రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కుటుంబసభ్యులు కలిశారు. సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. 45 నిమిషాల పాటు చంద్రబాబుతో... భువనేశ్వరి, బ్రాహ్మాణి మాట్లాడనున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ, ఏపీ ప్రభుత్వం ఏ37గా చంద్రబాబు పేరును చేర్చింది. సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టడంతో, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. 


చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై వారం రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో  ఉంటున్నారు. గత వారంలో బాబు సతీమణి భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి ఒకసారి ఆయనతో ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత నారా లోకేష్, బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు మూలాఖత్ అయ్యారు. మరోసారి చంద్రబాబు నాయుడుతో ములాఖత్ కు కోరుతూ ఆయన సతీమణి భువనేశ్వరి జైలు అధికారులను అనుమతి అడిగారు. ఈ మూలాఖత్ ను  జైలు అధికారులు తిరస్కరించారు. వారానికి రెండుసార్లు మాత్రమే కుటుంబ సభ్యులకు మూలాఖత్ కు అవకాశం ఉంటుందని  జైలు అధికారులు స్పష్టం చేశారు. తన భర్త చంద్రబాబుతో ములాఖత్ ను నిరాకరించడంపై భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ములాఖత్ కు అవకాశం ఉన్నా నిరాకరించడం సరికాదని రెండ్రోజుల క్రితం చెప్పారు. 


చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద...టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు నిరసన తెలిపారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, వియ్‌ వాంట్‌ జస్టిస్‌ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. లోకేశ్‌తో పాటు ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్‌, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌.. మాజీ ఎంపీలు అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, కాలవ శ్రీనివాసులు, మురళీమోహన్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ, బీకే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. 


మరోవైపు చంద్రబాబు అరెస్ట్ పై సీమెన్స్‌ మాజీ ఎండీ సుమన్ బోస్ స్పందించారు. శిక్షణ కేంద్రాలు చూడకుండానే అక్రమాలు జరిగాయని ఆరోపించడాన్ని తప్పుబట్టారు. ఒక్క కేంద్రం సందర్శించలేదు.. ఒక్క తనిఖీ జరగలేదు.. ఇలా ఎందుకు జరిగిందన్నది పెద్ద మిస్టరీ అని ఆరోపించారు. 2021 వరకు స్కిల్ డెవలప్‌మెంట్‌ ద్వారా 2.13 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు. బిల్ట్ ఆపరేట్ - ట్రాన్స్‌ఫర్ ఆపరేట్ పద్ధతిలో ఈ ప్రాజెక్టు నడిచిందని వివరించారు. 2021లో ప్రాజెక్టును, శిక్షణ కేంద్రాలను ప్రభుత్వానికి అప్పగించామని, ప్రాజెక్టు విజయవంతమైందని ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ కూడా మెచ్చుకున్నారని సుమన్ బోస్ గుర్తుచేశారు. 2018లోనే తాను ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిపోయానని, 2021 తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయని అన్నారు. పీఎస్‌ఎస్‌డీసీలో ఏం జరిగిందో  తెలియదని, గతంలో మెచ్చుకున్న వారే ఈ ప్రాజెక్టు బోగస్‌ అని ఆరోపించడం వెనుక మిస్టరీ దాగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 


Also Read: పాలనలో వైసీపీ లీడర్లు అసమర్థలు- ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు - నారా బ్రాహ్మిణి


Also Read: చంద్రబాబు కోసం మైనార్టీల పోస్ట్ కార్డ్ ఉద్యమం