Crocodiles in Konaseema: కోనసీమ లంక భూముల్లో మొసలి భయం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. గోదావరి వరదల్లో కొట్టుకువచ్చిన మొసలి లంక భూముల్లోని నీటి మడుగుల్లో ఉండడంతో ఇప్పడు లంక రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో కోనసీమ ప్రాంతంలో పంటకాలువల్లోకి కనిపించిన మొసలి సుమారు నెల రోజుల పాటు తీవ్ర భయాన్ని అయితే కలిగించింది. ఎట్టకేలకు బంధించిన అధికారులు రంపచోడవరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇప్పడు అయినవిల్లి లంక ప్రాంతంలో మొసలి తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది..
వరదలకు కొట్టకు వచ్చిన మొసలి..
ఈ ఏడాది ఆరుసార్లుకుపైగా గోదావరికి వరదలు పోటెత్తాయి.. సాధారణంగా వరదలకు పాములు, కొండచిలువలు, జింకలు ఇతరాత్ర జంతువులు వరద ప్రవాహానికి కొట్టుకువచ్చిన సందర్భాలు చాలానే ఉంటుంటాయి. అయితే ఇప్పడు గోదావరి వరదలకు ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చిందో తెలియదు కానీ ఓ మొసలి లంక నీటి మడుగుల్లో తిష్టవేసి భయపెడుతోంది. మూడు రోజుల క్రితం మొసలి జాడ లభ్యమైన నాటి నుంచి లంక భూముల్లో వ్యవసాయ పనులు చేసుకునే రైతులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కె.గంగవరం మండలాల సరిహద్దు ప్రాంతాల్లోని లంక భూముల్లో ఉన్న నీటి మడుగుల్లో మొసలి ఉందన్న వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ప్రాంతంలో పశువులను మేపుకునేందుకు తరచూ రైతులు వస్తుంటారు. మరోపక్క ఉద్యాన పంటలు అయిన మొక్కజొన్న, కాయగూరల పంటలు పండిస్తుంటారు. ఈ నీటి మడుగుల్లో ఉన్న నీటిలో మొసలి సంచరిస్తుందని నిర్ధారణ అవ్వడమంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. అటు పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఈ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ డీఎఫ్‌వో ప్రసాదరావు ఆధ్వర్యంలో మొసలిని బందించేందుకు సుమారు 10 ఎకరాలకుపైబడి ఉన్న నీటి మడుగుల్లో ట్రాప్ బోన్ ఏర్పాటు చేశారు. అయితే సోమవారం కూడా బోన్‌లో మొసలి చిక్కలేదు.
మరోపక్క పి.గన్నవరం సీఐ ఆర్ భీమరాజు స్థానిక ఎస్సైతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే మొసలిని చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి లంకలోకి చాలా మంది తరలివస్తుండడంతో వారిని నియంత్రించి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.
రెండు ఉన్నాయని చెబుతున్న స్థానిక రైతులు..
లంక భూముల్లో ఇటుక బట్టీల కోసం తవ్విన గుంతలే ఇప్పుడు నీటి మడుగులుగా మారాయి. ఇవి చాలా లోతులో నీటితో నిండి ఉండడం కనిపిస్తోంది. అయితే వారం రోజుల క్రితం అయినవిల్లి లంక ప్రాంతంలో ఓ మొసలి స్థానిక మత్స్యకారులకు కనిపించింది. తీవ్ర భయాందోళనలకు గురైన మత్స్యకారులు ఈ సమాచారాన్ని స్థానిక రైతులకు చేరవేశారు. రైతులు, కొంత మంది యువకులు కలిసి మొసలిని నిర్ధారించేందుకు గస్తీ కాశారు. నీటి మడుగు ఉన్న ప్రాంతంలో గట్టుమీద కొంత మంది యువకులకు కనిపించడంతో భయాందోళనలతో అటవీశాఖ అధికారులకు ఈసమాచారాన్ని తెలిపారు. అటవీశాఖ అధికారులు రంగ ప్రవేశం చేసి చెరువులో మొసలి ఉందన్న విషయాన్ని దృవీకరించారు. నీటి మడుగుల్లో ఉన్నమొసలి ఒకటా లేక రెండా అన్న మీమాంస స్థానిక ప్రజలనుంచి వ్యక్తం అవుతోంది.. చాలా మంది ఈ నీటి మడుగుల్లో మరో మొసలి ఉందని స్థానిక యువకులు చెబుతున్నారు. అయితే దీనిని అటవీశాఖ అధికారులు మాత్రం ధృవీకరించలేదు..