Dindi - Chinchinada Bridge: ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌ను క‌లుపుతూ దిండి- చించినాడ గ్రామాల వ‌ద్ద వ‌శిష్ట న‌దీపాయ‌పై నిర్మించిన వంతెన మ‌ర‌మ్మ‌త్తుల పేరుతో భారీవాహ‌నాలను నిషేదించి ఇప్ప‌టికి 8నెల‌లు పూర్తి కావ‌స్తుంది.. అయిన‌ప్ప‌టికీ మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న సాగుతుండ‌డం ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఆగ్ర‌హాన్ని క‌లిగిస్తోంది. అటు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా, న‌ర్సాపురం జిల్లాలు ఇటు అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాల్లో ఉన్న విద్యాసంస్థ‌ల‌కు అధిక సంఖ్య‌లో విద్యార్ధులు ప్ర‌తీరోజూ రాక‌పోక‌లు సాగిస్తుంటారు. ఈ వంతెన మ‌ర‌మ్మ‌త్తుల‌తో అటుగా విద్యార్థులు న‌డిచి వచ్చి వెళుతుండ‌డంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఇదే త‌ర‌హాలో ఉద్యోగులు కూడా అనేక సమస్యలు లేవనెత్తుతున్నారు. ముఖ్య‌ంగా మ‌హిళ‌లు ఇబ్బందులు అయితే వ‌ర్ణ‌ణాతీతం అంటున్నారు..

Continues below advertisement

బ‌స్సు ఎక్కి దిండి వ‌ద్ద దిగాల్సి వ‌స్తుంద‌ని, మ‌ళ్లీ వంతెన పొడ‌వునా న‌డిచి చించినాడ వెళ్లి అక్క‌డ బ‌స్సు ఎక్కి వెళ్లాల్సి వ‌స్తోంద‌ని, అదేవిధంగా సాయంత్రం తిరిగి ఇళ్ల‌కు వ‌స్తున్న‌ప్పుడు చించినాడ వ‌ర‌కు బ‌స్సులో వ‌చ్చి అక్క‌డి నుంచి వంతెన పక్క నుంచి న‌డిచి మ‌ళ్లీ దిండి వ‌ద్ద బ‌స్సు ఎక్కాల్సి వ‌స్తోంద‌ని తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.. ఇదే త‌ర‌హాలో క‌ళాశాల బ‌స్సులు వంతెన‌కు ఇరువైపులా ఉంచి విద్యార్థుల‌ను త‌ర‌లిస్తున్నాయి. ఈమధ్యలో వంతెన పొడ‌వునా న‌డుచుకుంటూ వెళ్ల‌డం వ‌ల్ల రెండు గంట‌ల స‌మ‌యం వృథా అవుతుందంటున్నారు విద్యార్థులు.. దీని వ‌ల్ల అల‌సిపోవ‌డం, కాలేజీల‌కు లేట్ అవ్వ‌డం జ‌రుగుతుంద‌ని వివరిస్తున్నారు. ఈప్ర‌భావం చ‌దువుపై ప‌డుతుందంటున్నారు...

Continues below advertisement

అస‌లు మ‌ర‌మ్మ‌త్తుల వెనుక జాప్యానికి కార‌ణం..?

దిండి - చించినాడ వ‌ద్ద 216 జాతీయ ర‌హ‌దారిని క‌లుపుతూ ఉన్న ఈ వంతెన ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు.. కేవ‌లం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లే కాదు విశాఖప‌ట్నం నుంచి వ‌చ్చిన వారు నర్సాపురం, మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ వెళ్లేవారు ఎక్కువ‌గా  ఈ ర‌హ‌దారి ద్వారా ప్ర‌యాణాలు సాగిస్తుంటారు.. ట్ర‌క్కులు, గూడ్స్ వెహిక‌ల్స్ కూడా ఈ రోడ్డు ద్వారా ఎక్కువ‌గా రాక‌పోక‌లు సాగిస్తుంటాయి.. ఈ వంతెన మమ్మ‌త్తుల‌తో భారీ వాహ‌నాల‌కు బ్రేక్ వేశామ‌ని చెబుతున్నా రాత్రి వేళ‌ల్లో అయితే లైట్ మోటారు వెహిక‌ల్స్‌కు కూడా అనుమ‌తులు నిలిపివేయ‌డం ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి కార‌ణం అవుతుంది..

