AP Voters List :


ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపు వ్యవహారం ఇప్పటికే కలకలం రేపుతోంది. గ్రామాల్లో ఓట్ల తొలగింపుపై తెలుగుదేశం పార్టీ నేతలు (TDP Leaders) కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వివిధ జిల్లాల్లో ఓట్ల తొలగింపునకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంది. తాజాగా గుంటూరు జిల్లాలో ఫామ్‌-7 అడ్డుపెట్టుకుని, ఓట్ల వందల ఓట్లను జాబితా నుంచి తీసివేయించేందుకు వైసీపీ నేతలు (YSRCP Leaders) దరఖాస్తు చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలో ఫామ్‌-7 ద్వారా ఓట్లు తొలగించాలని 858 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 663 దరఖాస్తులు అధికార వైసీపీ నేతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితా మార్పులు, చేర్పులపై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. 


ఒకే ఇంట్లో 23ఓట్ల తొలగింపునకు కుట్ర!
గుంటూరు నగరంలోని బ్రాడీపేట 2/19 లోని 140 పోలింగ్ బూత్ పరిధిలో, ఒకే సామాజిక వర్గానికి చెందిన 23 మంది ఓట్లు తొలగించాలంటూ అధికార పార్టీ నేత శేషిరెడ్డి కొండా దరఖాస్తు చేయడం ఆలస్యంగా బహిర్గతమైంది. దీనిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 40 ఏళ్లుగా ఇక్కడే నివాసముంటూ, ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నామని చెబుతున్నారు. వైసీపీ నేతలు కావాలనే తమ పేర్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. 


జేకేసీ కళాశాల రోడ్డులోని నవభారత్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో 30 మంది నివాసం ఉంటున్నారు. వీరిలో 12 మంది ఓట్లు తొలగించాలని పులుసు వెంకటరెడ్డి అనే వైసీపీ నేత దరఖాస్తు చేయడంపై అపార్ట్ మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఓటు హక్కు తొలిగించమని చెప్పే ఆధికారం ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. దరఖాస్తు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే గుంటూరు జిల్లాలోని వైసీపీ నేతలు ఫామ్‌-7 అడ్డుపెట్టుకుంటున్నారని ఓటర్లు మండిపడుతున్నారు. తమకు వ్యతిరేకం అనుకున్న వారి ఓట్లను జాబితా నుంచి తొలగించేందుకు అనేక రకాలుగా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


గత నెలలో నలుగురు ఆఫీసర్లపై వేటు
కొద్ది రోజుల క్రితం బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా సవరణలో జోక్యం చేసుకున్న పోలీసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మార్టూరు సీఐ టి.ఫిరోజ్‌,  పర్చూరు ఎస్సై ఎన్‌సీ ప్రసాద్, మార్టూరు ఎస్సై కె.కమలాకర్, యద్దనపూడి ఎస్సై కె.అనూక్‌ను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ సస్పెండ్ చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న మహిళా పోలీసులపై నలుగురు అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఓట్ల తొలగింపు కోరుతూ వచ్చిన ఫారం-7 దరఖాస్తుల సమాచారాన్ని సేకరించి అధికార పార్టీ నేతలకు చేరవేసినట్లు టీడీపీ గుర్తించింది. 


వైసీపీ నేతలతో ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి ఓట్ల తొలగింపుపై మాట్లాడుతున్నట్లు ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. విచారణ జరపాలని బాపట్ల జిల్లా కలెక్టర్ కు సీఈఓ ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు. బీఎల్‌వోలు పోలీసు అధికారులకు సమాచారం పంపినట్లుగా విచారణలో వెల్లడైంది. అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో ఎమ్మెల్యే సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు, సీఈసీ ఆదేశాలతో పోలీసు ఉన్నతాదికారులు అప్రమత్తమయ్యారు. ఒక సీఐ, ముగ్గురు ఎస్ఐలను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.