స్నేహితుడి పుట్టిన రోజు పార్టీ కోసం తన ఊరికి చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటి నుంచి సంతోషంగా వెళ్లిన యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. దీంతో కన్న తల్లితండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తన కుమారునిది ముమ్మాటికి పథకం ప్రకారం హత్యే చేశారని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి చెందిన ఈలి వీరవెంకట రమేష్ అనే 20 ఏళ్ల వ్యక్తి ఓడలరేవులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతనితోపాటు ఇదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు ఇదే కళాశాలలో చదువుతున్నారు. అయితే మామిడికుదురు మండలానికి చెందిన వీరందరు స్నేహితుడి పుట్టిన రోజు అని మొత్తం 18 మంది యువకులంతా కలిసి ఈ నెల 10న(శనివారం) పాశర్లపూడి వద్ద నున్న ఓ రిసార్ట్స్‌లో రూమ్స్ బుక్ చేసుకుని రాత్రంతా అక్కడే గడిపారు.
11న(ఆదివారం) ఉదయం పదిగంటల సమయంలో ఎవరి ఇళ్లకు వాళ్లు తిరిగి వచ్చేస్తున్న క్రమంలో అల్లవరం వచ్చేసరికి స్నేహితుని బైక్ మీద వెనుక కూర్చున్న మృతుడు వీరవెంకట రమేష్ ఓ వైపుకు వాలిపోతూ పడిపోతుండగా బైక్ ఆపి చూసేసరికి కిందపడిపోయి అపస్మారక స్థితిలో ఉన్నాడని ఇద్దరు స్నేహితులు చెపుతున్నారు. స్పృహలోలేని రమేష్‌ను దగ్గర్లో ఉన్న అల్లవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామని, అయితే అప్పటికే రమేష్ మృతిచెందాడని అక్కడి వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై మృతుడు రమేష్ తల్లితండ్రులకు ఫోన్ ద్వారా స్నేహితులు సమాచారం ఇచ్చారు.
అయితే తమ కుమారుడు పూర్తి ఆరోగ్యంతో ఉంటాడని, ఎప్పుడూ ఏ చిన్న నలత లేని వాడు ఇలా అకస్మాత్తుగా ఎందుకు చనిపోతాడని మృతుని తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టి తమ కుమారుడు ఎలా చనిపోయాడో నిగ్గుతేల్చాలని అల్లవరం పోలీస్ స్టేషన్ వద్దకు ఆదివారం సాయంత్రం పెద్ద ఎత్తున మృతుడి కుటుంబీకులు, బందువులు తరలివచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన అమలాపురం రూరల్ సీఐ సురేష్‌బాబు, అల్లవరం ఎస్సై ప్రభాకర్‌రావులు కేసు నమోదు చేసి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇంతకీ రిసార్టులో ఏం జరిగింది?
బోడసకుర్రు పాశర్లపూడి మధ్య వైనతేయ నదీ పాయపై ఉన్న బ్రిడ్జికి ఆనుకునే ఈ రిసార్ట్ ఉంది. ఇక్కడే శనివారం రాత్రి ఈ యువకులంతా బర్త్‌డే పార్టీ చేసుకున్నారని తెలుస్తోంది. రాత్రంతా 18 మంది వరకు అక్కడే పార్టీ చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా 20 ఏళ్లు నిండకుండానే వీరంతా మద్యం సేవించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. మృతుడి తల్లితండ్రులు ఆరోపిస్తున్నట్లు మృతి వెనుక కుట్రకోణం దాగి ఉందా లేక మద్యం సేవించడం వల్ల ఏమైనా జరిగిందా అన్నది పోస్ట్‌మార్టం ఆధారంగా జరిగే పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.