Independence Day 2022: దేశభక్తిని చాటుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో పద్దతి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav)లో భాగంగా ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చాలా మంది రక రకాలుగా తమ దేశ భక్తిని చాటుతున్నారు. డీపీలు మార్చడం నుండి జెండాకు సెల్యూట్ చేస్తూ, భారీ జెండా ప్రదర్శిస్తూ, జెండూ ఊపుతూ తమ దేశ భక్తిని వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రమైన అమలాపురానికి చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి వినూత్న రీతిలో తన దేశ భక్తిని చాటారు.
నాణేలతో దేశ చిత్రపటం..
దేశవ్యాప్తంగా ఆజాదీకా అమృత్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెప రెపలాడేలా జెండా ఎగురవేయాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుకు ప్రతి ఒక్కరూ స్పందించారు. ఇళ్లపైనే కాకుండా, వాహనాలపైనా జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ సంబరాల్లో భాగంగా.. 75 అడుగులు పొడవుతో భారత దేశ చిత్ర పటాన్ని రూపొందించారు అమలాపురం స్టేట్ బ్యాంక్ ఉద్యోగి ఇవటూరి సుబ్రహ్మణ్యం. పూర్తిగా నాణేలతో.. రూపాయి, రెండు, ఐదు రూపాయల బిల్లలతో చిత్ర పటాన్ని రూపొందించి ఆకట్టుకున్నారు.
దాచుకున్న నాణేలతో..
స్టేట్ బ్యాంక్ ఉద్యోగి ఇవటూరి సుబ్రహ్మణ్యంకు ఒక హాబీ ఉంది. ఆయనకు నాణాలు దాచుకోవడం అంటే ఎంతో ఇష్టం. చాలా కాలం నుండి సుబ్రహ్మణ్యం నాణేలను దాచుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరపడంతో తనూ కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నాడు. తను దాచుకున్న నాణేలతో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెబుదామని నిర్ణయించుకున్నాడు. ఇది 75వ స్వాతంత్ర్య దినోత్సవం కాబట్టి తన వద్ద ఉన్న నాణేల్లోని 75 వేల రూపాయల నాణేలతో భారత దేశ చిత్ర పటాన్ని రూపొందించారు.
అదొక్కటే కాదు..
భారత దేశ చిత్ర పటం ఒక్కటే రూపొందిస్తే సరిపోదని అనుకున్నారు సుబ్రహ్మణ్యం. అందుకే చిత్ర పటంతో పాటు 75 మంది స్వాతంత్య్ర సమర యోధుల చిత్రాలను కూడా ఏర్పాటు చేశారు. అందుకేనేమో ఈ వినూత్న చిత్ర పటం భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమూదైంది.
కోనసీమ జిల్లా ఎంతో ప్రత్యేకం
స్వతంత్ర పోరాటంలో కోనసీమ జిల్లాకు ప్రత్యేక అనుబంధం ఉంది. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామం నుండి స్వాతంత్ర్య మహా సంగ్రామంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 22 మంది పాల్గొన్నారు. ఒకే గ్రామం నుండి ఇంత ఎక్కువ మంది స్వాతంత్ర్య పోరాట యోధులు ఉండటం నిజంగా విశేషం. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని అసువులు బాసిన వారి త్యాగాలకు గుర్తుగా ఆ ఊరిలో ఓ స్తూపాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున సంబరాల్లో భాగంగా.. ఆ గ్రామ ప్రజలు స్వాతంత్ర్యోద్యమ అమర వీరులకు ఘనంగా నివాళి అర్పిస్తారు. ఎన్నో వ్యయ ప్రయాసలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకు వచ్చిన యోధులను, అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటారు.