Eluru: ప్రేమ పేరుతో ఓ యువకుడు ఓ యువతిని చిత్రహింసలు పెట్టాడు. వేడి వేడి నూనెను కాళ్లపై, చేతులపై పోసి పాశవికంగా ప్రవర్తించాడు. ప్రేమిస్తున్నానని చెప్పి ఇంజినీరింగ్ విద్యార్థినిని నమ్మించాడు. తనతో పాటు తీసుకెళ్లి ఓ గదిలో బంధించాడు. తర్వాత మానవ మృగంలా ప్రవర్తించాడు. ఆ కిరాతకుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ  ఆ యువతి ఎలాగోలా ఆదివారం తెల్లవారుజామున తప్పించుకుంది. నేరుగా తల్లిదండ్రుల వద్దకు వెళ్లి విషయం చెప్పింది. తీవ్రగాయాలతో ఉన్న బిడ్డను చూసి తల్లడిల్లిపోయిన యువతి తల్లిదండ్రులు ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. 


అసలేం జరిగిందంటే..?


ఏలూరులోని శనివారపుపేటకు చెందిన ఓ యువతి కాకినాడ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. శనివారపుపేటకు సమీపంలోని దుగ్గిరాకు చెందిన సదర్ల అనుదీప్ ప్రేమ పేరుతో ఆమె వెంట పడ్డాడు. తన ఉచ్చులోకి లాక్కున్నాడు. ప్రేమ పలుకులు పలికి ఆ యువతిని నమ్మించాడు. దాదాపు సంవత్సరం నుండి వారు సన్నిహితంగా ఉంటున్నారు. ఆ యువతికి మాయమాటలు చెప్పి దుగ్గిరాలలోని తన ఇంటికి తీసుకొచ్చాడు. గత ఐదు రోజులుగా ఆ యువతిని తీవ్రంగా చిత్రహింసలు పెట్టాడు. నూనెను వేడి చేసి తన ఒంటిపై పోశాడు. అతడి చిత్రహింసలకు ఆ యువతి తీవ్రంగా గాయపడింది. శనివారం అర్ధరాత్రి వేళ ఆ యువతిని ఉరివేసి చంపాలని పథకం పన్నాడు అనుదీప్. ఉరికి సన్నాహాలు చేస్తుండగానే ఆ యువతి అక్కడి నుండి తప్పించుకుంది. తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత యువతి ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. 


నిందితుడు సదర్ల అనుదీప్ పరారీ ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు అనుదీప్ గంజాయికి, ఇతర మత్తు పదార్థాలకు బానిసయ్యాడని పోలీసుల విచారణలో తేలింది. గతంలో పలువురు అమ్మాయిలను ప్రేమ పేరుతో వేధించాడని తెలిసిందని పోలీసులు తెలిపారు. అనుదీప్ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఏలూరు మూడో పట్టణ సీఐ వరప్రసాదరావు వెల్లడించారు.


ఇటీవలే నెల్లూరులోనూ ఇలాంటి ఘటనే - ప్రేమించిన పాపానికి ప్రాణం పోయింది!


నెల్లూరు జిల్లాలో కాలేజీ హాస్టల్ రూమ్ లోనే ఓ విద్యార్థినికి అబార్షన్ కావడంతోపాటు ఆ అమ్మాయి ప్రాణం పోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ప్రేమికుడు మోసం చేయడం, గర్భం వచ్చినా పట్టించుకోకపోవడం, తనకు తెలియదంటూ తప్పించుకు తిరగడంతో.. చేసేదేం లేక ఆ అమ్మాయి సొంత వైద్యం చేసుకుంది. తెలిసీ తెలియకుండా మందులు వాడటంతో కాలేజీ హాస్టల్ లోనే అబార్షన్ అయింది. పిండం బయటకు వచ్చింది. అయితే ఆగకుండా రక్తస్రావం కావడంతో వెంటనే కాలేజీ స్టాఫ్ ఆ అమ్మాయిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆ అమ్మాయి చనిపోయింది. 







నెల్లూరు జిల్లా ప్రియదర్శిని కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న మృతురాలి స్వస్థలం మర్రిపాడు. పక్కనే ఉన్న అనంతసాగరం మండలం లింగం గుంటకు చెందిన శశి అనే డ్రైవర్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. సదరు శశి.. ప్రియదర్శిని కాలేజీలో ప్రిన్సిపల్ కారు డ్రైవర్ అనే ప్రచారం జరుగుతోంది. అయితే స్టాఫ్ ఈ విషయాన్ని ధృవీకరించలేదు. శశి ప్రవర్తన సరిగా ఉండదని, గతంలో అనంత సాగరం ఎస్సై కూడా ఓసారి ఈవ్ టీజింగ్ కేసులో కౌన్సెలింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. ఆ తర్వాత కాలేజీలో అమ్మాయితో పరిచయం పెంచుకుని శారీరకంగా దగ్గరయ్యాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఆ తర్వాత శశి ఆమెను పట్టించుకోవవడం మానేశాడు. అబార్షన్ చేయించుకుంటాను అన్నా కూడా సహకరించలేదు. దీంతో ఆమె తనలో తానే కుమిలిపోయింది. తల్లిదండ్రులకు విషయం చెప్పలేక, సొంతగా ఆస్పత్రికి వెళ్లలేక ఇబ్బంది పడింది. తీరా ఆరో నెల గర్భం వచ్చాక అబార్షన్ కోసం ప్రయత్నించినట్టు, అది వికటించి ఆమె చనిపోయినట్టు తెలుస్తోంది.