- మార్గదర్శిపై రామోజీ, చంద్రబాబులతో చర్చకు సిద్ధం..

- ఫిల్మ్ సిటీ, టీడీపీ కార్యాలయాల్లో ఎక్కడైనా సరే 

- మే 2న రాష్ట్ర విభజన కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

- మే 10 తర్వాత తేదీ నిర్ణయించండి.

- మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్

 

మార్గదర్శి వ్యవహారంపై చర్చకు వస్తున్నట్లు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ప్రకటించడం పట్ల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుముఖత వ్యక్తం చేశారు. తాను కూడా చర్చకు సిద్ధమని ప్రకటించారు. అయితే చర్చ రామోజీరావు సమక్షంలో జరిగితే బాగుంటుందన్నారు. రాజమండ్రిలో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎప్పటినుంచో చర్చకు రావాలని కోరుతున్న సమయంలో టీడీపీ నుంచి అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చర్చకు వస్తాననడం శుభ పరిణామమన్నారు.

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కంటే రామోజీరావు సమక్షంలోనే రామోజీ ఫిలిం సిటీలో చర్చ జరిగేలా చూడాలని ఉండవల్లి సూచించారు. లేని పక్షంలో హైదరాబాద్ టీడీపీ కార్యాలయంలోనైనా సరే పెడితే బాగుటుందని సూచించారు.

ఈ రెండు అంశాల్లో ఏదో ఒకటి జరిగేలా చంద్రబాబు ద్వారా ఒప్పించాలని ఆయన కోరారు. ఈ నెల 30న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో సిద్ధమని జీవీ రెడ్డి చెప్పడంతో ఒకే చెప్పానని అయితే ఆరోజు హైదరాబాద్ సెక్రటేరియట్ ప్రారంభం కనుక మీడియా వాళ్ళు వచ్చే అవకాశం లేనందున మరొక తేదీ సూచించారని, అయితే మే మొదటి వారంలో నెలలో పెళ్లిళ్ల సీజన్ కనుక 8వ తేదీ తర్వాత ఎప్పుడు పెట్టినా సిద్ధమని ఉండవల్లి చెప్పారు.

 

వ్యక్తిగతంగా రామోజీపై ద్వేషం లేదు... 

హెచ్ యు ఎఫ్ కింద డిపాజిట్లు సేకరించడం తప్పని తాను, కాదని మార్గదర్శి వాళ్ళు అంటున్నారని ఎవరిది కరెక్టో తేల్చాలని మాత్రమే తాను అంటున్నాను తప్ప వ్యక్తిగతంగా రామోజీరావుపై ఎలాంటి వ్యతిరేక భావన లేదని పునరుద్ఘాటించారు. రామోజీరావుని సమర్థిస్తున్న టీడీపీ ఇప్పుడు చర్చకు కూడా రావడం ద్వారా ఒప్పుకున్నట్టు తేలిందన్నారు. 

 

17 ఏళ్లుగా పోరాటానికి ఇదొక మంచి పరిణామం.. 

ఈనెలలో సుప్రీంకోర్టులో మార్గదర్శి వ్యవహారం విచారణకు వచ్చిన సందర్భంగా జరిగిన వాదనలో ఎవరెవరికి డబ్బులు చెల్లించారో వివరాలు బయట పెట్టాలని తాను కోరడం, సుప్రీంకోర్టు కూడా వివరాలు వెల్లడించాలని సూచించిందని ఉండవల్లి వివరిస్తూ, గత 17 ఏళ్లుగా తాను చేస్తున్న పోరాటానికి ఇదొక మంచి పరిణామమని అన్నారు. అయితే మార్గదర్శిని ఏవిధంగా టీడీపీ వాళ్ళు రక్షిస్తూ వస్తున్నారో, మిగిలిన సంస్థల వ్యవహారంలో ఎలా వ్యవహరించారో కూడా తాను చర్చలో ప్రస్తావిస్తానని చెప్పారు. మార్గదర్శి వ్యవహారంలో ఎవరూ పిర్యాదు చేయలేదని కొంతమంది వ్యాఖ్యానించడంపై ఆయన స్పందిస్తూ, గతంలో బ్రాకెట్ జోరుగా సాగేదని, చివరకు ఎవరి ఫిర్యాదు లేకుండానే చర్యలు తీసుకుని కట్టడి చేశారని ఆయన సోదాహరణంగా ప్రస్తావించారు. మార్గదర్శి వ్యవహారంలో తప్పు జరిగిందో లేదో చెప్పమంటున్నానని, ఎందుకంటే వ్యవస్థలో జరుగుతున్న ఇంత పెద్ద తప్పు గురించి అడుగుతున్నానని అన్నారు. 

