- 36 టన్నుల ఇనుమును కొల్లగొట్టాడు..
- చివరకు జైలుపాలైన హౌసింగ్‌ ఉద్యోగి..
నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంలో భాగంగా జగనన్న కాలనీల్లో జగనన్న ఇళ్లు పథకం ద్వారా ఇళ్లు నిర్మిస్తుండగా ఈ శాఖలో పనిచేస్తోన్న కింది స్థాయి సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శించి ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నారు. ఇటీవల కాలంలో చాలా చోట్ల హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో పలు అవకతవకలు బయట పడగా ఇంటి దొంగల చేతివాటాన్ని పసిగట్టే పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండడంతో అయినకాడికి దోచేస్తున్నారు.


హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఏకంగా 36 టన్నుల ఐరెన్‌ను దపదఫాలుగా అమ్మేసి రూ.25లక్షలు సొమ్ము చేసుకోవడం వెలుగులోకి వచ్చింది.. దోపిడీ గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా  దర్యాప్తు చేసి చివరకు 25 టన్నుల ఐరన్‌ను రికవరీ చేసి ఇంటి దొంగను కటకటాల్లోకి పంపారు. ఈ ఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోని అమలాపురం పురపాలక సంఘ పరిధిలో నిర్మిస్తున్న జగనన్న కాలనీ పనుల్లో చోటుచేసుకుంది.  
బోడసకుర్రు గ్రామ పరిధిలోని టిడ్కో భవన సముదాయాల చెంతన అమలాపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని ఇళ్లు లేని పేదలకు ఇచ్చిన స్థలాల్లో శరవేగంగా ఇళ్లను నిర్మాణాలు చేపట్టారు అధికారులు. ఈ నిర్మాణాలకు సంబందించి హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా భారీ ఎత్తున ఐరెన్‌, ఇతర నిర్మాణ సామాగ్రిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఇక్కడ పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి సరెళ్ల ఏడుకొండలు వెంకటరమణ అనే వ్యక్తి ఐరెన్‌ నిల్వలపై కన్ను పడింది. దీంతో టన్నులు టన్నుల్లో ఐరెన్‌ను అమ్మేయడం మొదలు పెట్టాడు. చివరకు ఏకంగా 36 టన్నుల వరకు ఐరెన్‌ దఫదఫాలుగా మాయం అయింది. లెక్కల్లో ఐరన్‌ కనిపించకపోవడంతో భారీ తేడాను గుర్తించిన అధికారులు విచారణ చేపట్టి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
25 టన్నుల ఐరన్‌ రికవరీ.. 
మాయం అయిన ఐరన్‌కు సంబందించి కేసు నమెదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో ఐరెన్‌ కాజేసి అమ్మేసుకుంది హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఔట్‌సోర్సింగ్‌ పద్దతిలో పనిచేస్తున్న ఏడుకొండలు వెంకటరమణ అనే వ్యక్తిగా గుర్తించారు. అతను విక్రయించిన పలు చోట్లను ఐరెన్‌ను 25 టన్నులు వరకు రికవరీ చేశారు. దీని విలువ రూ.18లక్షలు వరకు ఉంటుందని డీఎస్పీ అంబికా ప్రసాద్‌ తెలిపారు.
14 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు..
హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌ గొడౌన్‌లో పక్కా ప్రణాళికతో స్కెచ్‌ వేసి ఏకంగా 36 టన్నుల ఐరెన్‌ను కొట్టేసిన ఇంటిదొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ వ్యవహారంలో దఫదఫాలుగా  మొత్తం మాయం అయిన ఐరెన్‌ను తానే ఓ వ్యాపారికి విక్రయించానని ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ దిశగా విచారణ చేసిన పోలీసులు ఆ వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో 18 టన్నులు వరకు రికవరీ చేశారు. ఈ కేసులో నిందితుడు ఏడుకొండలు వెంకటరమణను కోర్టులో హాజరు పరచగా అతికి 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. 
ఈ కేసులో వేగంగా దర్యాప్తు చేపట్టి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేసి నిందితున్ని జైలుకు పంపిన అమలాపురం రూరల్‌ సీఐ వీరబాబు, ఎస్సై శ్రీను నాయక్‌ను జిల్లా ఎస్పీ శ్రీధర్‌ అభినందించారు.