తూర్పుగోదావరి జిల్లా..
జగ్గంపేట, పెద్దాపురంలో పోలీసులు సహకరించి అనపర్తిలో తనను అడ్డుకున్నారని.. బహిరంగ సభకు ఇక్కడ ఎందుకు అనుమతి ఇవ్వలేదని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో సీఎం జగన్ చెప్పినట్లు పనిచేస్తున్న పోలీస్ అధికారులు రేప్పొద్దున తన వద్ద పనిచేయాలని మర్చిపోకండి అన్నారు. పోలీసుల సంఘ విగ్రహ శక్తులుగా మారారని, సైకో పోవాలి  సైకిల్ రావాలి.. అంటూ నినాదాలు చేయించారు.


చంద్రబాబు చేసిన ఆరోపణలు, విమర్శలపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ స్పందించారు. జిల్లాలోని అనపర్తిలో ప్రతిపక్ష నాయకులు ఎన్‌.చంద్రబాబునా యుడు సభకోసం అనుమతి కావాలని కోరారు. కానీ పోలీస్‌యాక్ట్, జీవో నంబర్‌-1 అనుసరించి రోడ్డుపై ఎలాంటి బహిరంగ సభలకు అనుమతిలేదని, వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది కలగకుండా ర్యాలీ నిర్వహించుకోవచ్చంటూ  నిబంధనలను వారికి తెలియజేశాం అన్నారు.


ప్రతిపక్షనేత చంద్రబాబు రోడ్డుపై బహిరంగ సభకు ఏర్పట్లు చేస్తున్నారని తెలిసి వారికి మరోసారి రోడ్డుపై బహిరంగ సభకు అనుమతి లేదని తెలిపి సభను నిర్వహించుకునేందుకు అనుకూలంగా ఉండే రెండు బహిరంగ ప్రదేశాలను కూడా వారికి పోలీసు యంత్రాంగం సూచించిందని ఎస్పీ తెలిపారు. కళాక్షేత్రంతోపాటు, ఒక లే అవుట్‌లో బహిరంగ సభ నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చని సూచించాం. అంతేకాకుండా తగిన భద్రతను కూడా కల్పిస్తామని వివరించినట్లు చెప్పారు. 


పోలీసుల రిక్వెస్ట్ ను తోసిపుచ్చారు, చర్యలు తప్పవు
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడటంలో భాగంగా పోలీసులు ప్రతిపక్షనేత చంద్రబాబుకు, టీడీపీకి చేసిన విజ్క్షప్తిని తోసిపుచ్చారని ఎస్పీ తెలిపారు. పోలీసువారి సూచనలను చంద్రబాబు పట్టించుకోలేదని, నిషేధాజ్ఞలు ఉల్లంఘించి రోడ్డుపై సభ నిర్వహించారని చెప్పారు. పోలీస్‌యాక్ట్‌, జీవో-1 కు టీడీపీ నేతలు విరుద్ధంగా నడుచుకున్నారని.. ఈ ఘటనలో చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం అన్నారు.


సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో చంద్రబాబు ప్రసంగం 


అనపర్తి దేవీ చౌక్ వద్ద పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సభ నిర్వహించకూడదని చెప్తూ విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. టీడీపీ కార్యకర్తల సెల్‌ఫోన్‌ లైట్ల వెలుతురులో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రం కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తానని చంద్రబాబు అన్నారు. అనపర్తిలో సభకు అనుమతి ఇచ్చి తర్వాత రద్దు చేశారని మండిపడ్డారు. జగ్గంపేట, పెద్దాపురం వెళ్తే పోలీసులు సహకరించారని, అనపర్తిలో గ్రావెల్‌ సూర్యనారాయణ వల్ల పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  ఖబడ్దార్‌ గ్రావెల్‌ సూర్యనారాయణ, నాతో పెట్టుకుంటున్నావు అంటూ హెచ్చరించారు.   పోలీసులు ఇవాళ ప్రవర్తించిన తీరుకు ఆ యూనిఫామ్‌ సిగ్గుపడుతుందన్నారు. అనపర్తి నుంచే పోలీసులకు సహాయక నిరాకరణ ప్రారంభించామని చంద్రబాబు ప్రకటించారు.


పోలీసుల తీరు సరిగాలేదని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మిమ్మల్ని కూడా జైల్లో పెట్టిస్తానన్నారు. ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. జగన్‌ పాదయాత్ర చేస్తున్నప్పుడు మా ప్రభుత్వం అడ్డుపడిందా అని ప్రశ్నించారు. అప్పుడు లేని ఆంక్షలను ఇప్పుడెందుకు అని నిలదీశారు. ఒక మాజీ సీఎంపై పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగా లేదన్నారు. తానేమైనా పాకిస్థాన్‌ నుంచి వచ్చానా, ఎందుకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలను కొట్టడం పోలీసులకు మంచిది కాదన్నారు.