 

చిట్ ఫండ్ యాక్ట్ తనకు వర్తించదంటే ఎలా... 

 చిట్ ఫండ్ యాక్ట్ తమకు వర్తించదని, తమది కంపెనీ యాక్ట్ లోకి వస్తుందని అన్నారని ఆయన గుర్తుచేశారు. తప్పు ఎవరిదో తేల్చాలని అంటున్నానని, ఒకవేళ తనది తప్పైతే అంగీకరిస్తామని ఆయన అన్నారు. మార్గదర్శి గురించి రామోజీరావు అసలు ఇచ్చాను, వడ్డీలకు ఇచ్చాను అని చెబుతున్నారు. లాభాలు వచ్చాయి కాబట్టి డబ్బులు పంచుతున్నారు.. లేకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఉండవల్లి.. 
రామోజీరావు తప్పని ఒప్పుకోవడంలేదు. వ్యవస్థలో జరుగుతోన్న పెద్ద తప్పు ఇది.. అయినా చిట్‌ఫండ్‌ యాక్ట్‌ మాకు చెల్లదు అని చెబుతున్నారు. డబ్బులు చిట్‌ఫండ్‌లో పెట్టినట్టు నేషనలైజ్‌ బ్యాంకులో పెట్టనవసరం లేదు అంటున్నారు. రాజాజీ అనే వ్యక్తి మార్గదర్శికి, రామోజీరావుకు ఎటువంటి సంబందం లేదని పిల్‌ వేశాడు. మళ్లీ అదేవ్యక్తి ట్రయిల్‌ కోర్టులో ఒకలా వేశారు.. హైకోర్టులో ఒకలా వేశారు.. ఇదేకదా రామోజీ చేస్తోంది అన్నారు. 

 


వైసీపీ మనిషిని అని టిడిపి ప్రూవ్ చేయాలని చూస్తుంది...

టీడీపీ వ్యూహం ఏంటంటే నేను, వైసీపీ ఒకటేనని ప్రూవ్‌ చేయాలని చూస్తోంది. పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో షైన్‌ అవుతాడేమో అనుకున్నాను.. కొత్తమనుషులు రావాలని కోరుకున్నాను. వాళ్ల పార్టీ కూడా వ్యూహాత్మకంగా రామోజీరావు చేస్తోంది తప్పు అనడంలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

 

నాకు వేరే పనిలేదు... 

టిడిపి సీనియర్ నాయకుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలకు ఉండవల్లి అరుణ్ కుమార్ అంతే ఘాటుగా స్పందించారు. బుచ్చయ్య చౌదరి అన్నట్టుగానే  తనకు వేరే పని లేదని, తనకు ఇదే పని అన్నారు.  మార్గదర్శి, ఆంధ్రప్రదేశ్ విభజన రెండు కేసులపై తమ దృష్టి అంత ఉందని ఉండవల్లి తెలిపారు. చంద్రబాబు కంటే ముందు నుంచి టిడిపిలో బుచ్చయ్య ఉన్నారని అయితే చంద్రబాబు నాయుడు మాత్రం మంత్రి పదవి ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.