AP Minister Vasamsetti Subhash : డాక్టర్ అవ్వాలనుకున్నాను.. కానీ యాక్టర్ అయ్యాను.. ఇది చాలా ఆర్టిస్ట్‌ల్లో సర్వసాధారణంగా వినిపించే డైలాగ్.. అయితే సినిమాల్లో నటించాలన్న కల చాలా మందిలో ఉంటుంది. అదే సమయంలో చాలా మందిలో కనిపించని ఓ కళాతృష్ణ కూడా అంతర్లీనంగా ఉండే ఉంటుంది. అవకాశం వచ్చినప్పడు అది సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తుంటారు. అందుకే చాలా మంది రాజకీయనేతలు కూడా చాలా సినిమాల్లో అవకాశం వచ్చినప్పుడు నటించి మెప్పించారు. ఆ వరుసలో ఇప్పడు ఏపీ కార్మికశాఖ మంత్రి, రామచంద్రపురం శాసన సభ్యుడు వాసంశెట్టి సుభాష్ నేనున్నానంటూ ముందుకు వచ్చారు. ఆయన ఓ సినిమాలో ఓ గ్రామ పెద్దగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఓ సినిమాలో గ్రామపెద్దగా డైలాగులు చెబుతూ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తెరంగేట్రం చేసిన మంత్రి సుభాష్..
ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఇప్పడు సినిమాలో నటించడం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆడపిల్లలపై జరుగుతోన్న అఘాయిత్యాలను, దారుణాలను ప్రధానాంశంగా తెరకెక్కిస్తోన్న "ఎవరది "సినిమాలో మంత్రి సుభాష్ ఓ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారట. ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని పెదపాడు గ్రామంలో పిన్నమనేని చిన్న రాఘవయ్య అనే గ్రామ పెద్ద ఇంట్లో ఈసినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మంత్రి సుభాష్ గ్రామ జమిందార్ పాత్రలో నటిస్తున్నారట. మెగా మూవీ క్రియేషన్స్ బ్యానర్‌ఫై నిర్మిస్తున్న ఈచిత్రాన్ని వట్టి శ్యామ్ నిర్మిస్తున్నారు. జుత్తిగ వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఊరిప్రజలను ఎలా కాపాడుకోవాలో తెలుసంటూ డైలాగ్..
సినిమాలో జమిందార్ పాత్రను పోషిస్తున్న మంత్రి సుభాష్ ఓ డైలాగ్ చెబుతున్న వీడియో కూడా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఊరిని, ఊరి ప్రజలను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు.. ఆ అమ్మాయిని పొలిమేర దాటించి అమ్మవారి శాంతి పూజలకు సిద్ధం చేయండి అనే డైలాగ్ ను మంత్రి సుభాష్ చెబుతున్న సన్నివేశాన్ని చిత్రీకరించారు.
మంత్రిపై భిన్నంగా స్పందన.
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సినిమాల్లో నటించడంపై పలువరు భిన్నంగా స్పందిస్తున్నారు.. ఎంతో మంది యువత నిరుద్యోగులుగా అనేక ఇబ్బందులు పడుతుంటే వారికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందిపోయి సినిమాల్లో నటిస్తున్నావా.. ప్రజలు ఇందుకేనా నిన్ను గెలిపించింది అంటూ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీనాయకురాలు బొజ్జా ఐశ్వర్య మంత్రిపై విరుచకుపడ్డారు. మరో పక్క మంత్రి సుభాష్ అనుచరులు మా మంత్రిగారు ఆడపిల్లలపై జరుగుతోన్న అఘాయిత్యాలను సినిమా ద్వారా ప్రశ్నించి వారిలో చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు సినిమాల్లో నటిస్తున్నారంటూ తమ మద్దతు తెలుపుతున్నారు..