ఒక మోసకారి, మరో వేషధారి కలిసి వస్తున్నారు..
చంద్రబాబు, పవన్‌లపై మంత్రి వేణు హాట్‌ కామెంట్స్‌..


పేదరికంలో పుట్టిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పేదలకోసం ఎప్పుడూ పనిచేయలేదన్నారు రాష్ట్ర సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. గతంలో జన్మభూమి రోడ్లు అని వేసి కాంట్రిబ్యూషన్‌ 30 శాతం కట్టాలని కోరాడని, డబ్బున్నవారే కడతారు గనుకపెద్దల పక్షాన ఉండాలనే ఆయన భావజాలమన్నారు. కానిస్టేబుల్‌ కొడుకును అని చెప్పుకునే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పేదవానికి మంచి జరుగుతుంటే అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. ఒక మోసకారి, ఒక వేషధారి కలిసి వస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ కలిసి చేసే నటన మాకు అర్ధమయ్యిందన్నారు. గోల్డ్‌ స్పూన్‌తో పుట్టినటువంటి వైఎస్‌ జగన్‌ పేదలకోసం ఆలోచిస్తున్నారని, మా ధైర్యం జనం అని, ఇటువంటి వారు పదిమంది కలిసి వచ్చినా ఏమీ చేయాలేరన్నారు. 


రైతుల పక్షాన ఆడిన డ్రామా, సినిమా పండలేదు..
ప్రజలకు నిత్యం అబద్దాలు చెప్పి ప్రజల దృష్టిని ఆకర్షించాలని, మర్చాలన్న ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, వర్షాలు ఒకటో తారీఖున ప్రారంభమైతే నాలుగో తేదీనే ధాన్యం కొనుగోళ్లు ఎఫెక్టీవ్‌గా ప్రారంభమయ్యాయన్నారు. వర్షాలు వచ్చాయి తాము ఆడబోయే డ్రామా, సినిమా బాగా ఆడుతుందన్న ఉద్దేధ్యంతో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికేటటువంటి పవన్‌ కళ్యాణ్‌ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారన్నారు. చేలు నిలుచుని ఉన్నా కూడా వీటిని ఏం చేస్తావని ప్రతిపక్ష నాయకుడు నోటివెంట రావడం దురదృష్టకరమన్నారు. సకాలంలో గిట్టుబాటు ధరకు ధాన్యం అమ్ముకోలిగారని, రైతులను ఆనందంగా ఉంచడానికి ప్రభుత్వం చేసిన చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.  


ప్రజలకు మంచి చేసేలా ప్రతిపక్షాలు లేవు..
ప్రజలకు మంచి చేసే ప్రతిపక్షాలు లేవని, కుట్రలు, కుతంత్రాలు ద్వారా అధికారం సాధించాలని చూస్తున్నాయని, కేవలం రాజకీయాలు అధికారం సాధించడం కోసమే ప్రయత్నిస్తున్నాయన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పింది 98.9శాతం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే ఒంటరిగా పోటీచేసే ధైర్యం ఉందని అన్నారు. నేనిది చేశాను నాకు ఓటేయండని చెప్పుకోలేని చంద్రబాబు నక్కజిత్తులు ప్రదర్శించిపవన్‌ కల్యాణ్‌ కు ప్రజల్లో ఉన్న ఆదరణను కూడా పూర్తిగా ధ్వంసం చేశారన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్‌ను పవన్‌ కల్యాణ్‌ చదువుతున్నాడన్నారు. 


భయం అనే పదం తెలియని నాయకుడు జగన్‌..
ఈదేశంలో భయం అనే పదం తెలియని నాయకుడు ఉన్నారంటే ఆయన జగన్మోహన్‌రెడ్డి అని మంత్రి వేణు అన్నారు. అందరినీ భయపెట్టే సత్తా ఉందిగనుకే వారంతా కలిసి రావాలనుకుంటున్నారన్నారు. పవన్‌ కళ్యాణ్ పార్టీ పెట్టి 2014లో పార్టీ పెట్టారని, ప్రభుత్వంలో ఏమీ పదవులు తీసుకోలేదని ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు అనుకుంటారని కానీ పవన్‌ కళ్యాన్‌కు పదవి వచ్చిందని, కార్యకర్తలకు రాలేదని ఆరోపించారు. 2019లో ఎందుకు విడిపోయారని పవన్‌ కళ్యాణ్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలని ప్రయత్నించారని అయితే ప్రజలు జగన్‌కు ప్రజలు పట్టం కట్టారన్నారు. వైసీపీ పాలనను గద్దె దించడానికే కలుస్తారని చెబుతున్నారని మండిపడ్డారు.