Konaseema Latest News: మార్చి నెల వచ్చిందంటే ఇక ఉక్క‌బోత తిప్ప‌లు త‌ప్ప‌వు. తెల్ల‌వారుతుండ‌గానే సూర్య‌డు ప్ర‌ఛండ వేడిగాలుల‌తో మీదికి వ‌స్తుంటాడు. అయితే అంబేడ్క‌ర్ కోన‌సీమలో మాత్రం మార్చినెల‌లో స‌గం రోజులు గ‌డిచిపోయినా కూడా  కశ్మీర్‌లో మంచు దుప్ప‌టి క‌ప్పిన చందంగా వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. గ‌త కొన్ని రోజులుగా అయితే ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు కూడా మంచు తెర‌లు తొల‌గ‌డం లేదు. దీంతో కోన‌సీమ ప్రాంతంలోని ప‌ల్లెలు మంచు తెర‌ల మ‌ధ్య చ‌క్క‌ని అందాలు ఒల‌క‌బోస్తున్నాయి. 

ప్రకృతి ర‌మ‌ణీయ‌త‌తోపాటు మంచు అందాలు 

ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త‌కు పెట్టింది పేరు కోన‌సీమ‌. కొబ్బ‌రి చెట్ల మ‌ధ్య‌న కాలువ‌ల మ‌ధ్య‌న ఉన్న రోడ్లు. ఆ రోడ్డుపై అర‌టిగెల‌లుతో క‌దిలే వ్యాపారులు. చుట్టూ ప‌చ్చ‌టి పొలాలు. రోడ్ల‌ను ఆనుకుని భారీ వృక్షాలు. ఇలా భ‌లే అనుభూతిని ఇచ్చే కోన‌సీమ ప్రాంతంలో ప్ర‌స్తుతం మంచు దుప్ప‌టి అల‌ముకుంటుండ‌డంతో మ‌రింత అందంగా క‌నిపిస్తోంది. ఉద‌యం 8 నుంచి 9 గంటల వ‌ర‌కు మంచు దుప్ప‌టి క‌ప్పిన చందంగా క‌ప్పేయ‌డంతో మంచు అందాల‌ను ఆస్వాదిస్తున్నారు కోన‌సీమ ప్రాంత ప్ర‌జ‌లు. 

మ‌ధ్యాహ్నం అయితే భానుడి భ‌గ‌భ‌గ‌లు..

సాధారణంగా మార్చి నెల వచ్చిందంటే భానుడి భగభగలు మొదలవ్వాలి.. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేసవి కాలం ప్రవేశించినా మంచు  మాత్రం తగ్గడం లేదు. ఉదయం మంచు క‌మ్మేస్తోంది.. మధ్యాహ్నం ఐతే అధిక ఉష్ణోగ్రతలు ప్రజలను అల్లాడిస్తున్నాయి. జిల్లాలోని న‌లుమూల‌ల్లోనూ దట్టమైన మంచు పొగ కమ్మేస్తోండ‌గా తెల్లవారుజామున రోడ్లన్నీ పొగమంచుతో నిండిపోవడంతో కనీసం ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంటోంది. 

మంచుతో వాహ‌న‌దారుల‌కు త‌ప్ప‌ని ఇబ్బందులు..

అమలాపురం నుంచి రావులపాలెం వేళ్లే రోడ్డు మార్గంలో ముంచు తెర‌ల‌తో ర‌హ‌దారి క‌నిపించ‌ని ప‌రిస్థితి ఉంటోంది. ఇదే  రాజమండ్రి వెళ్లే ప్రధాన రహదారి కాగా పూర్తిగా మంచు కప్పేయడంతో వాహ‌న చోద‌కులు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇలా ఉంటే చించినాడ బ్రిడ్జి నుంచి 216ఏ జాతీయ ర‌హ‌దారి అంత‌టా పొగ మంచు క‌ప్పేస్తోంది.. రోడ్డుకిరువైపులా పచ్చ‌ని చేలు ఉండ‌డంతో ఈ అందాలు భ‌లే క‌నువిందు చేస్తున్నాయి.. ఇక రోడ్డుకు స‌మీపంలో ఏదైనా డంపింగ్ యార్డు ఉంటే ఇక తిప్ప‌లు మామూలుగా ఉండ‌డంలేదు.. యార్డుల్లోనుంచి త‌గ‌ల‌బెట్టిన పొగ రోడ్ల‌పై క‌మ్మేయ‌డంతో ఆ పొగ పైకి పోక దుప్పిటిలా క‌ప్పేసిన మంచు పొర‌ను దాట‌లేక మ‌ధ్య‌లో ఉండిపోవ‌డంతో రోడ్ల క్లియ‌రెన్స్ క‌నిపించ‌ని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు.  మంచు తీవ్రత వల్ల ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు త‌ప్ప‌డంలేదు.. ఎండలు ముదురుతున్న సమయంలో కూడా ఈ స్థాయిలో మంచు కురవడం చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

మంచులో న‌డుస్తూ ఎంజాయ్‌..

గ‌త కొన్ని రోజులుగా కోన‌సీమ ప్రాంతంలో ఉద‌యం పూట మంచు తీవ్ర‌త బాగా ఎక్కువ ఉండ‌డంతో ఉద‌యాన్నే వాకింగ్ చేసేవారు. గ్రౌండ్ల‌లో జాగింగ్‌చేసేవారు ఈ మంచు తీవ్ర‌త‌ను భ‌లే ఎంజాయ్ చేస్తున్నారు. త‌మ సెల్‌ఫోన్ల‌లో మంచు అందాల‌ను బంధిస్తూ సెల్పీల‌తో రీల్స్ చేస్తున్నారు. గ్రౌండ్స్‌లో  స్కేటింగ్, క్రికెట్ వంటి గేమ్స్ ఆడుతూ మంచులో మంత్ర ముగ్గుల‌వుతున్నారు. మండు వేసవి లో కూడా కోనసీమలో అందాలు కాశ్మీర్, ఊటీ , కొడైకెనాల్, లంబసింగి వంటి అందాలు తలపిస్తుండ‌డంతో ఈ సంతోషం వేరే లెవెల్ అంటూ తెగ సంబర ప‌డిపోతున్నారు. అయితే ఈ మంచు వల్ల మామిడి తోటలకు నష్టం జరుగుతుందని మంచుతో మామిడి పూత రాలిపోవడంతో దిగుబడి తగ్గిపోతుందని మామిడి రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.