కోడికత్తి శ్రీనివాస్‌ తల్లిదండ్రులకు హర్షకుమర్‌ ఆర్థికసాయం
రూ.20 వేలు ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీ..
సీఎం జగన్‌ పాలనలో దళిత పథకాలన్నీ నాశనం చేశారన్న హర్షకుమార్


దళితుల సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. ఆ ఫథకాలను తొలగించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ మండిపడ్డారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌పై కోడికత్తి దాడి కేసులో నిందితునిగా జైల్లో ఉన్న శ్రీనివాస్‌ తల్లిదండ్రులు తాతారావు, సావిత్రిలకు హర్షకుమార్‌ తనయుడు శ్రీరాజ్‌తో కలిసి రూ.20 వేలు ఆర్థిక సాయం అందించారు. రాజమండ్రిలోని ఓ వివాహ వేడుకకు హాజరైన జీవీ హర్షకుమార్‌ వద్దకు వచ్చిన కోడికత్తి శ్రీనివాస్‌ తల్లిదండ్రులు ఆయన్ను కలిశారు. తమ కుమారుడు జైల్లోనే సంవత్సరాలుగా మగ్గిపోతున్నాడని, తమ ఆర్థిక పరిస్థితి బాగోలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని కంటనీరు పెట్టుకోవడంతో చలించిపోయిన హర్షకుమార్‌ వెంటనే కారులో ఉన్న చెక్‌ బుక్‌ను ఆయన కుమారుడు శ్రీరాజ్‌ ద్వారా తెప్పించి రూ.20 వేలు చెక్కును కోడికత్తి శీను తల్లిదండ్రులకు అందించారు. 


వైఎస్‌ పుత్రరత్నం నాశనం చేశారు..
దళితుల పక్షపాత ప్రభుత్వంగా చెప్పుకునే వైసీపీ ప్రభుత్వంలో దళితుల బాగు కొరకు గత ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయని, అయితే వైసీపీ ప్రభుత్వంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పుత్రరత్నం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ పథకాలన్నీ నాశనం చేశారన్నారు. ఈప్రభుత్వంలో దళితులకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందన్నారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ నాలుగేళ్లుగా జైల్లోనే మగ్గుతున్నాడన్నారు. వారి కుటుంబం కష్టాల్లో ఉందని హర్షకుమార్‌ అన్నారు. 


వైసీపీ వచ్చాకే దాడులు ఎక్కువయ్యాయి.. 
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాకే దళితులపై దాడులు ఎక్కువయ్యాయని మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆరోపించారు. వైసీపీ నాయకులు, మద్దతు దారులే దళితులపై దాడులకు తెగబడుతున్నారన్నారు. దళితులపై దాడులు చేసే వ్యక్తులకు వైసీపీ నాయకత్వం అందలం ఎక్కించే పరిస్థితి ఉంది.. ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వారే దీనికి ఉదాహరణగా నిలుస్తున్నారన్నారు. దళితులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని.. వైసీపీ ప్రభుత్వం దళితుల పక్షపాతి ప్రభుత్వం కాదు అని నిజాలు తెలుసుకోవాలని సూచించారు.