Jaggampeta Assembly constituency: కాకినాడ జిల్లా(Kakinada District ) జగ్గంపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు(Jyothula Chantibabu) మార్పు అనివార్యమని వైసీపీ(YSRCongress Party) అధిష్టానం సంకేతాలు ఇవ్వడంతో జగ్గంపేటలో రాజకీయ సమీకరణాలు వేగంగా కదులుతున్నాయి. తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే చంటిబాబు ఇప్పటికే పార్టీ కేడర్‌తో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన వైఎస్సార్సీపీని వీడి టీడీపీ(Telugu Desam Party ) వైపు వెళ్లే అవకాశాలున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.. 


ఇప్పటికే జగ్గంపేట టీడీపీ సీనియర్‌ నేత జ్యోతుల నెహ్రూ(Jyothula Nehru)తో చంటిబాబు కలిసి చర్చించినట్లు సమాచారం. దీనికి బలం చేకూరేలా జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. త్వరలోనే కాకినాడ జిల్లా నుంచి టీడీపీలోకి భారీ చేరికలుంటాయని, చంద్రబాబు సమక్షంలో ఆరు బస్సుల్లో వెళ్లి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కామెంట్ చేశారు. 


జగ్గంపేట స్థానం నుంచి మాజీ మంత్రి తోట నరసింహారావు(Thota Narasimha Rao)ను లేదా ఆయన కుమారుడిని కానీ వైఎస్‌ఆర్‌సీపీ పోటీలో ఉంచబోతంది. అందుకే ఎమ్మెల్యే చంటిబాబు పార్టీ మారడం అనివార్యంగా మారిందని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంటిబాబు పార్టీ క్యాడర్‌ తమకు అధిష్ఠానమని అన్న మాటలు పార్టీ మారే అవకాశాలు లేకపోలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. అంతే కాదు పార్టీలేదు గాడిద గుడ్డు లేదు అంటూ సంచ‌ల‌న కామెంట్స్ కూడా చేశారు. 


కలిసిపోనున్న జ్యోతుల కుటుంబాలు..?
జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయం జ్యోతుల కుటుంబం చుట్టూనే జరుగుతోంది. 1994లో టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ మొట్టమొదటిగా గెలిచారు. తర్వాత 1999లో కూడా గెలిచారు. 2004లో నెహ్రూ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ తరపున తోట నరసింహం గెలుపొందారు. 2009లో నరసింహమే గెలుపొందారు. 2014లో మళ్లీ వైసీపీ తరఫున జ్యోతుల నెహ్రూ విజయం సాధించి టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ తరపున పోటీ చేసిన ఓడిపోయారు. వైసీపీ నుంచి పోటీ చేసిన జ్యోతుల చంటిబాబు గెలుపొందారు. 


నాలుగేళ్లుగా జగ్గంపేట నియోజకవర్గంలో తోట నరసింహరావు పార్టీ నాయకులు, కార్యకర్తలతో టచ్‌లో ఉంటున్నారు. దీనిపై సిట్టింగ్‌ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు బహిరంగంగా ఎక్కడా వ్యతిరేకించకపోయినప్పటికీ ఒకింత అసంతృప్తితోనే ఉన్నారని సమాచారం. ఇటీవలే జగన్‌ ఎమ్మెల్యే చంటిబాబును పిలిపించి జగ్గంపేట సీటు మార్చనున్నట్లు చెప్పారు. దీంతో ఆయన పార్టీ మారేందుకు సన్నద్ధమయినట్లు సమాచారం. 


తోట గెలిచే అవకాశాలున్నాయా..?
జగ్గంపేట నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తోట నరసింహం ఇప్పటికే ప్రకటించుకోగా పార్టీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ కూడా వచ్చింది. గతంలో జగ్గంపేట నుంచి కాంగ్రెస్‌పార్టీ తరపున 2 సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన తోట కాకినాడ పార్లమెంటు స్థానం నుచి 2014లో టీడీపీ నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీలో చేరారు. పెద్దాపురం నుంచి తన భార్య వాణిని బరిలో దింపి ఓడిపోయారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతోపాటు పార్టీ క్యాడర్‌ అంతా పార్టీ మారే అలోచనలో ఉన్నటైంలో జగ్గంపేటలో తోటకు ఎదురీత తప్పదనే టాక్ వినిపిస్తోంది.