ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిపోయిన ఓ చిన్నారి ఎట్టకేలకు సురక్షితంగా బయటికి వచ్చాడు. ఏలూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. సురేష్ అనే యువకుడికి తాడు కట్టి బోరు బావిలోకి దింపి 5 గంటల తర్వాత చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. జిల్లాలోని గుండుగొలనుగుంటలో పూర్ణ జస్వంత్ అనే 9 ఏళ్ల బాలుడిని స్థానికులు సాహసం చేసి ప్రాణాలతో కాపాడారు. సుమారు 5 గంటల పైనే అందులో చిక్కుకుని బాలుడు నరకయాతన అనుభవించాడు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలనుకుంట 9 ఏళ్ల పూర్ణ జశ్వంత్ అనే బాలుడు బుధవారం సాయంత్రం తన ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా.. అక్కడే ఉన్న ఓ బోరు బావిలో పడిపోయాడు. ఏళ్లుగా పూడుకుపోయిన 400 అడుగుల లోతు గల ఆ బోరుబావిలో పడిపోయాడు. ఆ బోరు బావి చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోయి ఆ రంద్రం కనిపించకుండా పోయింది. బాలుడు జస్వంత్ అటుగా వెళ్లి ఆ బోరుబావిని గమనించక, అందులో పడి జారి పోయాడు. అయితే, బాలుడు 30 అడుగుల లోతులో ఓ రాయిపై చిక్కుకున్నట్లుగా తెలిసింది.
పిల్లాడు జశ్వంత్ కనిపించకపోయేసరికి ఫ్యామిలీ మెంబర్స్ చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. ఆఖరికి రాత్రి 9 గంటల సమయంలో బోరు బావిలో నుంచి కేకలు వినిపించగా, అందులో పడిపోయినట్లుగా తెలుసుకున్నారు. దీంతో బోరుబావి వద్దకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని తాళ్ళ సహాయంతో బాలుడిని రక్షించేందుకు ప్రయత్నం చేశారు. అయితే అది వీలుకాక పోవడంతో స్థానిక యువకుడు సురేష్ తన నడుముకి తాడు కట్టుకొని బోరుబావిలో దిగాడు. తాడు కట్టి పైకి లాగాడు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈలోపు సమాచారం అందుకున్న భీమడోలు ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని బాలుడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. మొత్తానికి బాలుడు బయటికి రావడంతో అంతా ఆనందం వ్యక్తం చేశారు.