అమరావతి: ఏపీ లైఫ్ లైన్ అయిన పోలవరం ప్రాజెక్టు తొలిదశ పునరావాసాన్ని 2027 మార్చి నాటికి పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను పునరావాస కమిషనర్ తాజాగా పోలవరం అథారిటీకి సమర్పించారు. పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీళ్లు నిల్వ ఉంచాలంటే దాదాపు లక్ష కుటుంబాలను (96,660) తరలించడం తప్పనిసరి. అయితే, అధికారులు తొలిదశలో 38,060 కుటుంబాలను తరలించి, ఆ మేరకు మాత్రమే నీటిని నిల్వ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వేలాది కుటుంబాలను వేరే ప్రాంతాలకు తరలించి వారికి ఇళ్లు కట్టించడంతో పాటు సాగు చేసుకునేందుకు పొలాలు, ఉపాధి అవకాశాలు చూపించాల్సి ఉంటుంది. 

Continues below advertisement

గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల కోసం ఎలాంటి పని చేయకపోవడంతో, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పనులు చేపట్టి పూర్తి చేయాల్సి ఉంటుంది. తొలిదశ పునరావాసానికి ఇంకా ₹6,102.39 కోట్ల నిధులు కావాలి. తర్వాత, రెండో దశలో 58,600 కుటుంబాలను తరలించాల్సి ఉంది. దీని కోసం కేంద్రం నుంచి ఇంకా నిధులు మంజూరు కావాల్సి ఉంది.

Continues below advertisement

నిర్వాసితులకు పునరావాసం, భూసేకరణపోలవరం డ్యామ్, కుడి, ఎడమ కాలువలకు అవసరమైన భూసేకరణ పూర్తయింది. అయితే పునరావాసానికి భూసేకరణ తొలిదశ వరకే చేయనున్నారు. దీనిని 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలిదశలో తరలించాల్సిన మొత్తం నిర్వాసిత కుటుంబాలు 38,060 ఉన్నాయి. వీటిని 1A, 1B అనే రెండు భాగాలుగా విభజించారు. ప్రాథమికంగా +45.72 మీటర్ల నీటిమట్టం వద్దే ముంపు వస్తుందని భావించినప్పటికీ, తర్వాత +41.15 మీటర్ల నీటిమట్టానికే ముంపు తప్పదని తేల్చడంతో తొలిదశ నిర్వాసితుల సంఖ్య పెరిగింది. 1A కింద 20,946 కుటుంబాలు, 1B కింద 17,114 నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటివరకు 14,385 కుటుంబాలను తరలించగా, ఇంకా 23,675 కుటుంబాలను అక్కడి నుంచి తరలించాల్సి ఉంది.

కాలనీల నిర్మాణం, సవాళ్లు1A కింద ఉన్న 6,561 కుటుంబాల కోసం ప్రస్తుతం 49 కాలనీలు నిర్మిస్తున్నారు. కొత్తగా టెండర్లు పిలిచి, కొత్త కాంట్రాక్టర్లకు అప్పజెప్పి పనులు వేగవంతం చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియ జరుగుతోంది. ఇక, 1B లో సొంతంగా ఇళ్లు కట్టుకుంటామన్న వారు పోను, మిగిలిన కుటుంబాల తరలింపునకు అవసరమైన కాలనీల నిర్మాణానికి 2026 మార్చిలో టెండర్లు పిలిచి, 2027 మార్చికి పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. 

పోలవరం 1B కింద నిర్వాసితుల తరలింపు విషయంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. గంగవరం, అడ్డతీగల మండలాల్లో గుర్తించిన భూములు తమకు వద్దని నిర్వాసితులు చెబుతున్నారు. భూములు మండల కేంద్రాల నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, అంత లోపలికి వెళ్లడానికి తాము సిద్ధంగా లేమని చెబుతున్నారు. రోడ్డుకు దగ్గరగా అనువైన భూములు లేకపోవడంతో సమస్య వచ్చింది. గిరిజనేతర భూములు కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఆ భూములను ఆక్రమించుకున్న వారు భూసేకరణకు సహకరించకపోవడంతో పునరావాస ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.