అమలాపురంలో ఓ వెలుగు వెలుగు వెలిగి, గత కొంతకాలం నుంచి సైలెంట్‌గా ఉన్న ఓ రౌడీషీటర్ తన వద్ద ఉండే వ్యక్తే బూతులు తిట్టడంతో అది అవమానంగా భావించి అతన్ని హత్య చేయించాడు.. అమలాపురంలో సంచలనం రేకెత్తించిన ఓ హత్య కీసు మిస్టరీ వీడింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు..
ఆడియో వైరల్ కావడంతో అనుచరుడి హత్య
అమలాపురం అనగానే పదేళ్ల క్రితం వరకు రౌడీషీటర్లు వర్గ పోరు కనిపించేది.. ఇప్పటికీ అమలాపురం పరిసర ప్రాంతాల్లో 60 మందికి పైగా రౌడీషీటర్లు ఉన్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.. ఇప్పడుఇప్పడే రౌడీషీటర్లు ఆగడాలు తగ్గి కాస్త ప్రశాంత వాతావరణం నెలకొంటుండగా ఇటీవల జరిగిన హత్య మళ్లీ అమలాపురంలోని రౌడీషీటర్లు పాతకక్షలు వెలుగులోకి వచ్చాయి.. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వేధిస్తుండడంతోపాటు తనను ధూషిస్తూ మాట్లాడిన ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సహించలేని రౌడీ షీటర్ తన ఉనికిని కాపాడుకునేందుకు ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేయించాడు.. మృతుని స్నేహితులకే హత్యచేసే పనిని అప్పగించి తన కసిని తీర్చుకున్నాడు. అమలాపురంలో సంచలనం రేకెత్తించిన కంచిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి హత్య కేసులో ఎనిమందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఈ సంఘటనపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు.
హత్యకు దారితీసిన కారణమిదే..
ఇటీవలే మృతుడు కంచిపల్లి శ్రీనివాస్ అమలాపురం పట్టణానికి చెందిన రౌడీషీటర్ గంగుమళ్ల షణ్ముకేశ్వరరావు (కాసుబాబు)ను దూషిస్తున్న ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పటికే అప్పులు, ఆరోగ్యసమస్యలతో సతమతవుతోన్న రౌడీషీటర్ కాసుబాబు వైరల్ అవుతోన్న ఆడియో తన ప్రతిష్ట దెబ్బతిన్నట్లుగా భావించిన క్రమంలోనే తనను దూషించిన కంచిపల్లి శ్రీనివాస్‌ను హత్య చేయడం ద్వారా తన ఉనికిని చాటుకోవాలని, అందరిలోనూ భయాన్ని కలిగించాలన్న ఉద్దేశ్యంతో శ్రీనివాస్ మర్దర్‌కు స్కెచ్ వేశాడని పోలీసులువెల్లడించారు. అదనుకోసం ఎదురు చూసిన సదరు నిందితుడైన రౌడీషీటర్ కంచిపల్లి శ్రీనివాస్‌ను అతనితో అత్యంత సన్నిహితంగా ఉండే అతని స్నేహితులనే ఉపయోగించుకుని మర్డర్ స్కెచ్ వేశాడని పోలీసులు తెలిపారు.
మృతుడి స్నేహితులతోనే మర్డర్ ప్లాన్..
