్కడ బస.

 

21న అమలాపురంలో మేధావులతో సమావేశం. 10 గంటలకు జనవాణి, వినతుల స్వీకరణ, 11 గంటలకు వీర మహిళా విభాగం, మధ్యాహ్నం 12 గంటలకు మీడియాతో సమావేశాలు. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ, రాత్రి 7 గంటలకు అమలాపురం లోనే బస.

 

22న ఉదయం 9 గంటలకు అమలాపురంలో రైతులు, దళిత వర్గాలతో, 10కి స్థానిక నాయకులతో 11.30కి మీడియాతో సమావేశాలు. సాయంత్రం 4 గంట లకు పి. గన్నవరం నియోజకవర్గం మీదుగా రాజోలు నియోజకవర్గానికి ప్రయాణం. పి. గన్నవరం నియోజకవర్గంలో రోడ్డు షో. రాత్రి 7 గంటలకు రాజోలు నియోజకవర్గం మలికిపురం లో సభ, రాత్రి 9 గంటలకు దిండిలో బస.

 

23న ఉదయం 9 గంటలకు దిండిలో ప్రముఖులు, విద్యావేత్తలతో సమావేశం, 10కి జనవాణి, వినతుల స్వీకరణ, 11కి వీర మహిళ విభాగం, మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక నాయకులతో సమావేశాలు. మూడు గంటలకు సఖినేటిపల్లి నుంచి పంటు మీదుగా నరసాపురం ప్రయాణం. సాయంత్రం 5 గంటలకు నరసాపురంలో బహిరంగ సభ, రాత్రి బస చేయనున్నారు.