Konaseema News: క‌డుపున పుట్ట‌క‌పోయినా క‌న్న కూతురుగానే చూసుకున్న ఆ వృద్ధ దంప‌తుల‌కు ఓ పెంపుడు కుమార్తె అనుకోని షాక్ ఇచ్చింది. తినో తిన‌కో వారు క‌ష్ట‌ప‌డి సంపాదించిన రెండెక‌రాల‌కుపైబ‌డి స్థిరాస్థిని త‌న పేరున రాయించుకుని ఆపై మోహం చాటేసింది.. ఇప్ప‌డు ఉన్న ఇంటిని సైతం త‌న‌పేరున రాసివ్వాల‌ని వేధిస్తోంది. దీంతో కంటికి రెప్ప‌లా కాపాడుతుంద‌ని న‌మ్మి రాసిచ్చిన భూమీ లేక బతికేందుకు ఆధారం లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు ఆ వృద్ధ దంప‌తులు.. ఈ క్ర‌మంలోనే త‌మ కుమార్తెకు రాసిచ్చిన భూమిని వెన‌క్కి తీసుకుని త‌మ‌కు అప్ప‌గించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఆశ్ర‌యించారు ఆ వృద్ధ దంప‌తులు.. అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా అల్ల‌వ‌రం మండ‌లం మొగ‌ళ్ల‌మూరు గ్రామానికి చెందిన వాస‌ర్ల వెంక‌ట న‌ర‌స‌య్య‌, ల‌క్ష్మి దంప‌తులు అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా క‌లెక్ట‌రేట్‌లో సోమ‌వారం నిర్వ‌హించిన గ్రీవెన్స్‌లో జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.. 

Continues below advertisement

పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాం.. కానీ... 

జిల్లా క‌లెక్ట‌ర్‌కు వృద్ధ దంప‌తులు వాస‌ర్ల వెంక‌ట న‌ర్స‌య్య‌, ల‌క్ష్మీ దంప‌తులు త‌మ పెంపుడు కుమార్తెపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.  వారు తెలిపిన వివ‌రాలు ప్ర‌కారం.. అల్ల‌వ‌రం మండ‌లం మొగ‌ళ్ల‌మూరుకు చెందిన వాస‌ర్ల వెంక‌ట‌న‌ర్స‌య్య‌, ల‌క్ష్మి దంప‌తులు అండ‌మాన్‌లో టైల‌రింగ్ ప‌నిచేసుకుంటూ రెండు ఎక‌రాల 18 సెంట్లు కూడ‌బెట్టారు. పిల్ల‌లు లేని లోటు పూడ్చుకునేందుకు బంధువుల ఇంట్లోని ఆడ‌పిల్ల‌ను పెంచి పెద్ద‌చేశారు. విద్యా బుద్ధులు నేర్పించారు. ఆమెకు అన్ని లాంఛ‌నాల‌తో వివాహం కూడా జ‌రిపించారు. ఈక్ర‌మంలోనే తండ్రి  వెంక‌ట‌న‌ర్స‌య్య పేరు మీద ఉన్న 2.18 ఎక‌రాల భూమిని త‌న పేరున రాసివ్వాల‌ని పెంచిన కుమార్తె వాసంశెట్టి జ్యోతి అడ‌గ‌డంతో ప్రేమ‌తో ఆమె పేరుమీద రాసిచ్చారు. ఆత‌రువాత వీరు ఉంటున్న ఇంటిని కూడా త‌న పేరుమీద రాసివ్వాల‌ని కోరింది. ఇదిలా ఉండ‌గా అండ‌మాన్‌లో లీజు ప్రాతిప‌దిక‌న త‌మ పేరుమీద ఉన్న షాపుల‌ను కుమార్తె జ్యోతి, ఆమె భ‌ర్త వీర‌వెంక‌ట‌స‌త్య‌నారాయ‌ణ‌లు స్వాధీనం చేసుకుని దాని ద్వారా వ‌చ్చే అద్దెల‌ను కూడా వారే వారే తీసుకుంటున్నార‌ని, దీంతో తాము బతికేందుకు చాలా ఇబ్బందులు ప‌డాల్సిన ప‌రిస్థితి తలెత్తింద‌ని వెంక‌ట న‌ర్స‌య్య‌, ల‌క్ష్మి దంప‌తులు వాపోయారు. 

ఉన్న ఇంటిని రాసిచ్చేయాల‌ని వేధింపులు..

తీవ్ర అనారోగ్యానికి గురైన తండ్రి వెంక‌ట న‌ర్స‌య్య‌ను చూసింది స‌రిక‌దా క‌నీసం వారు క‌ష్ట‌ప‌డి క‌ట్టుకున్న ఇంటిని రాసిచ్చేయాల‌ని పెంపుడు కుమార్తె జ్యోతి వేధింపులు ఎక్కువ‌య్యాయ‌య‌ని వారు వాపోయారు. త‌న భ‌ర్త‌కు అనారోగ్యం ఏర్ప‌డితే దానికి ఆరోగ్య‌శ్రీ ద్వారా వైద్యం చేయించి ఈ వైద్యం కోసం రూ.ఆరు ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశాన‌ని తీసేసుకున్నాడ‌ని,  అండ‌మాన్‌లో త‌మ పేరుమీద లీజుకు తీసుకున్న షాపులు కూడా వారే ఆక్ర‌మించి దాని ద్వారా వ‌చ్చే అద్దెల‌ను చాలా కాలంగా తీసుకుంటూ ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌డం లేద‌ని వారు ఆరోపించారు. ఎప్ప‌టికైనా తను మారుతుందని చాలా కాలంగా ఎదురు చూశామ‌ని, అయినా ఆమెలో ఎటువంటి మార్పులేద‌ని తెలిపారు. త‌న పెంపుడు  కుమార్తె  చాలా కాలంగా త‌మ‌ను చూడ‌డం లేద‌ని, వృద్ధాప్యంలో అనారోగ్యం పాలైనా ఆస్తులు రాయించుకునేందుకు చూస్తుంది కానీ క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని క‌న్నీరు మున్నీర‌య్యారు. త‌మ ఖాతాల్లో ఉన్న డ‌బ్బులు సైతం త‌మ‌కు తెలియ‌కుండా కాజేశార‌ని, ప్ర‌స్తుతం బత‌క‌డానికి తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని అధికారుల‌కు తెలిపారు. త‌మ వృద్ధాప్యంలో చూస్తుంద‌న్న‌న‌మ్మ‌కంతో ఉన్న ఆస్తిని అంత‌టినీ పెంపుడు కుమార్తె పేరున రాసిచ్చామ‌ని ఇప్ప‌డు త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోయారు. ఈనేప‌థ్యంలోనే త‌మ కుమార్తె వాసంశెట్టి జ్యోతి పేరుమీద రాసిన దాన సెటిల్మెంట్ రిజిస్ట్రేష‌న్‌ను ర‌ద్దుచేసి త‌మ పేరున తిర‌గరాయించాల‌ని వారు జిల్లా క‌లెక్ట‌ర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం జిల్లా క‌లెక్ట‌రేట్‌లో నిర్వ‌హించే గ్రీవెన్స్‌లో ఫిర్యాదుచేశారు.

Continues below advertisement