జనసేన పార్టీ నాయకులతో సమావేశం సందర్భంగా పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తనకు తెలిసిందని అన్నారు. అందుకోసం కొందరు ప్రత్యేకంగా సుపారీ గ్యాంగులను దింపారని సమాచారం ఉందని కాకినాడలో జనసేన నేతలతో అన్నారు. కాబట్టి, జనసేన నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు జాగ్రత్తగా ఉండాలని, భద్రతా నియమాలను పాటించాలని పవన్ కల్యాణ్ కోరారు. శనివారం రాత్రి (జూన్ 17) కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నేతల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ బలంగా ఉంటుందని, వైఎస్ఆర్ సీపీని గద్దె దింపే దిశగా ప్రయత్నిస్తుందని అన్నారు. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్ సీపీ నేతలు ఏం చేయడానికైనా రెడీగా ఉన్నారని ఆరోపించారు. అధికారం పోతుందనే భావన కొంత మంది నేతల్ని క్రూరంగా మార్చేస్తుందని అన్నారు. గతంలో కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు జనసైనికులు, వీర మహిళల మీద చేసిన దాడిని తనకు గుర్తుందని అన్నారు. తనను భయపెట్టేకొద్దీ మరింత రాటుదేలుతానని చెప్పారు.


అప్పట్లో బలమైన కార్యాచరణ లేక వెనుకడుగు వేశామని, వైఎస్ఆర్ సీపీ నేతలకు సరైన సమాధానం చెప్పే రోజు కచ్చితంగా వస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ సీపీకి ఒక్క సీటు కూడా దక్కకూడదని స్పష్టం చేశారు. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతోపాటు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మెజారిటీ నియోజకవర్గాలను ఈ రెండు జిల్లాల నుంచే సాధించాలని పవన్ భావిస్తున్నారు. అభిమానుల తాకిడి తనను అడ్డుకుంటోందని, తాను ఒక నటుడిని కాకపోయి ఉంటే బలమైన నాయకుడిగా జనంలోకి వెళ్లేవాడినని అన్నారు.


కొనసాగుతున్న వారాహి యాత్ర


పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే కత్తిపూడి సభ, పిఠాపురంలో బహిరంగ సభలు నిర్వహించారు. నిన్న ఉదయం (జూన్ 17) 10 గంటలకు కాకినాడ అర్బన్ నియోజక వర్గం ప్రముఖులు, విద్యావేత్తలతో భేటీ అయ్యారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి కాకినాడ అర్బన్, రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి జనవాణిలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కంటితడి పెట్టారు. జనవాణిలో భాగంగా దివ్యాంగుడి సమస్యలు వింటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం తనకు వచ్చే పెన్షన్ ను నిలిపివేసిందని, ఆయన పడుతున్న కష్టాలు చెబుతుంటే చలించిపోయిన జనసేనాని కంటతడి పెట్టారు. దివ్యాంగుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


దివ్యాంగుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. 2021లో పెన్షన్ తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. పవన్, చిరంజీవి అంటే తనకు ఇష్టమని చెప్పిన దివ్యాంగుడు శ్రీనివాస్.. ఎక్కువ కరెంట్ బిల్లు అని సాకు చూపించి ఉద్దేశపూర్వకంగా పింఛన్ తొలగించారని దివ్యాంగుడు శ్రీనివాస్ ఆరోపించారు. పలావుతో తిండి తిను, చేపల కూర నీకు అవసరమా అని వైసీపీ నేతలు ఎగతాళి చేశారని జనవాణిలో భాగంగా పవన్ కు ఆవేదన చెప్పుకున్నారు శ్రీనివాస్. 35 కేజీల రేషన్ బియ్యం వచ్చేదని, అది కూడా బంద్ చేసి ఇబ్బందులు పెట్టారన్నారు. మేం తినేది ఈ బియ్యం, అసలే మా అమ్మకు షుగర్ ఉంది, థైరాయిడ్ కూడా ఉందని తన కుమారుడు అడిగితే మళ్లీ బియ్యం ఇవ్వడం మొదలుపెట్టారని దివ్యాంగుడి తల్లి కనకం కన్నీటి పర్యంతమయ్యారు.