- నేడు కొవ్వూరులో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన..
- సీఎం జగన్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు..


AP CM Jagan Kovvur Tour:  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. బుధవారం సీఎం పర్యటన కారణంగా కొవ్వూరు నుంచి రాజమండ్రి వైపుగా రాకపోకల విషయంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. విద్యా దీవెన కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం కొవ్వూరు రానున్నారు.  ఈ క్రమంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ కే.మాధవీలత సభా ప్రాంగణం వద్ద భద్రతా ఏర్పాట్లును జిల్లా ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. హెలీప్యాడ్‌ నుంచి సభా ప్రాంగణం వరకు 2.1 కిలోమీటర్లు వరకు ముఖ్యమంత్రి రోడ్‌షో లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి భద్రతా ఇబ్బందులు తలెత్తకుండా రూట్‌ మ్యాప్‌ పరిశీలించి ఆ రోడ్డు మార్గాన్ని కలెక్టర్‌, ఎస్పీ పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద కూడా మెడికల్‌ క్యాంపులు, తాగునీటి వసతి, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. 


ముఖ్యమంత్రి పర్యటనలతో ట్రాఫిక్‌ ఆంక్షలు..
విద్యాదీవెన కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కొవ్వూరు పర్యటన సందర్భంగా పోలీసులు భద్రతాచర్యల్లో భాగంగా కొవ్వూరులో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటలనుంచి కొవ్వూరు`రాజమండ్రి వైపుగా రాకపోకలు సాగించే అన్ని వాహనాలను గామన్‌ ఇండియా వంతెన మీదుగా రాజమండ్రికి మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే తరహాలో ధవళేశ్వరం బ్యారేజ్‌ మీదుగా వాహనాలు మళ్లించనున్నారు. అదేవిధంగా రాజమండ్రి నుంచి వచ్చే వాహనాలు రోడ్డు కం రైల్వే బ్రిడ్జీ వంతెన, కొవ్వూరు వాటర్‌ ట్యాంకు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కొవ్వూరు పట్టణంలోకి బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలతోపాటు ఏ వాహనాలను వెళ్లేందుకు అనుమతులు నిలిపివేశారు. రోడ్డు కం రైలు వంతెనపైనా, ధవళేశ్వరం బ్యారేజ్‌పైనా వన్‌వే ట్రాఫిక్‌ అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆంక్షలు సాయంత్రం వరకు ఉంటాయని వెల్లడిరచారు.  


రెండు సార్లు వాయిదా పడిన సీఎం పర్యటన..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కొవ్వూరు పర్యటన గత నెల 14న జరగాల్సి ఉంది. కార్యక్రమంలో భాగంగా రోడ్‌షో, భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కొన్ని కారణాలతో ఈకార్యక్రమం వాయిదా వేశారు. ఆపై ఈ నెల 5న కొవ్వూరులో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని అధికారులు వెల్లడించారు. అకాల వర్షాల కారణంతో మరోసారి సీఎం జగన్ కొవ్వూరు పర్యటన వాయిదా పడిరది. ఈనెల 24న (బుధవారం) ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని హోం మంత్రి తానేటి వనతి వెల్లడిరచారు. 


గతంలో చెట్లు కొట్టేశారని ఆరోపణలు..
గతంలో ముఖ్యమంత్రి కొవ్వూరు పర్యటన ఏర్పాట్లలో భాగంగా రోడ్డు పక్కనున్న చెట్లను అధికారులు కొట్టించి వేశారని పలువురు ఆరోపించారు. ముఖ్యమంత్రి పర్యటన ఉంటే చాలు ఆయన పచ్చని చెట్లును తొలగించేస్తున్నారని అప్పట్లో మండిపడ్డారు. సీఎం జగన్ రోడ్‌ షో ఉన్న ప్రాంతంలో ఈ పరిస్థితిపై ఆరోపణలు వెల్లువెత్తగా వీటిని జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌ రెడ్డి కొట్టివేశారు. పనిగట్టుకుని చెట్లు ఎక్కడా తొలగించలేదని, విద్యుత్తు సరఫరా, ఇతర ఆటంకాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని కొమ్మలను కొట్టించి ఉంటారని అన్నారు.