Gold Hunt in Stadium | రాజమండ్రి: యూట్యూబర్లు, ఇన్‌స్టా రీల్స్ చేసేవారు వ్యూస్ కోసం, ఫాలోవ‌ర్స్ కోసం ఎంత‌కైనా తెగ‌బ‌డుతున్నారు.. యూట్యూబ్‌లో స‌బ్‌స్క్రెబ‌ర్ల కోసం, ఇన్‌స్టాలో ఫాలోవ‌ర్స్ కోసం వెర్రివేషాలేస్తున్నారు.. గోల్డ్ హంట్‌, మ‌నీ హంట్ పేరుతో చిత్ర‌మైన పోటీలు పెట్టి ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల పాలు గురిచేస్తున్నారు.. వీరి మాయ‌లో ప‌డిపోతున్న ప్ర‌జ‌లు వారు చెప్పిందే నిజమని ఉరుకులు పరుగులెత్తుతున్నారు.. సోష‌ల్ మీడియా ఇన్ఫ్యులెన్స‌ర్లుగా ఉన్న‌వారు బెట్టింగ్ యాప్‌ల‌ను స‌మాజాన్ని త‌ప్ప‌దోవ ప‌ట్టిస్తుంటే ఫాలోవ‌ర్స్‌ను పెంచుకునేందుకు కొంత మంది వికృత చేష్ట‌లు చేస్తూ గంద‌ర‌గోళాన్ని సృష్టిస్తున్నారు.  

మనీ హంట్, గోల్డ్ హంట్ పేరుతో ఈ మధ్య కాలంలో ప్రజలను తప్పుదోవ పట్టించిన ఘటనలు  చాలానే వెలుగు చూశాయి.. చివ‌ర‌కు పోలీసులు కూడా జోక్యం చేసుకోవాల్సిన ప‌రిస్థ‌తి చూడాల్సి వ‌చ్చింది..  స‌రిగ్గా ఇలాగే ఓ యూట్యూబ‌ర్ త‌న ఇన్‌స్టా పేజిలో గోల్డ్ హంట్ పేరుతో ఓ ప్ర‌భుత్వ క్రీడా ప్రాంగ‌ణంలో చేసిన అల‌జ‌డికి అధికారులు ఆగ్ర‌హాన్ని చ‌విచూడాల్సిన ప‌రిస్థ‌తి ఎదుర్కొన్నాడు.. జిల్లా క‌లెక్ట‌ర్ సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి చ‌ర్య‌లకు ఆదేశించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వ క్రీడా ప్రాంగ‌ణ అధికారి ఫిర్యాదుపై స‌ద‌రు యూట్యూబ‌ర్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.. 

బాల‌యోగి క్రీడా ప్రాంగ‌ణంలో గోల్డ్ పెట్టానంటూ..

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమ‌లాపురం క‌లెక్ట‌రేట్‌కు కూత‌వేటు దూరంలో ఉన్న జీఎంసీ బాల‌యోగి క్రీడా ప్రాంగ‌ణంలో పిబ్ర‌వ‌రి 28న‌ భూమిలో వెండి, బంగారం,  ఇయర్ పాడ్స్ దాచాను దొరికిన వాళ్లు తీసుకోండి అంటూ మందపాటి ఆదిత్య అనే యూట్యూబర్ త‌న ఇన్‌స్టా పేజ్‌లో ముందు రోజు రీల్ పోస్ట్ చేశాడు. ఫస్ట్ ప్రైజ్ కింద గోల్డ్, రెండో ప్రైస్ కింద వెండి ఉంగరం, మూడో ప్రైజ్ కింద ఇయర్ బర్డ్స్ ఇస్తానని నమ్మించాడు. ఈ వీడియో చూసిన తర్యాత ప్రజలు స్టేడియం వద్దకు పరుగులు తీశారు. అయితే వెండి, బంగారం, ఇయర్ పాడ్స్ కోసం 100 మందికి పైగా స్థానిక యువకులు స్టేడియంలో గోతులను తవ్వి వాటిని వెతకడం ప్రారంభించారు.  దీంతో అక్క‌డ ఏం జ‌రుగుతుందో అర్ధం కాక అక్క‌డి ఉద్యోగులు ఒకింత కంగార‌య్యారు.. వంద మందికి పైగా వచ్చి క్రీడా ప్రాంగణంలో గోతులు తవ్వుతున్న యువకులను ఉద్యోగులు అడ్డుకున్నారు. 

క‌లెక్ట‌ర్ ఆగ్ర‌హం.. కేసు న‌మోదు...  క‌లెక్ట‌రేట్‌కు ఆనుకుని ఉండే స్వ‌ర్గీయ జీఎంసీ బాల‌యోగి క్రీడా ప్రాంగ‌ణంలో ఈ గంద‌ర‌గోళం విష‌యం మొత్తం మీద జిల్లా క‌లెక్ట‌రేట్ వ‌ర‌కు వెళ్లింది.. దీంతో  ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఆరా తీయ‌డంతో ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని ఆదేశాలు జారీచేశారు.  పోలీసులు వెంటనే స్డేడియానికి చేరుకుని యూట్యూబర్ మందపాటి ఆదిత్య ను అదుపులోకి తీసుకుని అక్క‌డున్న వారిని బ‌య‌ట‌కు పంపారు.. ఆయనపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గోల్డ్ హంట్ కోసం స్టేడియంలో గోతులు తవ్వడానికి కార‌ణ‌మైన యూట్యూబర్ మందపాటి ఆదిత్యపై క్రీడాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన యూట్యూబర్ మందపాటి ఆదిత్యపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రీడాధికారి పోలీసులను కోరారు.