AP CM Chandrababu to take Oath On 12 June 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఏపార్టీ అధికారంలోకి రావాలన్నా అందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్థానాలు అత్యంత కీలకం. అలాంటిది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అన్ని స్థానాలు కట్టబెట్టారు ఇక్కడి ప్రజలు. జూన్ 12న ఉదయం 11.27 నిమిషాలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఈ జిల్లాలో ఎవరికి మంత్రి పదవి దక్కబోతోంది అన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరిలో వైసీపీ తుడిచుపెట్టుకుపోగా ఈ మూడు పార్టీల ఎన్డీయే కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసింది. దీనికి తోటు జనసేన నుంచి ఏకంగా రాజోలు, పి.గన్నవరం రెండు ఎస్సీ రిజర్వుడు స్థానాలతో పాటు రాజానగరం, కాకినాడ రూరల్‌, పిఠాపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో కలిపి ఆరు నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో ఇప్పుడు అసలు ఎవరికి మంత్రి పదవి దక్కుతుందన్న ఉత్కంఠ మొదలైంది.


గెలుపులో తూర్పు కీలకం.. 
తూర్పుగోదావరిలో సీట్లు నెగ్గితే ఆ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుందనేది మాటే కాదు సెంటిమెంట్‌ కూడా... 1983 ఎన్నికల నుంచి ఇదే తరహా ఫలితాలు వస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ అడ్రస్‌ గల్లంతయ్యింది.. మొత్తం స్థానాలన్నీ ఉమ్మడి కూటమి అభ్యర్ధులు ఎగరేసుకుపోయారు. రాష్ట్రంలో కూటమికి తిరుగులేని మెజార్టీ లభించింది. ఇలా 1983 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని శాసన సభ ఎన్నికల్లో ఇదే జరిగింది. అందుకే మంత్రి వర్గ కూర్పులోనూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గరిష్టంగా నాలుగు వరకు మంత్రి పదవులు పలుమార్లు కేటాయించారు.


సూపర్‌ సీనియర్లకు అడ్డా...
అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు ఎన్నికల్లో సీనియర్లు తూర్పులో కీలకంగా నిలుస్తుంటారు. ఏకంగా ఏడుసార్లు గెలిచిన సూపర్‌ సీనియర్లు కూడా తూర్పులో ఉన్నారు. వారిలో రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరు. ఆయన ఇప్పటివరకు ఏడుసార్లు వరుసగా గెలుపొందారు. ఆయనకు ఒక్కసారి కూడా మంత్రి పదవి దక్కలేదు. కులసమీకరణాల్లో ఆయనకు మంత్రి పదవి లభించకపోగా ఈసారి మాత్రం ఖచ్చితంగా బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవి దక్కుతుందంటున్నారు.


ఇక మండపేట నుంచి వరుసగా నాలుగోసారి ఎన్నికైన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు... వీరిద్దరికి పార్టీ విజయాలతో అసలు సంబంధం ఉండదు. వీళ్ల పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నా వీరి గెలుపు మాత్రం నల్లేరుమీద నడకలా మారుతుంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా ఈరెండు నియోజవర్గాల్లో టీడీపీ గెలుపుబావుటా ఎగురవేసింది. ఇప్పుడు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. మండపేట నుంచి కూడా వేగుళ్ల జోగేశ్వరరావు మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 


ఆశావాహుల జోరు.. ఎవరిని వరిస్తుందో..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉంది. మొదటిగా పిఠాపురం నుంచి పోటీచేసి గెలుపోందిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం, మరో కీలకశాఖ లభిస్తుందని వినిపిస్తోంది. పవన్‌ కల్యాణ్‌ కు చంద్రబాబు కీలక శాఖ ఏది ఇస్తారోనని చర్చ జరుగుతోంది. ఇక టీడీపీ ప్రభుత్వ మంత్రి యనుమల రామకృష్ణుడికి మంత్రి పదవి దక్కుతుంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకటి, కాపు సామాజికవర్గం నుంచి మరో మంత్రి పదవి ఛాన్స్ ఉంది. కాపు సామాజికవర్గం నుంచి కందుల దుర్గేష్‌, టీడీపీ నుంచి బండారు సత్యానందరావులు పోటీలో ఉన్నారు. ఇక ఎస్సీ సామాజికవర్గం నుంచి అయితే రాజోలు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచిన మాజీ ఐఏఎస్‌ అధికారి దేవా వరప్రసాదరావు, అమలాపురం నుంచి రెండోసారి గెలిచిన అయితాబత్తుల ఆనందరావులు పోటీలో ఉన్నట్లు సమాచారం.


2014లో పెద్దాపురం నుంచి తొలిసారి గెలుపొందిన నిమ్మకాయల చినరాజప్పకు డిప్యూటి సీఎంతోపాటు అత్యంత కీలకమైన హోంశాఖ మంత్రిని చేసింది టీడీపీ అధిష్టానం. మరి టీడీపీతోపాటు జనసేన కూడా ఈసారి మంత్రిపదవులు పొందే అవకాశం ఉన్నందున ఈసారి లక్ ఎవరిది కానుందో. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండగా, టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశంతో ఓవరాల్ ఐదు మంత్రి పదవులు అని ప్రచారం జరుగుతోంది.