రాజమండ్రి: తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి దత్తపుత్రుడు అని వైఎస్ షర్మిలా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి లో రోడ్ షో & భారీ బహిరంగ సభలో పాల్గొన్న సందర్భంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడుతూ.. - చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ముగ్గురు బీజేపీ వారసులే అని.. B అంటే బాబు, J అంటే జగన్, P అంటే పవన్ అని ఆమె అన్నారు. ఆంధ్ర నా పుట్టిన ఇళ్లు...తెలంగాణ నా మెట్టినిల్లు అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం, ఏపీలో ప్రశ్నించే గొంతుక కోసం YSR బిడ్డ తిరిగి వచ్చిందన్నారు. 


షర్మిల మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ తోనే హోదా సాధ్యం. 10 ఏళ్లు హోదా ఇస్తామని మాట తీసుకొని ఇక్కడకు అడుగు పెట్టాను. అధికారంలోకి వస్తే 2.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. వృద్దులకు 4 వేలు పెన్షన్, వికలాంగులకు 6 వేల పెన్షన్ ఇస్తాం. ప్రతి పేద మహిళ ఫ్యామిలీకి పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాం. రాజమండ్రి ఎంపీగా గిడుగు రుద్రరాజు ను భారీ మెజారిటీ తో గెలిపించండి. అవసరం అయితే హోదా కోసం ఢిల్లీలో గిడుగు నిరాహార దీక్ష చేస్తాడు’ అన్నారు.




‘10 ఏళ్లు అయినా ఏపీ అభివృద్ది లో ఒక్కడుగు ముందుకు పడలేదు. 10 కొత్త పరిశ్రమలు రాలేదు. హోదా వచ్చి ఉంటే.. రాష్ట్రం అభివృద్ది చెందేది. హోదా రాకుంటే చంద్రబాబు, జగన్ గాడిదలు కాశారు. 15 ఏళ్లు హోదా కావాలని చంద్రబాబు అడిగారు. అధికారంలో వచ్చాకా హోదా అడిగితే జైల్లో పెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీలు అందరూ రాజీనామా చేయాలని జగన్ అన్నాడు. అధికారం ఇస్తే 5 ఏళ్లలో నిజమైన ఉద్యమం ఒక్కటి చేయలేదు. రాజకీయం కోసం హోదా అనే అంశాన్ని వాడుకున్నారు. నమ్మి ఓట్లు వేస్తే కనీసం రాజధాని కట్టలేదు. చంద్రబాబు సింగపూర్ లాంటి రాజధాని కడతామని అమరావతిని కాస్త బ్రమరావతి చేశారు. మూడు రాజధానులు అన్న జగన్.. కనీసం ఒక రాజధాని కూడా కట్టలేదు.’ వైఎస్ షర్మిలా రెడ్డి 


ఏపీకి బీజేపీ వెన్నుపోటు
ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ వెన్నుపోటు పొడిస్తే.. ఎవరూ నిలదేయలేదు అని షర్మిల అన్నారు.  ఇంత అన్యాయం చేసినా బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు. చంద్రబాబుతో బీజేపీ పొత్తు, జగన్ బీజేపీకి తొత్తు.. ఇద్దరు బీజేపీ కి బానిసలు గా మారారని.. జగన్ బీజేపీ కి దత్త పుత్రుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు గోద్రా ఘటన మీద YSR బీజేపీని ఉతికి ఆరేశాడు. కానీ YSR వారసుడు మణిపూర్ ఘటన మీద మాట కూడా లేదని ఎద్దేవా చేశారు. జగన్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. మెగా డీఎస్సీ అని దగా డీఎస్సీ చేశాడని విమర్శించారు. 23 వేల ఉద్యోగాలని చెప్పి ముష్టి 7 వేలకు నోటిఫికేషన్ ఇచ్చారని.. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమి ఇప్పుడు లేచారంటూ సెటైర్లు వేశారు.



ఓట్లు కావాలని సిద్ధం అని జగనన్న బయలు దేరాడు. దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం, మద్య నిషేధం అని కల్తీ మద్యం అమ్మడానికా ? ఉద్యోగాల పేరు చెప్పి మళ్ళీ మోసం చెయడానికా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పులు చేయటానికి సిద్ధమా, ప్రజలను మళ్ళీ మోసం చేయడానికా? మీరు సిద్ధం అయితే.. మిమ్మల్ని ఇంటికి పంపడానికి ఏపీ ప్రజలు సిద్ధం అన్నారు షర్మిల. రాష్ట్రాన్ని డ్రగ్స్ కి అడ్డాగా మార్చి కంటైనర్ లో డ్రగ్స్ తరలిస్తున్నారని ఆరోపించారు.