తనను దూషించాడన్న పగతో రగిలిపోతున్న ప్రధాన నిందితుడు కాసుబాబు తన పెంపుడు కుమారుడు అయిన అడబాల శంకర్‌లు కలిసి మృతుడు కంచిపల్లి శ్రీనివాస్ మర్డర్‌కు ప్లాన్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ నెల 25న మృతుడు శ్రీనివాస్ ఉదయం 10 గంటల ప్రాంతంలో రాజమండ్రి వెళ్తున్నానని తన భార్యకు చెప్పి స్కూటర్‌పై వెళ్లాడని, ముందుగా వేసుకున్న పథక రచనలో భాగంగా మృతుడుతో కలిసిమెలిసి తిరిగే సలాది రాంబాబు, భాస్కర్ల దుర్గ నాగ ప్రసాద్ లు అదే రోజు కంచిపల్లి శ్రీనివాస్‌ను కారులో తీసుకెళ్లి కొత్తపేట మండలం వక్కలంక వద్ద మద్యం సేవిస్తూఉండగా ఇదే అదనుగా రాంబాబు, దుర్గ నాగ ప్రసాద్‌లు పదునైన కత్తులతో హత్య చేశారు. మృతదేహాన్ని అదే కారులోని వెనుక సీటులో పెట్టి ప్రధాన నిందితుడు గంగుమళ్ల కాసుబాబుకు వీడియో కాల్ చేసి చూపించారు. ఆతరువాత కారులో పి.గన్నవరం వశిష్ట గోదావరి వద్దకు తీసుకువెళ్లి మృతదేహాన్ని గోదావరిలో పడేశారు. అయితే మృతుడు కంచిపల్లి శ్రీనివాస్‌ను అత్యంత పాశవికంగా హత్యచేసినట్లు కుటుంబికులు ఆరోపించారు.
8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు..
కంచిపల్లి శ్రీనివాస్ హత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న గంగుమళ్ల షుణ్ముకేశ్వరరావు అలియాస్ కాసుబాబు, అతని పెంపుడు కుమారుడు అడబాల శంకర్ (ఏ2), సలాది రాంబాబు అలియాస్ అప్పన్న(ఏ3), భాస్కర్ల దుర్గ నాగ ప్రసాద్ (ఏ4) కరటం నరేష్(ఏ5) తోపాటు వీరికి ఆశ్రయం ఇచ్చిన యర్రంశెట్టి లింగయ్య (ఏ6), మోరం సత్య గంగా మాణిక్యాలరావు(ఏ7), మోరం వీరవెంకట సత్యశ్రీనివాస్(ఏ8) లను ముమ్మిడివరం, అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. వీరిని కోర్టుకు హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు చెప్పారు. నిందితుల వద్దనుంచి మూడు కార్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, సుజుకి యాక్సెస్ స్కూటర్, కత్తి, 15 సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన అమలాపురం డీఎస్పీ టీఎస్ ఆర్ కే ప్రసాద్, పట్టణ సీఐ వీరబాబు, క్రైమ్ సీఐ గజేంద్రకుమార్, సిబ్బంది, ఐటీ కోర్ టీమ్‌ను ఎస్పీ అభినందించారు.
పోలీస్ స్టేషన్ ముట్టడితో రాజుకున్న గొడవ..
మృతుడు కంచిపల్లి శ్రీనివాస్ గత నెల 25న మిస్ అయిన క్రమంలో 27వ తేదీన శ్రీనివాస్ భార్య అమలాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో 29న మృతుడి కుటుంబికులు పెద్దఎత్తున పోలీస్‌ష్టేషన్ ముట్టడించారు. అదే రోజు మధ్యాహ్నం నాటికి మృతదేహం పి.గన్నవరం వశిష్ట గోదావరిలో లభ్యమయ్యింది.. ఈక్రమంలో హత్యకేసుగా నమోదు చేసిన పోలీసులు గంగుమళ్ల షణ్ముకేశ్వరరావు అలియాస్ కాసుబాబు, అతని పెంపుడు కుమారుడు అయిన అడబాల శంకర్, సలాది రాంబాబు, భాస్కర్ల దుర్గ నాగ ప్రసాద్‌లపై కేసు నమోదు చేసి వారి కోసం గాలించారు. చివరకు ఇతర రాష్ట్రాలకు పారిపోగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన ఎస్పీ సాంకేతిక పరిజ్ఞానంతో వారిని గుర్తించినట్లు తెలిసింది..
రౌడీయిజం చేస్తే అంతుచూస్తాం..
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రౌడీయిజం చెలాయించాలని చూస్తే సహించేది లేదని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. ప్రశాంతమైన జిల్లాలో రైడీయిజం చెలాయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీయిజం, అల్లర్లు, పాతకక్షలతో ప్రశాంతమైన వాతావరణం పాడుచేయాలని చూస్తే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఎస్పీ హెచ్చరించారు.