కాకినాడ జీజీహెచ్‌ ఐసీయూలో అగ్నిప్రమాదం
సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం..


ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు పేద ప్రజలకు జీవనాడిగా ఉన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి(జీజీహెచ్‌)లోని ఐసీయూలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మెయిన్‌ ఆఫ్‌ చేయడంతో ప్రమాదం తప్పింది. విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల అప్పటికే ఏసీ యూనిట్లలో మంటలు వ్యాపించగా విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో మంటలు ఆగాయి. అయితే అప్పటికే ఐసీయూలో దట్టమైన పొగలు వ్యాపించడంతో చికిత్స పొందుతున్న రోగులు ఇబ్బందులు పడ్డారు. దీంతో వెంటనే వారిని శానిటేషన్‌, సెక్యూరిటీ, ఎంఎస్‌వోలు స్పందించి సురక్షిత వార్డులకు తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 


దట్టమైన పొగతో ఇబ్బందులు పడ్డ రోగులు..
కాకినాడ జీజీహెచ్‌లో ఐసీయూ విభాగంలోనే ఎక్యూట్‌ మల్టీకేర్‌ యూనిట్‌(ఏఎంసీయూ 1)లో మంటలు చెలరేగడం గమనించిన శానిటేషన్‌ సిబ్బంది వెంటనే ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. అయితే అప్పటికే మంటలు వస్తుండడంతో మెయిన్‌ ఆఫ్‌ చేశారు. మంటలు ఆగాయి, కానీ ఐసీయూలో పొగలు వ్యాపించాయి. దీంతో రోగులు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హుటాహుటీన స్ట్రెచర్లు, వీల్‌ ఛైర్లు, భుజాలమీద వేసుకుని రోగులను శానిటేషన్‌ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, రోగుల అటెండెంట్లు అందరూ సురక్షిత వార్డులకు తరలించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో సిబ్బంది స్పందించిన తీరును ఆసుపత్రి సూపరెంటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటరెడ్డి తదితరులు అభినందించారు.


అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం..
ఏసీ యూనిట్లులో విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల అగ్నిప్రమాదం సంభవించిందని, అయితే ప్రమాదాన్ని వెంటనే గుర్తించడంతోపాటు అప్రమత్తమై వెంటనే విద్యుత్తు సరఫరాను నిలిపివేయడం, రోగులను సురక్షిత వార్డులకు తరలించడంతో ఎటువంటి నష్టం జరగలేదని ఆసుపత్రి సూపరెంటెండెంట్‌ వెంకటరెడ్డి తెలిపారు. ఈ ఇన్సెంటివ్ కేర్లో 12 బెడ్లు ఉండగా 11 మంది చికిత్స పొందుతున్నారని వారిలో ఏ ఒక్కరికి ప్రాణాపాయస్థితి రాలేదని చెప్పారు. ప్రస్తుతం ఏసీ రిపేరు పనులు చేయించి పునరుద్దించే పనులు చేస్తున్నామని ఇంచార్జ్ సూపర్డెంట్ ఎస్ వెంకట్ రెడ్డి తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చికిత్స నిమిత్తం వేరే ఇతర వార్డులకు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.  రెండు రోజుల్లో ఐసీయూ సేవలు పునరద్ధరిస్తామని తెలిపారు. విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఏసీ యూనిట్లు వైరింగ్‌ మాత్రమే కాలిందని, మిగిలిన వాటికి ఎటువంటి నష్టం కలుగలేదని తెలిపారు.