Janasena Chief Pawan Kalyan: డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా... నా బలం నాకు బాగా తెలుసు.. నా బలహీనతలు బాగా తెలుసని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. గత ఎన్నికల్లో రాజోలులో గెలిచి చిరు దీపంలా మనందరిలో స్ఫూర్తిని రగలించిందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని చోట్ల పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తానని, అందరికీ టచ్‌లో ఉంటానన్నారు. సత్యాన్ని ఆవిష్కరించేందుకు తపన పడుతున్నానని, అందుకు తనపై సుపారీ గ్యాంగ్ లతో దాడిచేసి హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారని మరోసారి అన్నారు. నిన్నటికి నిన్న రాజోలులో మెయిన్‌ రోడ్‌లో రాళ్లు పట్టుకుని నలుగురు క్రిమినల్స్‌ దొరికారని, వాళ్ల పోలీసులకు పట్టించారన్నారు. దిండి రాసార్ట్స్‌లో పి.గన్నవరం నియోజకవర్గ పార్టీ నాయకులతో పవన్‌ కళ్యాణ్‌ శనివారం సమావేశం నిర్వహించారు.


నేరం చేసిన వారెవరైనా శిక్ష పడాలి..
నేరం చేసిన ఏ వ్యక్తినైనా సరే వెనకేసుకు రావడం చాలా ప్రమాదమన్నారు పవన్‌ కళ్యాణ్‌. తప్పు చేసినవాడు మనవాడైనా శిక్ష పడాలన్నారు. రూల్‌ ఆఫ్‌ లా ప్రకారం ఎవ్వరు తప్పు చేసినా  రాజు నీతి తప్పితే నేల సారం తప్పుతుందన్నారు. రాష్ట్ర పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో ప్రజలు అలా ప్రవర్తిస్తారన్నారు. పదిహేనేళ్ల బాలుడ్ని చెరకు తోటలో పెట్రోల్‌ పోసి నిప్పంటిచారు. అధికారంలో ఉన్నం కదా, ఏం చేసినా చెల్లిపోతుందని, మా నాయకుడు రక్షిస్తాడని అనుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడైనా అందరం మేల్కోకపోతే అంతా నష్టపోతామని చెప్పారు.


వైసీపీ పాలన నుంచి ఉభయ గోదావరి జిల్లాలను విముక్తం చేయాలన్నారు పవన్ కళ్యాణ్. రాజోలులో నాయకుడు వెళ్లిపోయినా శ్రేణులు అండగా ఉన్నాయని ప్రస్తావించారు. ఆ ప్రేరణతోనే వారాహి విజయ యాత్ర ఇక్కడ నుంచి ప్రారంభించాం అని తెలిపారు. పి.గన్నవరంలో జనసేన జెండా ఎగురవేస్తాం, జనసేన గెలుపు ప్రజల గెలుపు అని పి.గన్నవరంలో నియోజకవర్గ నాయకుల సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ అన్నారు.


వర్షానికి వాయిదా పడిన పవన్‌ సభ..
మలికిపురంలో శనివారం జరగాల్సిన వారాహి బహిరంగ సభ వర్షం కారణంగా వాయిదా వేసినట్లు జనసేన ప్రకటించింది. అమలాపురం నియోజకవర్గం నుంచి శుక్రవారం రాత్రికి పి.గన్నవరం చేరుకున్న జనసేనాని అక్కిడి నుంచి రాజోలు నియోకవర్గం చేరుకున్నారు. రాత్రికి దిండి రిసార్ట్స్‌ వద్ద బస చేసిన పవన్‌ కళ్యాణ్‌ శనివారం మధ్యాహ్నం పి.గన్నవరం నియోజవకర్గ నాయకులతో సమావేశమయి దిశానిర్దేశం చేశారు. ఆదివారం రాజోలు నియోజకవర్గ నాయకులు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాత్రికి రోడ్‌షో అంనతరం మలికిపురం సెంటర్‌లో భారీ బహిరంగ సభలో పాల్గోనే అవకాశం ఉంది.






మలికిపురంలో జనసేన “వారాహి విజయ యాత్ర" సభ
రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఆదివారం జనసేన “వారాహి విజయ యాత్ర" సభ నిర్వహించనున్నారు. వాతావరణం అనుకూలంగా ఉన్న పక్షంలో రేపు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం అవుతుంది. మలికిపురం కాలేజ్ సెంటర్ లో సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనసేన స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు నిర్వహణ కమిటీ టీమ్ సభ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.