ఒకప్పడు డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్దీక స్వావలంబన అందించేందుకు నడుంకట్టిన టీడీపీ ప్రభుత్వం తాజాగా అదే డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలను వ్యాపార రంగంలో ముందుకు తీసుకెళ్లి వారిని మరింత ఆర్దీక పరిపుష్టి దిశగా నడిపించేందుకు ఇప్పడు కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకువేసింది.. ఇంతవరకు నిర్ధిష్ట పరిమితిలో ఇచ్చే స్త్రీ నిధి, ఉన్నతి పథకాల ద్వారా రుణాలు ఇప్పడు గరిష్ట రుణ పరిమితి రూ.2 లక్షల వరకు పెంచి ఆర్దీక సాయం అందించే దిశగా నిర్ణయం తీసుకుంది.. దీనికోసం ఈనెల 15వ తేదీ నుంచి ప్రత్యేక ఈ సర్వే చేపట్టి ఆసక్తి కలిగిన మహిళల వివరాలు సేకరించనుంది..
డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఈ సర్వే..
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహించనున్నారు. ఇప్పటికే వ్యాపారంలో ఉన్న మహిళల వద్దకు నేరుగా అధికారులు వెళ్లి వారు నిర్వహిస్తోన్న వ్యాపార వివరాలు, ఆర్జిస్తోన్న లాభాలు, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు అనే పలు అంశాలను సేకరిస్తారు. అదేవిధంగా ఇంతకు ముందు ఎటువంటి వ్యాపారం లేకపోయినా వారికున్న ఆసక్తిని బట్టి వారిలో ఉన్న నైపుణ్యాలను, వారు ఏ వ్యాపారంలో ఆసక్తి కలిగి ఉన్నారు.. ఎంతమేరకు వారికి పెట్టుబడి అవసరం ఉంటుంది.. ఇలా అనేక విషయాలపై కూడా వివరాలు సేకరిస్తారు.. యూనిట్లను జీవనోపాధుల, ఎంటర్‌ప్రెన్యూర్, ఎంటర్‌ప్రైజెస్ అనే మూడు విభాగాలుగా వర్గీకరించి, వాటి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తారు.
బ్యాంకుల ద్వారా రూ.2 లక్షల వరకు..
ఒకప్పడు స్త్రీ నిధి, ఉన్నతి స్కీమ్‌ల ద్వారా నిర్ధిష్ట పరిమితిలోనే రుణాలు ఇచ్చే వారు. అయితే ఇప్పడు ప్రభుత్వం తాజా నిర్ణయంతో రూ.2లక్షల వరకు రుణాలు లభించే అవకాశం ఉంది.. ఈ సర్వేలో గుర్తించిన అర్హులైన మహిళలకు తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించనుండగా బ్యాంకుల ద్వారా కనిష్ఠంగా రూ. 10 వేల నుంచి గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు రుణం మంజూరు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.. అంతేకాకుండా స్త్రీనిధి పథకం ద్వారా రూ. లక్ష వరకు, ఎస్సీ, ఎస్టీ ఉన్నతి పథకం కింద రూ. 2 లక్షల నుంచి అవసరాన్ని బట్టి రూ. 10 లక్షల వరకు కూడా రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. యూనిట్ విస్తరణకు రుణాలు పొందాలంటే, ఆ వ్యాపారం ద్వారా కనీసం మరొకరికి ఉపాధి కల్పించాలనే నిబంధనను పాటించాల్సి ఉంటుంది..
రాష్ట్రంలో డెయిరీ, పచ్చళ్లు, ఆహార శుద్ధి, కలంకారి, పేపర్ ప్లేట్లు వంటి చిన్న తరహా పరిశ్రమలను సక్సస్‌గా నిర్వహిస్తుండగా ఈ సర్వేలో భాగంగా యూనిట్ల వివరాలను, ఫోటోలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేసి పారదర్శకత పాటిస్తున్నారు. దీనిపై మరింత వివరాలు తెలుసుకోవాలని ఉంటే డీఆర్‌డీఏ అధికారులను సంప్రదిస్తే వారు వివరించనున్నారు..