కొత్త జిల్లాల అంశం కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తోంది. రాజంపేట ఎమ్మెల్యే, రాయచోటి ఎమ్మెల్యే  మధ్య విభేదాలకు కారణం అవుతోంది. రెండు చోట్ల వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు, నేతలు తమ ప్రాంతానికి మ్దదతుగా రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వివాదానికంతటికి కారణం కడప జిల్లాను విభజించి కొత్తగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే జిల్లా కేంద్రంగా రాయచోటిని నిర్ణయించారు. ఇది రాజంపేట వాసుల్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. 


అన్నమ్మయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట కావాలని కోరుతూ జిల్లా కలెక్టర్ విజయరామరాజును కలిసి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వినతి పత్రం అందించారు. ఈ మధ్య జరిగిన పరిణామాలు చాలా బాధించాయని మేడా మల్లిఖార్జునరెడ్డి అన్నారు.  గతంలో సీఎం జగన్ రాజంపేట ను జిల్లా గా చేస్తామని హామీ ఇచ్చారన్నారు.  వైసీపీ విధానం ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లా కేంద్రం చేయాలి. రాజంపేట పార్లమెంట్ కేంద్రం అయినప్పటికీ రాయచోటిని జిల్లా కేంద్రం చేశారు. గతంలో హామీ ఇచ్చిన సీఎం జగన్ అన్నమయ్య జిల్లాగా రాయచోటి ని చేయడం బాధాకరమని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


ఇప్పటికే ఈ విషయాన్ని  సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లడం జరిగిందన్నారు. రాజంపేట పార్లమెంట్ కు ఒక ప్రత్యేకత ఉందన్నారు.  ఇలాంటి నిర్ణయం తీసుకోడానికి వెనుక  పరిణామాలు ఏమి జరిగాయి అన్నది తెలీదన్నారు. రాజంపేట కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాకూడా ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అన్నమయ్య జన్మ స్థలం రాజంపేట అని.. బ్రిటిష్ కాలం నాటి నుంచి రాజంపేట కు ప్రత్యేకత ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రాయచోటి జిల్లా గా చేస్తూ తాళ్ళపాక అన్నమయ్య పేరును పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 


రాజంపేట ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, తొందరలో సీఎం ను కలసి సమస్యను వివరించబోతున్నామన్నారు.  కరోనా పాజిటివ్ రావడం వల్ల సీఎం ను కలవలేకపోయానని.. రాజంపేట మీద నాకు చాలా మమకారం ఉందన్నారు.అలాగే సీఎం జగన్ కు రాష్ట్రం పై చాలా అవగాహన ఉందని.. ఎలాంటి పరిస్థితి లో సీఎం నిర్ణయం తీసుకున్నారో తెలియదని..ప్రజల మనోభావాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సీఎం జగన్ తప్పకుండా న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్నారు. రాజంపేట ను జిల్లా గా చేస్తారని ఆశిస్తున్నామని, సీఎం మాకందరికి పెద్ద దిక్కన్నారు. పార్టీకి అనుగుణంగా నడుచుకుంటూ, ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. వైఎస్ఆర్‌సీపీకి సెలవు అంటూ రాజంపేటలో ప్రజలు ప్లెక్సీలు పెడుతూండటంతో ఎమ్మెల్యే రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.