ఆంధ్రప్రదేశ్‌లో చెత్త పన్ను వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్ అవుతోంది. యూజర్ ఛార్జస్ పేరుతో వసూలు చేస్తున్న చెత్త పన్నును కొత్త ఆదేశాలు వచ్చే వరకు కలెక్ట్ చేయొద్దని స్పష్టమైన మౌఖిక ఆదేశాలు ఉన్నాయి. అయినా కొందరు అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు.  


చెత్త పన్ను వసూలు సరిగా చేయలేదని ఆ డబ్బులు సచివాలయ సిబ్బంది నుంచి రికవరీ చేయాలని ఏలూరు కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాలు వివాదానికి కారణమవుతున్నాయి. చెత్తపన్ను వసూలు ఆపేయాలని స్పష్టమైన గైడ్‌లైన్స్ ఉన్నప్పటికీ ఈ నోటీసులు చేయడం సంచలనంగా మారుతోంది. 


చెత్త పన్ను వసూలు ఆపేయాలని అధికారిక ఉత్తర్వులు రాలేదని అప్పటి వరకు పన్ను వసూలు ఆపొద్దని ఏలూరు కమిషనర్‌ సిబ్బందిని ఆదేశించారు. అలా వసూలు చేయడంలో ఫెయిల్ అయ్యారని 21 మంది శానిటరీ సిబ్బంది, కార్యదర్శులకు నోటీసులు ఇచ్చారు. చెత్త పన్ను వసూలులో వెనుకబడ్డందుకు జీతాల నుంచి రికవరీ చేస్తున్నట్టు ఆ ఆదేశాల సారాంశం. 


ఒక్కొక్క కార్యదర్శి  నుంచి లక్షన్నరకుపైగా వసూలు చేయబోతున్నట్టు అందులో పేర్కొన్నారు. వారికి ఈఎంఐ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్టు తెలిపారు. మొత్తం డబ్బులు ఒకేసారి రికవరీ చేయబోమని నెలనెల 7 నుంచి 8 వేలు వరకు కట్ చేసుకుంటామని నోటీసుల్లో సిబ్బందికి తెలియజేశారు. 


నోటీసులు అందుకున్న సిబ్బంది షాక్ అయ్యారు. అధికారిక ఉత్తర్వులు రాలేదని తమను టార్గెట్ చేయడం ఏంటని... మీడియాలో, సోషల్  మీడియాలో వచ్చిన న్యూస్‌తో ప్రజలు చెత్తపన్ను కట్టడం మానేశారని దానికి తమను బాధ్యతలను చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 


వైసీపీ ప్రభుత్వంలో యూజర్ ఛార్జెస్ పేరుతో చెత్త పన్ను వసూలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అప్పటి టీడీపీ... తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను తొలగిస్తామని హామీ ఇచ్చింది. మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో చెత్త పన్ను నిలిపేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. ఇంకా అధికారిక ఉత్తర్వులు మాత్రం వెలువడలేదు. దీన్నే షాక్‌గా చూపించి ఏలూరు కమిషనర్‌ ఇలా చెత్త పన్ను వసూల కోసం సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు. దీనిపై అధికార పార్టీ నేతలు, ప్రజలు మండిపడుతున్నారు.