అమలాపురం అల్లర్లపై క్షణక్షణం ఆరా తీస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ప్రస్తుతం అమలాపురంలో ఉన్న పరిస్థితి, కేసుల పురోగతి, అరెస్టుపై ఆరా తీశారు. 


అమలాపురంలో పోలీసు టీమ్‌లో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. అమలాపురంలో విధ్వంసానికి కారణమైన సంఘటనలపై ఇప్పటి వరకు ఏడు కేసులు రిజిస్టర్‌ అయినట్టు తెలిపారు. ఇప్పటికే 46 మందిని అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. ఈ అలజడిలో పాల్గొన్న మరో 72 మంది పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. పరారీలో ఉన్న వారి ఆచూకీ కనుక్కునేందుకు స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. మూడు బస్సుల దగ్దం విషయంలో నాన్‌బెయిలబుల్ కేసులు రిజిస్టర్ చేసినట్టు  ప్రకటించారు. 


అమలాపురంలో ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉందన్నారు ఏలూరూ రేంజే డీఐజీ పాలరాజు. వేర్వేరు జిల్లాల నుంచి భారీగా బలగాలను రప్పించామని... శాంతిభద్రతలకు ఇప్పుడు ఎలాంటి సమస్య లేదని పేర్కొన్నారు. విధ్వంసానికి కారణమైన వారిపై ఆరు సెక్షన్ల కింద కేసులు పెట్టామని తెలిపారు. ప్రస్తుతానికి 46 మంది పోలీసుల అదుపులో ఉన్నారని... మరికొందరు పరారీలో ఉన్నట్టు వివరించారు. 


సీసీటీవీ ఫుటేజ్‌, తాము రికార్డు చేసిన వీడియోలు ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పాలరాజు పేర్కొన్నారు. పేరు మార్పునకు అనుకూల, వ్యతిరేక వర్గాల నాయకులతో కూడా మాట్లాడినట్టు తెలిపారు. కోనసీమలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పూర్తిగా సహకరిస్తామని ఆయా సంఘాల నాయకులు హామీ ఇచ్చినట్టు పాలరాజు వివరించారు. ఇంటర్ పరీక్షలు ఉన్న కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేయడం లేదని కానీ ఆ ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు ఎవరు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు పాలరాజు. 


అమలాపురంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడిని ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అధికారుల సంఘం ఖండించింది. ఇది అమానుష చర్యగా అభివర్ణించింది. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అమలాపురంలో శాంతిభద్రతలను కాపాడుతూ విధులను నిర్వర్తిస్తున్న పోలీసులపై అల్లరి మూకలు దాడులకు పాల్పడి, ఎస్పీని, 30 మంది పోలీస్ సిబ్బందిని గాయపరిచి, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడం హేయమైన చర్యగా అభివర్ణించారు. 


ప్రస్తుతానికి అమలాపురం ప్రశాంత వాతావరణంలో ఉంది. ప్రధాన కూడళ్లలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వేరే ప్రాంతాల నుంచి అదనపు బలగాలను తీసుకొచ్చి నిఘా ఏర్పాటు చేశారు. అమలాపురం వైపు వచ్చే అన్ని బస్సు సర్వీసులను రద్దు చేశారు. దీంతో బస్టాండ్‌ నిర్మానుష్యంగా మారింది. సాయంత్రం రావులపాలెంలో ప్రదర్శన నిర్వహిస్తారన్న సమాచారంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.