Cheetah in Polavaram: ఏలూరు జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో  చిరుత సంచారం కనిపించింది. ఈరోజు తెల్లవారుజామున ప్రాజెక్టులో కార్మికులు ప్రయాణిస్తున్న ఓ కారుకు చిరుత పులి అడ్డం వచ్చింది.


ఒక్కసారిగా కారుకి అడ్డంగా చిరుత రావడంతో వాళ్లంతా భయపడ్డారు. అయితే కారును చూసినా.. అందులో ఉన్న వ్యక్తుల్ని చూసినా... చిరుత పులి ఏమీ అనకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది. పోలవరం ముంపు గ్రామాలను అధికారులు గతంలోనే ఖాళీ చేయించడంతో... ప్రస్తుతం ఖాళీగా ఉన్న గ్రామాల్లో అడవి జంతువులు తిరుగుతున్నాయి.


ఇక్కడికి చాలా దగ్గరలోనే పాపికొండల అభయారణ్యం ఉండడంతో ఖాళీ అయిన 19 గ్రామాలలో.. అడవి జంతువులు సంచరిస్తున్నాయి. రాత్రి వేళలో గోదావరి నది వద్దకు వచ్చి నీరు తాగుతున్నట్లు కార్మికులు చెబుతున్నారు. కార్మికులతోపాటు అక్కడ పని చేస్తున్న అధికారులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు, ఎటు నుంచి చిరుత పులి వస్తుందో తెలియక గజగజా వణికిపోతున్నారు.