Rajahmundry News : గాంధీజీ ఈ రాష్ట్రాన్ని కాపాడు అంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రతిపక్ష పార్టీలు వినూత్నంగా నిరసన చేపట్టాయి. జీవో నెంబర్ 1 రద్దు చేయాలని గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్షం సమక్షంలో నల్ల రిబ్బన్ లు కట్టుకొని నిరసన తెలియజేశారు. జీవో నెంబర్ 1 ఎంపీ భరత్ కు వర్తించదా అని ప్రశ్నించారు.  ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ప్రజాస్వామ్యాన్ని వైసీపీ నాశనం చేస్తుందంటూ టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజా సంఘాలు సోమవారం ఉదయం స్థానిక జాంపేట మహాత్మా గాంధీ విగ్రహం ముందు నోటికి నల్లరెబ్బను కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.  జీవో నెంబర్ 1 నల్ల జీవో అంటూ, దానిని వెంటనే రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా జీవో నెంబర్ 1 తీసుకొచ్చారని ఆయన అన్నారు. ఈ నల్ల జీవోకు వ్యతిరేకంగా ఇప్పటికే రాష్ట్రంలో పలు ఆందోళనలు చేశామని, ఆ జీవో వెనక్కి వెళ్లే వరకు ఉద్యమం ఆగదని ముప్పాళ్ళ చెప్పారు.  


జీవో ప్రతిపక్షాలకేనా? 


రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి తీసుకొచ్చిన ఈ నల్ల జీవో ప్రతిపక్షాలకేనా రాజమండ్రి ఎంపీ భరత్ కు వర్తించదా అని ప్రశ్నించారు. నడిరోడ్డు మీద జనం ఎక్కువగా తిరిగే ప్రాంతం నందగనిరాజు సెంటర్లో అడ్డంగా స్టేజి కట్టి నగర ప్రజలను ఇబ్బందులు పడుతుంటే పోలీసులు మాత్రం చూస్తూ ఊరుకున్నారని ఆయన విమర్శించారు. ఈ జీవో ఆయన వర్తించదా అని ప్రశ్నించారు. జనసేన పీఏసీ సభ్యుడు,  మాజీ ఎమ్మెల్సీ కందులు దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉల్లంఘన రాజ్యాంగ నిర్వీర్యం జరుగుతుందన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని,  ప్రజా సమస్యలపై ఉద్యమించే ప్రతిపక్షాలను జీవో నెంబర్ 1 చూపించి ఆపడం అన్యాయం అన్నారు. 



జీవో రద్దు చేసే వరకు పోరాటం ఆగదు 


సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ నల్ల జీవో రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని, అవసరమైతే ఢిల్లీ పురవీధుల్లో ఆంధ్రప్రదేశ్ హక్కులపై ఉద్యమిస్తామన్నారు. జగన్ తన నీడను చూసి తానే హడలిపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని దానిపై ప్రజలు ఉద్యమిస్తారనే భయంతోనే ఈ జీవో తీసుకొచ్చారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు టీఎస్ ప్రకాష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పూర్ణిమ రాజు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళి ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. 


జీవో నెం.1 పై వివాదం 


ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు కందుకూరు రోడ్ షో, ఆ తర్వాత గుంటూరులో సభలో మొత్తం 11 మంది చనిపోయారు.  ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ వన్  జారీ చేసింది. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలో రాజకీయ పార్టీల రోడ్ షోలు, ర్యాలీలు, సభలపై ఆంక్షలు విధించారు. జీవో జారీ చేసిన వెంటనే ప్రతిపక్, నేత చంద్రబాబు కుప్పం పర్యటనకు పోలీసులు ఆటంకాలు కల్పించారు. ఆయన ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు. రెండు రోజుల కిందట పీలేరులోనూ అడ్డుకున్నారు. ప్రతిపక్షాలను ప్రజల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే ఈ ఉత్తర్వులు ఇచ్చారని.. బ్రిటీష్ కాలం నాటి జీవోలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.