Andhra Pradesh : ఇటీవల కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై, కానిస్టేబుల్‌ చనిపోయారు. మరో కానిస్టేబుల్‌, కారు డ్రైవర్‌ గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన తీరు పరిశీలిస్తే ప్రాథమికంగా డ్రైవరు నిద్రమత్తు వల్లనే జరిగి ఉండవచ్చని తేలింది. రంగంపేట మండలం వడిసలేరు వద్ద ఏడీబీ రోడ్డుపై రెండు కుటుంబాలకు చెందిన అయిదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో పగటి పూటనే రోడ్డు చెంతన ఆగి ఉన్న ట్యాంకర్‌ను మహింద్రా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో కూడా డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి నిద్రమత్తు కారణంగానే జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు పోలీసులు. 

ఈ ఒక్క ఉదాహరణే కాదు. ఇటీవల జాతీయ రహదారుల్లో జరిగిన ఘటనలను చూస్తే పోలీసుల ప్రాథమిక దర్యాప్తుల్లో చాలా వరకు నిద్రమత్తు వల్లనే అని చెబుతున్నారు. సమయాన్ని అడ్జెస్ట్ చేసుకోవాలంటే చాలా మంది ముందుగా నిద్ర సమయాన్ని తగ్గించేస్తారు. ఇప్పుడు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణం ఇదేనని పోలీసులు చెబుతున్నారు. మనికిషి రోజుకు కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. అయితే రోజులో పట్టుమని నాలుగు గంటలు కూడా నిద్ర పోకుంటే శరీరం విశ్రాంతి కోరుతుంది. మెదడు ఆ వ్యక్తి ఆధీనంలో ఉండదు. పనితీరు మందగిస్తుంది. దీంతో ఏకాగ్రత కోల్పోతారు. రోజూవారీ పనులు కూడా చేసుకోలేకపోతారు. 

శరీరానికి విశ్రాంతి లేకపోవడంతో మనిషి మెళకువగా ఉన్నట్లు కనిపిస్తున్నా మెదడు మాత్రం నిద్రావస్తలోకి జారుకుంటుంది. అందుకే అప్పటి వరకు మెళకువుగా, చాలా యాక్టీవ్‌గా ఉన్నప్పటికీ ఉన్నఫళంగా నిద్రలోకి కళ్లు మూతలు పడతాయి. క్షణాల్లో ఇది జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలకు ఎక్కువ కారణం ఇదే. 

ప్రధాన శత్రువు షోషల్‌ మీడియానే..పగటి పూట చాలా వరకు దైనందిన పనుల్లో నిమగ్నమై తీరిక లేకుండా పని చేస్తున్నారు. సుమారు 8 గంటల వరకు సెల్‌ఫోన్‌ చూడలేని పరిస్థితి చాలా మందిలో ఉంటుంది. డ్యూటీలు చేసేవారు వారి విధుల్లో వారు బిజీగా ఉండడం కూడా సెల్‌ఫోన్‌ వాడే పరిస్థితి ఉండదు. అయితే డ్యూటీ పూర్తై లేదా పని పూర్తిచేసుకుని కొంచెం తీరిక దొరికితే చాలు వెంటనే సెల్‌ఫోన్‌పైనే దృష్టి పెడుతున్నారు. తమకు తెలియకుండానే గంటల తరబడి ఆ సెల్‌ఫోన్ ధ్యాసలో పడిపోతున్నారు. 

రకరకాల సోషల్‌మీడియా వేదికలు రమ్మని పిలుస్తుంటాయి. వీటికి అట్రాక్ట్‌ అవుతున్నవారిలో పెద్దా చిన్నా అన్న తేడా లేకుండా వాటిపైనే సమయాన్ని గడిపేస్తున్నారు. ఒకదాని తరువాత ఒకటి చొప్పున గంటల తరబడి గడపడం వల్ల సమయం తెలియకుండా పోతోంది. కొంత మంది భోజనం చేయడాన్ని కూడా పక్కన పెట్టిమరీ సెల్‌ఫోన్‌లో లీనమైపోతున్నారు. ఇలా తెలియకుండానే అర్ధరాత్రి దాటినా సోషల్‌ మీడియాలో పోస్టులు చూస్తూ కాలం గడిపేస్తున్నారని చెబుతున్నారు. 

ఇది కచ్చితంగా నిద్ర మీద ప్రభావం చూపిస్తోంది. అర్ధరాత్రి దాటాక కూడా నిద్రపోకుండా సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేసి ఆపై జీవనాధారం అయిన పనికో లేక ఉద్యోగానికో నిర్ణీత సమయానికి చేరుకునేందుకు హడావిడిగా రెడీ అయ్యి వెళ్తున్నారు. ఇలా సరైన సక్రమ నిద్రకు సమయం లేకుండా పోతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంతో నిద్రలేమి సమస్య వెంటాడి వారి ఆరోగ్యస్థితినే కాకుండా ఆలోచనా శక్తిని దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన నిద్ర లేకపోవడం మెదడు పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దీని వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.. 

మెదడు పనితీరుపై ప్రభావం..ఏకాగ్రత జ్ఞాపకశక్తి తగ్గుదల:  నిద్రలేమి వల్ల మెదడులోని హిప్పోకాంపస్ (జ్ఞాపకశక్తికి కీలకమైన భాగం) పనితీరు బలహీనపడుతుంది. దీని వల్ల ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి తగ్గుతాయి. నిద్ర లేకపోవడం వల్ల ప్రిఫ్రంటల్ కార్టెక్స్ (నిర్ణయాలు తీసుకునే భాగం) పనితీరు దెబ్బతింటుంది, దీని వల్ల సమస్యలు పరిష్కరించే సామర్థ్యం తగ్గుతాయి. నిద్రలేమి అమిగ్డాలా (భావోద్వేగాలను నియంత్రించే భాగం) పై ప్రభావం చూపుతుంది, దీని వల్ల చిరాకు, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటివి పెరుగుతాయి. నిద్రలేమి వల్ల మెదడు సమాచారాన్ని ప్రాసెస్ చర్య వేగం తగ్గుతుంది, సృజనాత్మక ఆలోచనలు, సమస్య పరిష్కార సామర్థ్యం దెబ్బతింటాయి.

నిద్రలేమి వల్ల వచ్చే అనర్థాలు..నిద్ర‌లేమి వ‌ల్ల‌ మానసిక ఆరోగ్య సమస్యలు త‌లెత్తుతాయి. దీర్ఘకాల నిద్రలేమి ఆందోళన (anxiety), డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యలను పెంచుతుంది. రోగనిరోధక శక్తి తగ్గడం, గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఉద్యోగంలో లేదా చదువులో ఉత్పాదకత తగ్గడం, పొరపాట్లు చేయడం, ప్రమాదాలకు గురయ్యే అవకాశం పెరుగుతుంది (ఉదా: డ్రైవింగ్ సమయంలో నిద్రమత్తు). చిరాకు, ఓర్పు తగ్గడం వల్ల కుటుంబం, స్నేహితులతో సంబంధాలు దెబ్బతినవచ్చు. దీర్ఘకాలంలో నిద్రలేమి అల్జీమర్స్, డిమెన్షియా వంటి న్యూరోడిజనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.