Andhra Pradesh Flood: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. కూనలంకలో పర్యటిస్తున్న సీఎం.. వరద బాధితులను పరామర్శిస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని చెబుతున్నారు. అలాగే కష్ట సమయంలో సరైన సదుపాయాలు అందాయా లేదా అని.. పిలిచిన వెంటనే అధికారులు వచ్చారా లేదా అని అడిగి తెలుసుకుంటున్నారు. గతంలో అధికారంలో ఉన్న అధికారులు.. పేపర్లలో ఫొటోలు వచ్చేలా చేసుకునే వారని, సమస్య రాగానే వచ్చి హడావుడి చేసేవారని గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం సాయం అందేలా చేస్తే చాలనుకుని ముందుకు వెళ్లినట్లు సీఎం జగన్ వెల్లడించారు. వారం రోజులు పాటు జిల్లా కలెక్టర్లంతా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేశామని.. బాధితులందరికీ సాయం అందించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. తానే స్వయంగా వచ్చి వరద బాధితులను కలుస్తానని చెప్పానని... మాట ప్రకారం ఇప్పుడు జిల్లాలో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే వరద బాధితులకు నిత్యావసరాలు అందించామన్నారు. ఇళ్లు దెబ్బతిని ఉంటే రూ. 10 వేలు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. అందరికీ రెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశామని.. వరద సాయం అందుకుంటే ఇక్కడకు వచ్చి తనకు చెప్పండని అన్నారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే తమ తాపత్రయం అని.. డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం తమ ప్రభుత్వానికి లేదన్నారు.  






ఈ వరదకు సంబంధించి మీకు ఏ మంచి జరిగింది,  కలెక్టర్‌ ఏ విధంగా చేయించాడని అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తాను అధికారులను నిలదీయడానికి రాలేదని.. అధికారులకు శభాష్‌ అని చెప్పి, వెన్ను తట్టి బాగా చేశారని మీరు పొగిడితే వినాలని వచ్చానని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే.. అధికారులు, ముఖ్యమంత్రి ముందే చెప్పాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు మొదట్లో వైఎస్‌ హయాంలో ల్యాండ్‌ అక్విజేషన్‌ జరిగినప్పుడు లక్ష, లక్షన్నరకు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. దాన్ని తాను 5 లక్షలు ఇస్తానని చెప్పానని.. ఆ మిగిలిన 3.5 లక్షలు కూడా కచ్చితంగా ఇచ్చేస్తామని వివరించారు. సీఎం జగన్ వల్ల నష్టపోయామనే మాట ఎక్కడా వినపడకుండా చేస్తానని అన్నారు. సీఎం జగన్ ప్రజలకు మంచి మాత్రమే చేస్తాడని.. చెడు మాత్రం ఎప్పుడకీ చేయడని గుర్తు పెట్టుకోండంటూ వ్యాఖ్యానించారు.