ఏకపక్ష రాష్ట్ర విభజనపై "విభజన వ్యథ" పుస్తకం రాస్తున్నట్లు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. వచ్చే ఫిబ్రవరి నాటికి 14 ఏళ్ళు పూర్త వుతుందని చెప్పారు. ఆ సమయంలో రాష్ట్రం ఎలా నష్టపోయిందన్న అంశాలను, అనాటి పరిస్థితులపై పుస్తకంలో వివరాలు వెల్లడిస్తానని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. అమరావతిపై తాను ఏనాడో పుస్తకం రాశానని, భ్రమరావతి అనే పుస్తకంలో చాలా విషయాలు వెల్లడించానన్నారు.
మార్గదర్శి కేసును వదిలేది లేదని అరుణ్ కుమార్ పునరుద్ఘాటించారు. మార్గదర్శిపై తాను కేసు వేసి 16ఏళ్లు అయ్యిందని, మార్గదర్శి కేనుపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పీ వేసిందని.. ప్రభుత్వం వేసిన సీఎల్పీకు సంబంధించి తన వద్ద ఉన్నటువంటి డాక్యుమెంటు సాక్ష్యాలను ప్రభుత్వానికి ఇస్తానని వెల్లడించారు. రామోజీరావు కేసు విషయంలో ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నానని అరుణ్ కుమార్ అన్నారు.
రిజర్వు బ్యాంకు చట్టం ప్రకారం రామోజీరావు తాను సేకరించిన డబ్బును వెనక్కు ఇచ్చానని చెప్పారు కాబట్టి నమ్మాలని కోర్టుకు చెబుతున్నారని తెలిపారు ఉండవల్లి. వివరాలు కోరితే రాజశేఖరెడ్డి వల్ల డిపాజిట్‌దారుల ప్రాణాలకు ప్రమాదముందని ఒక పిల్ వేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిట్‌ఫండ్ కంపెనీలన్నీ సక్రమంగా నడుస్తున్నాయా లేదా అన్న విషయంలో పరిశీలిస్తున్నట్లు ఇటీవలే పత్రికల్లో చూశానని ఉండవల్లి చెప్పారు. 80 శాతం షేర్ ఉన్న కంపెనీలో బుక్కులు కూడా అడిగే దిక్కులేకుండా పోయిందన్నారు. 16 ఏళ్ల క్రితం మార్గదర్శిలో తేడా జరుగుతోందని చెప్పానని గుర్తు చేశారు. అయితే అప్పట్లో రామోజీరావుకు మార్గదర్శికి అసలు సంబందం లేదని దావా వేశారన్నారు.
2021 మార్గదర్శి బ్యాలెన్స్ షీట్లో అందులో రామోజీరావు సంతకం ఉందని, సేకరించిన డబ్బును వెనక్కు ఇచ్చేయగలనని మరో పిటీషన్ వేశారన్నారు. ఏ చిట్‌ఫండ్ కంపెనీ అయినా వేరే వ్యాపారం చేయకూడదని నిబంధనలు పక్కా చెబుతున్నాయని గుర్తు చేశారు. రామోజీరావు అబద్దం చెబుతున్నారా.. లేక చిట్ ఫండ్ కంపెనీ వాళ్లు అబద్ధం చెబుతున్నరా.. అని ప్రశ్నించారు. రామోజీరావు కోర్టులను కూడా తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు కేవలం క్యాష్ ఈక్వలెంట్ అనే దానిలోనే జైలుకు వెళ్లారని, తన వాదనే చెప్పమని ప్రభుత్వాన్ని అడగడం లేదన్నారు ఉండవల్లి. మార్గదర్శి కేసుపై వాదన వినిపించాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను అన్నారు. ఈసారైన ప్రభుత్వాలు జాగ్రత్తగా నిజాలు బయటకు వచ్చేలా ప్రయత్నించాలని, ఎవరూ చట్టాలకు అతీతులు కాదని తెలియజెప్పమని చెబుతున్నానని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.
పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా తానంటే చాలా గౌరవమిస్తారని, ఆయన్ని సిగ్గులేదా అన్నట్టు తప్పుడు సమాచారం ఆయనకు చేరిందన్నారు. తాను ఎప్పుడు అలాంటి పదాలు వాడలేదని వివరణ ఇచ్చారు. ఏదైనా వీడియో హెడ్డింగ్ చూసి అలా మాట్లాడి ఉంటారని అరుణ్ కుమార్ అన్నారు.