2025 ఆగ‌స్టు 25 నుంచి మ‌ర‌మ్మ‌త్తుల నిమిత్తం ఈ వంతెన‌పై  నిషేదాజ్క్ష‌లు విధించారు. అప్ప‌టి నుంచి బ‌స్సులు, లారీలు, ఐష‌ర్ వేన్‌లు ఇలా కొంచెం పెద్ద వాహ‌నాలు ఏవీ రాకుండా నిషేదించారు. కార్లు, ఆటోలు, బైక్‌ల‌కు మాత్ర‌మే  వెళ్లేందుకు అవ‌కాశం క‌ల్పించ‌డ‌గా వాటికి కూడా రాత్రివేళల్లో నిలిపివేయ‌డంతో ఈ వంతెన‌పై ఏ స‌మ‌యంలో ఎటువంటి ఆటంకం క‌లుగుతుందో తెలియ‌ని ప్ర‌జ‌లు ఈ మార్గంలో ప్ర‌యాణాలు విర‌మించుకుంటున్నారు.. ఇప్ప‌టివ‌ర‌కు వంతెన బేరింగ్ ప‌నులు చేస్తోన్న స‌ద‌రు కాంట్రాక్ట్ సంస్థ ఈ ప‌నుల‌ను కూడా న‌త్త‌న‌డ‌క‌న చేస్తుంద‌ని విమ‌ర్శిస్తున్నారు. మ‌రో నెల రోజులు పైబ‌డి వంతెన మ‌ర‌మ్మ‌త్తులు జ‌రుగుతాయ‌ని అధికారులు చెబుతున్న‌ప్ప‌టికీ మ‌రో మూడు నెల‌ల వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి కొన‌సాగేలా ఉంద‌ని ప్ర‌జ‌లు పెద‌వి విరుస్తున్నారు.

ఎనిమిది నెల‌ల నుంచి ఇదే వ‌రుస‌...

వంతెన బేరింగ్ మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు నిర్వ‌హించే క్ర‌మంలో వంతెన పిల్ల‌ర్ల వ‌ద్ద ఉన్న జాయింట్‌పై ఒత్తిడి ప‌డ‌కుండా పైన ఒక తాత్కాలిక ఇనుప వంతెన అమ‌ర్చుతున్నారు. ఇది ర్యాంప్ లు క‌లిగి ఎత్తుగా ఉండ‌డంతో ప్ర‌మాదాలు కూడా జ‌రుగుతున్నాయంటున్నారు. తాత్కాలిక వంతెన ర్యాంపు ఎక్కించే క్ర‌మంలో కార్లు వేగాన్ని పెంచి వెళ్ల‌డం వ‌ల్ల ప‌లు ప్ర‌మాదాలు జ‌రిగాయ‌ని చెబుతున్నారు. 2025 ఆగ‌స్టు 25 నుంచి ప్రారంభ‌మైన ఈ మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు పొడిగిస్తూ వ‌స్తున్నారు.. ఇప్ప‌టికే మూడు సార్ల వంతెన‌పై నిషేదాజ్ఞ‌లు పొడిగిస్తూ వ‌చ్చిన స‌ద‌రు కాంట్రాక్టు సంస్థకు ఇచ్చిన గ‌డువు పూర్తి అయినా ఇప్ప‌టికీ మ‌ర‌మ్మ‌త్తులు పూర్తి చేయ‌లేని దుస్థితి క‌నిపిస్తోంది. కొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయిలో వంతెన మ‌ర‌మ్మ‌త్తులు పూర్తిచేస్తామ‌ని చెప్పుకొస్తున్నా అక్క‌డ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి మ‌రో మూడు నెల‌లు పాటు కాల‌యాప‌న చేసేలా ఉన్నార‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.