PDS Rice Illegal transport: వైసీపీ ప్రభుత్వంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని ప్రోసెసింగ్ చేసి ఆపై కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టి టన్నుల కొద్దీ పీడీఎస్ బియ్యాన్ని సీజ్ కూడా చేయించారు. చాలా చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేయించారు. కానీ రేషన్ బియ్యం ఎక్కడో అక్కడ అధికారుల దాడుల్లో చిక్కుతూనే ఉంది. ఊళ్లు దాటి చేరాల్సిన చోటకి యధేచ్ఛగా తరలిపోతోంది. ఇటీవల కాలంలో ప్రజల నుంచి వచ్చిన సమాచారంతో పలు చోట్ల టన్నుల కొద్దీ పీడీఎస్ బియ్యం దొరికింది.
తాటిపాకలో మూడు టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేత!
రాజోలు మండలం తాటిపాక గ్రామంలో అశోక్ లేలాండ్ వ్యానులో మండపేటకు అక్రమంగా తరలిస్తున్న మూడు టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. రేషన్ డీలర్ సత్యనారాయణ వద్ద నుంచి ఈ వ్యాను బియ్యం లోడుతో బయలుదేరగా అడ్డుకుని పీడీఎస్ బియ్యంగా నిర్ధారించారు. పీడీఎస్ బియ్యం లోడుతో ఉన్న వ్యాన్ సీజ్ చేసిన పోలీసులు రేషన్ డీలర్ సత్యనారాయణ, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఎటువంటి పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.
రేషన్ డీలర్లే అక్రమంగా తరలిస్తున్నారా..
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా విషయంలో ప్రముఖంగా రేషన్ డీలర్లు పాత్ర చాలా కీలకంగా ఉందని ఇటీవల జరిగిన ఘటనల్లో స్పష్టం అవుతోంది. రేషన్ డిపోలకు వచ్చిన సరకును ఈ పోస్ యంత్రాల ద్వారా కార్డుదారుని వేలి ముద్రలను తీసుకుని రేషన్ ఇవ్వాల్సి ఉండగా చాలా మంది రేషన్ బియ్యం తినక ఎంతో కొంతకు రేషన్ డీలరుకు విక్రయించేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ బియ్యాన్ని పెద్ద మొత్తంలో కూడబెట్టి ఇలా పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలించే ముఠాకు లాభానికి అమ్ముకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టడానికి కొంత మంది కార్డు దారులు పరోక్షంగా ప్రోత్సాహం అందిస్తుండగా ఇదే అదనుగా తక్కువ ధరకు కొనుగోలుచేసిన బియ్యాన్ని అధిక రేట్లకు అమ్ముకుంటున్న కొంత మంది రేషన్ డీలర్లు కూడా కారణంగా నిలుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
6ఏ కేసులు కట్టినా ఎటువంటి భయం లేకుండా..
పీడీఎస్ బియ్యం పట్టుబడ్డ వారిపై 6ఏ కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. ఈ సెక్షన్లపై నమోదైన కేసుల్లో చాలా మంది చాలా సునాయాసంగా బయట పడగలగడం వల్ల బయటకు వచ్చి మళ్లీ ఇదే అక్రమ మార్గంలో వెళ్తున్నారు. అందుకే చాలా మంది పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో పట్టుబడ్డ వారిలో ఎక్కువగా పాత నేరస్తులే ఉండడం పరిపాటిగా మారింది. గతంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ సందర్భంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. ఈతరహా చట్టాల అమలుతోనే ఎంతో కొంత పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కట్టడి అయ్యే అవకాశాలున్నాయని, లేకపోతే అక్రమ మార్గంలో తరలిపోతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డకట్ట వేయలేమని పలువురు హితవు పలుకుతున్నారు..