ఏపీలో లంచాలు తీసుకుంటూ మంగళవారం ఇద్దరు అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏసీబీ (ACB) కాల్ సెంటర్ 14400, ఏసీబీ (ACB App) యాప్ ద్వారా అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదులతో పోలీస్ శాఖ, స్టేట్ టాక్స్ కు చెందిన ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని అందులో పేర్కొన్నారు.


రాజమండ్రిలో కమర్షియల్ ట్యాక్స్ అధికారి


ACB Raids in Rajamundry: తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం టౌన్, ఆర్యాపురం కమర్షియల్ టాక్స్ డిప్యూటీ అస్సిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న టి.సత్యహరి శ్రీనివాసరావు DREAM Step software Innovations Pvt. Ltd కంపెనీ గత 5 సంవత్సరాలుగా ఫైల్ చేసిన GST రిటర్న్స్, ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ లో లోపాలు ఉన్నాయని అందుకు కంపెనీ పైన చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఇప్పటివరకు 5 నోటీసులను పంపారు.


ఆ కంపెనీకి చెందిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాల వీర మల్లిఖార్జున రావు GST రిటర్న్స్, ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ సంబందించిన డాక్యుమెంట్స్ ను అకౌంటెంట్ ద్వారా పంపగా, అవి సక్రమంగా లేవని 5 నోటిసులకు ఒకొక్క నోటీసుకు రూ.20 వేల చొప్పున రూ.లక్ష రూపాయలు లంచంగా ఇవ్వాలని కమర్షియల్ టాక్స్ అధికారి కోరాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు రాజమండ్రి జాయింట్ కమిషనర్ కార్యాలయంలో బాధితుడి వద్ద నుండి అధికారి సత్య హరి శ్రీనివాసరావు రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


ఎన్టీఆర్ జిల్లాలో ఎస్సై, కానిస్టేబుల్


ACB Raids in NTR District: ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కందుల దుర్గా ప్రసాద్, ఓ కేసులో సీజ్ అయిన కారు, స్టేషన్ బెయిల్ విషయంలో చార్జ్ షీట్ లో పేరు తొలగించేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందిన బాధితుడు గరికపాటి నాగమల్లేశ్వరరావును రూ.5 లక్షలను లంచంగా డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ (ACB) అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ రోజు బాధితుడి వద్ద నుండి మొదటి విడతలో రూ.లక్షా 80 వేలను లంచంగా ఎస్సై కందుల దుర్గా ప్రసాద్ ఆదేశాల మేరకు పోలీస్ కానిస్టేబుల్ ప్రేమ్ సునీల్ కుమార్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై కందుల దుర్గా ప్రసాద్ ను ఏ‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.


గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ (ACB) 14400 కాల్ సెంటర్, ఏసీబీ (ACB) యాప్ ద్వారా అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదులతో దాడులు నిర్వహించామని ఏసీబీ (ACB) అధికారులు తెలిపారు. మొత్తం ఐదుగురు అవినీతి అధికారులను అరెస్టు చేసిన్నట్లు అవినీతి నిరోధక శాఖ ఇంచార్జీ డీజీ శంకర బాత్ర బగ్చి పేర్కొన్నారు.