ఆలమూరు: కనిపించకుండా పోయిన ఆరుగురు మైనర్ విద్యార్థులను ఫిర్యాదు అందిన 24 గంటల వ్యవధిలో ట్రేస్ చేసి పోలీసులు పట్టుకున్నారు.. బడికి వెళ్లి సక్రమంగా చదువుకోవాలని తల్లితండ్రులు మందలించిన పాపానికి చెప్పాపెట్టకుండా ఈనెల 24 సాయంత్రం ఇంటి నుంచి పారిపోయిన ఆరుగురు విద్యార్థులు పోలీసుల కళ్లు గప్పి తిరుగుతుండగా అనేక ప్రయత్నాల అనంతరం శనివారం సాయంత్రం పి.గన్నవరం మండలం ఎలిశెట్టివారి పాలెం పొలాల వద్ద పట్టుకున్నారు..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ఖండ్రిగ పేటకు చెందిన 12 నుంచి 14 ఏళ్ల వయస్సున్న ఇద్దరు బాలికలు, నలుగురు బాలురు ఇంటి నుంచి పారిపోగా రెండు రోజులుపాటు బందువుల ఇళ్ల వద్ద వెతికి ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసుపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ నేతృత్వంతో ఆలమూరు, పి.గన్నవరం పోలీసులు మైనర్లను ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
చదువుకోవాలని మందలించినందుకే...
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఖండ్రిగ పేటకు చెందిన కొమరగిరి కరుణ(14), గంధం సత్యనారాయణ(13),ఏడవ తరగతి చదువుతున్న మర్రి సంతోష్(14), కొమరగిరి మాధురి(12), ఆరవ తరగతి చదువుచున్న కొమరిగిరి పృద్వీ వర్మ(12),కొమరగిరి పండు(12)లు సరిగ్గా చదువుకోవడం లేదని, బడికి కూడా సక్రమంగా వెళ్లడం లేదని గట్టిగా మందలించారు. వీరి తల్లితండ్రలు ఆలమూరులోని ఇటుక బట్టీ పనులు చేసుకుంటు ఉంటారు. అయితే తల్లితండ్రలు పనికి వెళ్లిన తరువాత ఈ ఆరుగురు కూడబలుక్కుని ఒక్కమాటమీదకు వచ్చి ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. కొంత డబ్బులు పట్టకుని ఇంటి నుంచి వెళ్లిపోగా ఆలమూరు నుంచి గౌతమీ నదీ వంతెన మీదుగా హైవే నుంచి రావులపాలెం చేరుకుని రాజోలు వైపు వెళ్లిపోయారు. పి.గన్నవరం మండల పరిధిలోని పలు గుడుల వద్ద రాత్రివెళల్లో ఉండిపోయి ఎవ్వరి కంట పడకుండా తప్పించుకు తిరుగుతుండగా స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు మొత్తం మీద పి.గన్నవరం మండలం ఎలిశెట్టి వారిపాలెం వద్ద పోలీసులకు చిక్కారు..
సీసీ కెమెరా పుటేజ్‌ల ద్వారా గుర్తింపు..
ఆరుగురు మైనర్లు ఇంటి నుంచి పారిపోయారని తల్లితండ్రుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఆలమూరు నుంచి హైవేపై ఉన్న సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రావులపాలెం బస్టాండు వద్ద రికార్డు అయిన సీసీ కెమెరా పుటేజీ ల ద్వారా వీరంతా రాజోలు బస్సు ఎక్కి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆదిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు పి.గన్నవరం పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఎవ్వరి కంట పడకుండా పొలాల్లొ తప్పించుకు తిరుగుతున్న క్రమంలో వీరంతా ఎలిశెట్టి వారి పాలెం వద్ద బస్సు దిగినట్లు సమాచారం అందగా స్థానికులు, డ్రోన్ కెమెరాల ద్వారా గాలించగా చివరకు పొలాల్లొ పోలీసులకు చిక్కారు. వీరి వద్ద సెల్‌ఫోన్‌లు లేకపోవడం ద్వారా పూర్తిగా సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగానే దర్యాప్తు చేసి వీరి కదలికలు గుర్తించినట్లు అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు, ఆరుగురు మైనర్ విద్యార్థులను ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో వారి తల్లితండ్రులకు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన డీఎస్పీ, సీఐ, సిబ్బందికి ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.