Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి కాలుష్య నియంత్రణ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన రొయ్యల ఫ్యాక్టరీని సీజ్ చేశారు. అక్కడి నుంచి వ్యర్థాలను బయటకు వదులుతున్నారని నిర్దారించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఈ పేరు కేంద్రంగా కాకినాడలో చాలా కాలం నుంచి రాజకీయాలు నడుస్తున్నాయి. వైసీపీలో కీలక వ్యక్తిగా ఎదిగిన ఆయన వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలు వెలికితీయడం మొదలు పెట్టింది.
ద్వారంపూడి అక్రమాల్లో భాగంగా ప్రత్తిపాడు మండలం లంపకలోవలో ఉన్న రొయ్యల ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలను శుద్ధి చేయకుండానే బయటకు విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు ఆ ఫ్యాక్టరీని సీజ్ చేశారు. ఇన్ని రోజులు తప్పుడు సమాచారంతో అధికారులను ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారని ఇప్పుడు మాత్రం దొరికిపోయారని అంటున్నారు. ఆ పరిశ్రమలో వ్యర్థాలను బయటకు వదలడమే కాకుండా అనుమతి లేకుండా ఓ ఐస్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇలా చాలా రూల్స్ అతిక్రమించారని అధికారులు నిర్దారణకు వచ్చారు.
Also Read: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
ద్వారంపూడి నిర్వహించే రొయ్యల ఫ్యాక్టరీలో అక్రమాలను గుర్తించిన తర్వాత సరిదిద్దుకోవడానికి అధికారులు మూడు నెలలు గడువు ఇచ్చారు. అయినా అక్కడ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. వారి నుంచి ఎలాంటి స్పందన కూడా రాలేదు. దీంతో మరోసారి తనిఖీలు చేసిన అధికారులు ఫ్యాక్టరీని సీజ్ చేశారు. ఈ విషయాన్ని యాజమాన్యానికి తెలియజేశారు.
కాకినాడ జిల్లాలో ద్వారంపూడికి రెండు రొయ్యల ఫ్యాక్టరీలు ఉన్నాయి. రూల్స్ పాటించలేదని కరప మండలం గురజనాపల్లిలో ఉన్న ఫ్యాక్టరీని ఇప్పటికే సీజ్ చేశారు. ఇప్పుడు రెండో ఫ్యాక్టరీని కూడా సీజ్ చేశారు. మొదట ఈ ఫ్యాక్టిరీని జులై 11 తనిఖీలు చేసిన అధికారులు రూల్స్ పాటించడం లేదని గుర్తించారు. ఆర్‌టీపీఎంస్ వ్యవస్థ , సూయేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ లేదని తేలింది. ఫ్యాక్టరీ వాడే విద్యుత్ విషయంలో కూడా తేడాలు ఉన్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా ఐస్‌ప్లాంట్ రన్ చేస్తున్నట్టు స్పష్టమైంది. కంపెనీ విడుదల చేస్తున్న వ్యర్థజలాలు పరీక్షిస్తే శుద్ధి చేయలేదని కూడా గుర్తించారు.
ఫ్యాక్టరీలో ఇలాంటి నియమాల ఉల్లంఘన జరగడానికి కారణాలు చెప్పాలని వివరణ కోరుతూ కంపెనీ యాజమాన్యానికి ఆగస్టులో నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన కంపెనీ... నవంబర్ వరకు గడువు కోరింది. నవంబర్ పూర్తినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మరోసారి పీసీబీ అధికారులు ఫ్యాక్టరీని సందర్శించారు. మార్పులు లేవని గుర్తించి కంపెనీ సీజ్ చేశారు.
Also Read: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
మరోవైపు కాకినాడ కేంద్రం జరుగుతున్న బియ్యం అక్రమ రవాణా అంశంపై కూడా అధికారులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఈ రవాణా వెనుక ద్వారంపూడి హస్తం ఉందని కూటమి నేతలు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా దీన్ని పవన్ లాంటి వాళ్లు అస్త్రంగా మార్చుకున్నారు.