Konaseema District CM Jagan Tour: కోనసీమ జిల్లాలో సంభవించిన వరదల నష్టంపై అంచనాలు పూర్తి కాగానే ప్రజల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. గతంలో ఏనాడూ లేని విధంగా ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందని అన్నారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం ఉదయం నుంచి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పుచ్చకాయలవారి పేట, ఊడుమూడి లంక, గంటిపెదపూడి తదితర చోట్ల బాధితులతో మాట్లాడారు. వారిని కలిసి పరామర్శించారు. వరద బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.


గంటిపెదపూడిలో వరద బాధితులతో సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ నష్టపరిహారం, నిత్యవసరాలు అందించాం. ఏ ఒక్కరూ మాకు అందలేదు అనడం లేదు. పశువులకు నోరు ఉంటే అవి కూడా మెచ్చుకునేలా మేం సాయం చేశాము. ముఖ్యమంత్రి అంటే ఆదేశాలు ఇవ్వాలి. వరదల్లో నేను వచ్చుంటే అధికారులు నా చుట్టూ తిరిగేవారు. ఫోటోల్లో, టీవీల్లో బాగా కనిపించేవాడిని. కానీ, పబ్లిసిటీ అవసరం లేదు. సామాన్య జనం ఇబ్బంది పడకూడదనే వారం రోజులు టైమ్ ఇచ్చి వచ్చాను. జి.పి.లంక వంతెన నిర్మిస్తాము. ఈ ఏడాదిలోనే పంటలకు నష్టపరిహారం చెల్లిస్తాం’’ అని సీఎం జగన్ మాట్లాడారు.


రెండో రోజు రేపు (జూలై 27న) అల్లూరి, ఏలూరు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన 
రెండో రోజు కూడా గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా సీఎం జగన్ మాట్లాడనున్నారు. ఉదయం 8.30 గంటలకు రాజమహేంద్రవరం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌ నుంచి బయలుదేరి ఏఎస్‌ఆర్‌ జిల్లా చింతూరుకు సీఎం చేరుకోనున్నారు. ఉదయం 9.30 గంటలకు చింతూరు మండలం కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సమావేశమవుతారు. ఆక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలిస్తారు. అనంతరం తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.