ఆంధ్రప్రదేశ్ స్టేట్‌ ఫైబర్ నెట్ మరో అడుగు ముందుకేసింది. రిలీజ్ అయిన రోజే కొత్త సినిమాను ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చూసే ఫెసిలిటీని తీసుకొస్తోంది. ఈ మేరకు ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్‌ గౌతమ్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 


సినిమా తీసే ప్రొడ్యూసర్‌కు, వీక్షించే ప్రేక్షకుడికి ఇరువురుకీ లాభం కలిగే విధంగా వినూత్న విధానానికి ఏపీ ఫైబర్‌ నెట్‌ శ్రీకారంచుట్టబోతోంది. ఇకపై ఇంట్లోనే కొత్త సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో అనే పద్ధతిలో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు ఏపీఎస్ఎఫ్ఎల్‌ ఛైర్మన్‌ గౌతమ్ రెడ్డి. 2 జూన్, 2023న విశాఖపట్నంలోని పార్క్ హోటల్‌లో లాంఛనంగా ప్రారంభించే ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అదే విధంగా హీరో సాయి రోనార్క్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు సి.కళ్యాణ్, రమా సత్యనారాయణ హాజరుకానున్నారన్నారు. 


ఏపీఎస్ఎఫ్ఎల్‌లో మొదట నిరీక్షణ అనే సినిమా ప్రదర్శిస్తామని తెలిపారు గౌతమ్ రెడ్డి. ఏపీఎస్ఎఫ్ఎల్‌ను కూడా ఒక థియేటర్‌లా భావించాలని అన్నారు. రోజురోజుకి సినిమా అభిమానులు పెరుగుతున్న టైంలో ఓటీటీ లాంటి అనేక మాధ్యమాలు పుట్టుకొస్తున్న తరుణంలో ఈ విధానం తీసుకొచ్చినట్టు చెప్పారు. రూ.99తో సబ్ స్ర్కైబ్ చేసుకునేవారికి కొత్త సినిమా వీక్షించే అవకాశం కల్పించామన్నారు. 
దీని కాలపరిమితి సబ్ స్ర్కైబ్ చేసుకున్న టైం నుంచి 24 గంటల వరకూ ఉంటుంది. ఇది ఓటీటీ తరహాలో కాకుండా నేరుగా లైవ్ చూసేలా రూపొందించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఏపీఎస్ఎఫ్ఎల్ కనెక్టివిటీ ఎక్కువ ఉండటంతో పట్టణాలకు వచ్చి థియేటర్‌లో సినిమా వీక్షించలేని వారికి ఈ విధానం మరింతంగా ఉపయోగపడుతుంది. 


ఈ విధానం ఏ ఒక్క యాజమాన్యానికిగానీ, థియేటర్ ఓనర్స్‌కి గానీ, యాక్టర్స్‌కి గానీ ఏ రకమైన ఇబ్బంది కలిగించేది కాదని గౌతమ్‌ రెడ్డి స్పష్టం చేశారు. థియేటర్ యాజమాన్యాలు కూడా దీని ద్వారా తమ ఆదాయం పడిపోతుందని భావించాల్సిన అవసరం లేదన్నారు.  ప్రొడ్యూసర్‌లు ఎవరైనా ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థతో మాట్లాడిన తర్వాత ఇందులో సినిమా ప్రదర్శన జరుగుతుందన్నారు. 


సేవలు మరింత వేగంగా...
ఏపీఎస్ఎఫ్ఎల్‌ను రాష్ట్ర ప్రజానీకానికి మరింత చేరువ చేసేందుకు 55వేల కి.మీల ఓఎఫ్‌సీ వైర్‌ను తీసుకెళ్లాలన్న లక్ష్యం పెట్టుకున్నామని, ఇప్పటివరకు 37వేల కి.మీల వరకు తీసుకెళ్లామన్నారు. 11,254 గ్రామ పంచాయతీల్లో 7600 పైచిలుకు గ్రామాలకు ఫైబర్ నెట్ కనెక్టివిటీ ఇచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫైబర్ నెట్ అత్యద్భుతంగా పనిచేస్తుందని సాక్షాత్తు పార్లమెంట్‌లోనే చర్చించారన్నారు. 


పాఠశాలలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు సైతం ఫైబర్ నెట్ అనుసంధానించామని గుర్తు చేశారు. ప్రజలందరికీ ఫైబర్ ను చేరువ చేసేందుకు రెండు మూడు నెలల్లో కొత్త బాక్స్ లకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే 5 కంపెనీలతో చర్చలు జరిపామన్నారు. బాక్స్‌ల కొరత అధిగమిస్తామన్నారు. 4 ఏళ్ల కాలంలో ఏపీఎస్ఎఫ్ఎల్‌ను మరింత బలోపేతం చేయడానికి ప్రణాళికలు తయారుచేశామన్నారు. భవిష్యత్‌లో మంచి రోజులు వస్తాయన్నారు.


నాలుగేళ్ల కాలంలో....
అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ప్రజా సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి  జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుందన్నారు గౌతమ్ రెడ్డి. నాలుగేళ్లలో వినూత్న సంస్కరణలు, విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ప్రతి గ్రామంలో 40 మంది ఉద్యోగులు పనిచేసేలా చేయడమే గాక, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారన్నారు. సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతో 32 లక్షల ఇళ్లతో పేదోడి సొంతింటి కల నెరవేర్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు. 10 పోర్టులు, 3 ఎయిర్ పోర్టుల నిర్మాణం, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు, పారిశ్రామిక రాయితీలు, భారీ సదస్సు ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా పారిశ్రామిక రంగానికి తో మరింత ఊతమిస్తున్నారన్నారు..