అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ చీటింగ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఎంపీగా ఉన్న స‌మ‌యంలో ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని త‌మ ద‌గ్గ‌ర ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌సూళ్ల‌కు పాల్ప‌డి మోసం చేశార‌ని చింతా అనురాధ పీఏ, మ‌రో ఇద్ద‌రిపై కొంద‌రు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ల‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచార‌ణ‌కు ఆదేశించిన కూట‌మి ప్ర‌భుత్వం ద‌ర్యాప్తు చేయాల‌ని జిల్లా ఎస్పీ కృష్ణ‌రావును ఆదేశించింది. బాధితుల ఫిర్యాదుపై విచార‌ణ చేసిన పోలీసులు మాజీ ఎంపీ అనురాధ పీఏ కుంచే శ్రీ‌కాంత్‌, ఆమె ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీగా ప్రచారం చేసుకున్న కొమ్ముల చ‌ర‌ణ్‌, రాజోలు ప్రాంతానికి చెందిన మారుబోయిన రాంబాబుల‌పై రాజోలు పోలీసులు కేసు న‌మోదు చేశారు.

అనురాధ‌, ఆమె అనుచ‌రుల‌పై ఆరోప‌ణ‌లు..

 స్మార్ట్‌ విలేజ్‌ల పేరుతో ఉద్యోగాల ఎర చూపి లక్షలాది రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారన్న అభియోగాన్ని మోపుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు రాజోలు నియోజకవర్గానికి చెందిన పలువురు ఫిర్యాదు చేయడంతో అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలో ఒక్క‌సారిగా చ‌ర్చ‌కు దారితీసింది.  చింతా అనురాధ‌, ఆమె అనుచ‌రులపై వైసీపీ ప్ర‌భుత్వంలోనూ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.. గ‌తంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి తమ వద్దనుంచి రూ.1.50 లక్షల నుంచి అయిదు లక్షల వ‌ర‌కు వసూళ్లు చేశారని, ఈ తంతు అంతాకూడా అప్పటి ఎంపీ అనురాధ వెంట ఉండే ఆమె పర్సనల్‌ సెక్రటరీగా చెప్పుకున్న కొమ్ముల చరణ్‌, పీఏ కుంచే శ్రీకాంత్‌, రాజోలు మండలానికి చెందిన మారుబోయిన రాంబాబు చీటింగ్ చేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ క్యాంపు కార్యాల‌యంలోనే  మాజీ ఎంపీ అనురాధ సమక్షంలోనే తమ వద్ద డబ్బులు తీసుకుని ఆపై మోసం చేశారని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.  

ఓఎన్జీసీ, స్మార్ట్ విలేజ్‌మిష‌న్‌లో ఉద్యోగాలు అంటూ..

ఓఎన్జీసీతోపాటు, మిషన్‌ స్మార్ట్‌ విలేజ్‌, హెల్త్‌కేర్‌తోపాటు అగ్రికల్చర్‌, ఫైర్‌, ఎలక్ట్రికల్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని భారీ మొత్తంలో వసూళ్ల పరంపర సాగించినట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవ‌లం  మాజీ ఎంపీ చింతా అనురాధ ప్రధాన అనుచర వర్గం నిరుద్యోగ యువకులు, అదికూడా త‌మ‌వెంట ఉండే నిరుద్యోగులే ల‌క్ష్యం చేసుకుని ఎవరి స్థాయిలో వారు భారీగానే వసూళ్ల పరంపర సాగించినట్లు బాధితులు వాపోతున్నారు. మాజీ ఎంపీ చింతా అనురాధ స్వగృహం, క్యాంపు కార్యాలయం అయినటువంటి మొగళ్లమూరులోనే తమ ఉద్యోగాలు కోసం ఆమె స‌మ‌క్షంలోనే డబ్బు ఇచ్చామని, గ‌త కొంత కాలంగా త‌మ ఉద్యోగాల గురించి ఆమె దృష్ట‌కి తీసుకువెళ్తే త‌న‌కు సంబంధం లేద‌ని అంటున్నార‌ని వాపోయారు. ఇదిలా ఉంటే ఉద్యోగాలు వేయించామ‌ని కొందరికి నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ కాపీలను సైతం ఇచ్చి మోసం చేశారని వాపోతున్నారు.

నమ్మినవారినే వంచించారంటూ ఆవేద‌న‌..

ఉద్యోగాల పేరుతో మోస‌పోయిన తామంతా  వైసీపీలో కార్యకర్తగా ఉంటూ అనురాధ గెలుపుకోసం కష్టపడ్డవారిమేనని, అయితే న‌మ్మిన‌వారినే మోసం చేశారని బాధితులు వాపోతున్నారు. ఎక్కడైనా ఉద్యోగం ఉందని, మేడమ్‌ చేత రికమండ్‌ చేయించాలని వీరి వద్దకు వెళితే ఆ ఉద్యోగం గురించి వివరాలు తమవద్ద రాబట్టి ఎక్కువ మొత్తానికి వేరేవాళ్లకు అమ్మేసుకున్నారని మరికొందరు వాపోతున్నారు. అయితే డబ్బులు తీసుకున్నవారిలో చాలా మందికి ఇంతవరకు ఉద్యోగాలు రాకపోగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వని పరిస్థితి ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ముగ్గురిపై కేసు నమోదు చేసిన రాజోలు పోలీసులు..

ఉద్యోగాల పేరిట డబ్బు తీసుకుని మోసం చేశారని రాజోలు పోలీసులకు పొన్నమండకు చెందిన మోకా దిలీప్‌, ఇదే ప్రాంతానికి చెందిన అడబాల క్రాంతికుమార్‌ తదితరులు ఇచ్చిన ఫిర్యాదుపై రాజోలు పోలీసులు మాజీ ఎంపీ చింతా అనురాధ పీఏ కుంచే శ్రీకాంత్‌, అల్లవరం మండలం గోపాయిలంకకు చెందిన కొమ్ముల చరణ్‌, రాజోలుకు చెందిన మారిబోయిన రాంబాబులపై కేసు నమోదు చేసినట్లు రాజోలు ఎస్సై రాజేష్‌కుమార్‌ తెలిపారు.