Gidugu Rudraraju on Chiranjeevi: చిరంజీవిపై ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉన్నారని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు చిరంజీవి రూ.5 కోట్లు విరాళం ఇవ్వడంపై ఆయన స్పందిస్తూ.. తమ్ముడు అని పవన్ కళ్యాణ్ కు సహాయం చేసి ఉంటారని గిడుగు రుద్రరాజు అన్నారు. చిరంజీవి ఇంకా ఏఐసీసీ సభ్యులుగానే కొనసాగుతున్నారని.. ఇంత వరకూ కాంగ్రెస్ కు రాజీనామా చేయలేదని అన్నారు.


రాజమండ్రిలో కాంగ్రెస్ సెంట్రల్ ఆఫీస్, ప్రచార వాహనాలను ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ప్రారంభించారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల గురించి స్పందిస్తూ.. ప్రశాంత్ కిషోర్ పెయిడ్ ఆర్టిస్ట్ అని అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని నిన్న పురంధేశ్వరి అన్నారని గిడుగు రుద్రరాజు అన్నారు. టీడీపీ, జనసేన పురంధేశ్వరి వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని అన్నారు. 


పురంధేశ్వరి వలస పక్షి అని.. ఆమె గెలిచినా రాజమండ్రిలో ఉండరని అన్నారు. కాంగ్రెస్ హాయాంలోనే రాజమండ్రి సమగ్రంగా అభివృద్ధి చెందింది. ఉండవల్లి ఎంపీగా ఉన్నప్పుడే రాజమండ్రి ఎయిర్ పోర్ట్ బాగా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. ‘‘చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ వారే.. ఇంతవరకు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయలేదు.. ఏఐసీసీ సభ్యులుగా చిరంజీవి కొనసాగుతున్నారు.. తమ్ముడు అనే కారణంతోనే పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి సహాయం చేసి ఉంటారు.. కొందరు చిరంజీవిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని గిడుగు రుద్రరాజు అన్నారు.