CM Jagan on Pawan Kalyan: భీమవరంలో వైఎస్ఆర్ సీపీ నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మరోసారి ఘాటుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాన్ వ్యక్తిగత జీవితం గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నాలుగేళ్లకోసారి కార్లు మార్చినట్లుగా దత్తపుత్రుడు భార్యలను మారుస్తున్నారని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రస్తుతం నియోజకవర్గాలను కూడా అలవోకగా మారుస్తున్నారని అన్నారు. పెళ్లికి ముందు దత్తపుత్రుడు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లల్ని పుట్టించిన తర్వాత భార్యలను వదిలేశారని జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలా ఒకసారి చేస్తే పొరపాటు అని.. మళ్లీ మళ్లీ చేస్తే అది అలవాటు అని అంటారని జగన్ అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు గురించి విమర్శలు చేస్తూ.. ఆయన జీవితమంతా వెన్నుపోట్లు, కుట్రలు, పొత్తులతో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రొయ్యకు మీసం, బాబుకు మోసం పుట్టుకతో వచ్చాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు, అభివృద్ధికి అసలు సంబంధమే లేదని.. విపక్షాలు విసిరే బాణాలు జగన్‌కు తగులుతున్నాయా? ప్రజలకు తగులుతున్నాయా? చెప్పాలని అన్నారు. బాబు వస్తే జాబులు రావడం కాదని.. ఉన్నవి కూడా ఊడిపోతాయని విమర్శించారు.
2014లో కూడా కూటమి నేతలు మేనిఫెస్టో ఇంటింటికీ పంపి హామీలను గాలికొదిలారని అన్నారు. జగన్‌కు అనుభవం లేదని.. చంద్రబాబుకు అనుభవం ఉందని అదే పనిగా చెప్పుకున్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు. ఇదిగో మైక్రోసాఫ్ట్, అదిగో సింగపూర్ అంటూ చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారని అన్నారు. ఇన్ని అబద్దాల తర్వాత చంద్రబాబు సింగపూర్ కట్టాడా? బుల్లెట్ ట్రైన్ వచ్చిందా? ఒలింపిక్స్ జరిగాయా? అని జగన్ ప్రశ్నించారు.