Satwiksairaj Rankireddy latest news: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అర్జున అవార్డు గ్రహీత రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ తండ్రి రంకిరెడ్డి కాశీవిశ్వనాథ్ గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన కాశీవిశ్వనాథ్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఆయన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పీడీగా, ప్రధానోపాధ్యాయునిగా పని చేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం అమలాపురం ఆఫీసర్స్ క్లబ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కన్వీనర్‌గా ఉన్నారు. కాశీ విశ్వనాథ్ భార్య రంగనాయకి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. తన కలను తన కుమారుని ద్వారా సాకారే చేసుకున్నారు కాశీ విశ్వనాథ్. ఈ క్రమంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అయినా సరే దృఢ నిశ్చయంతో సాత్విక్ సాయిరాజ్‌ను బ్యాడ్మింటన్ క్రీడవైపు విజయవంతంగా నడిపించారు. సాత్విక్ సాయిరాజ్‌లో తండ్రి పాత్ర అనిర్వచనీయం.
కాశీవిశ్వనాథ్‌కు ఇద్దరు కుమారులు ఉండగా పెద్దకుమారుడు అమెరికాలో ఉంటున్నారు. రెండో కుమారుడు సాత్విక్‌సాయిరాజ్ బ్యాడింటన్ క్రీడాకారుడు. తమ కుమారుడు అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ప్లెయర్ అయినప్పటికీ ఏమాత్రం గర్వం లేకుండా అందరితో సరదాగా గడిపే స్వభావం కాశీ విశ్వనాథ్‌ది. కోనసీమ ప్రాంతంలో ఎక్కడ ఎలాంటి క్రీడా పోటీలు నిర్వహించినా ఆయనే స్వచ్ఛందంగా పోటీల నిర్వహణలో కీలక భాగస్వామి అయ్యేవారు. ఆయన గురించి సహచర పీఈటీలు, క్రీడాభిమానులు చాలా గొప్పగా చెబుతారు. కాశీవిశ్వనాధ్ హఠాన్మరణంతో అమలాపురంలో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read: కాకినాడ శిల్పారామం ఫోటో షూట్‌లకు ప్రత్యేకం-వాటర్ పార్కు నిర్మాణంతో మరింత ఆకర్షణీయం!
హుటాహుటీన బయల్దేరిన సాత్విక్..సాత్విక్ సాయిరాజ్ ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ అకాడమీలో ప్రాక్టీస్‌లో ఉన్నారు. తండ్రి హఠాన్మరణంతో హుటాహుటిన అమలాపురం వచ్చారని సన్నిహితులు తెలిపారు. సాత్విక్ సాయిరాజ్ తండ్రి మృతి వార్త తెలిసిన వెంటనే కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, ఎస్పీ కృష్ణారావు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఎంపీ గంటి హరీష్‌మాధూర్, పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.
Also Read: ఒక్కరోజే జనసేన ప్లేనరీ - జనసైనికులను నిరాశ పరిచిన నిర్ణయం!