Rajahmundry Bridge : అమరావతి టు అరసవల్లి రైతుల మహాపాదయాత్రను తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మూడు రాజధానుల మద్దతుదారులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. అమరావతి పాదయాత్రకు వ్యతిరేకంగా గో బ్యాక్ అంటూ పోస్టర్లు వెలిశాయి. అయితే రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ ను తాత్కాలిక మరమ్మత్తుల చేసేందుకు అధికారులు మూసివేశారు. అయితే అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకే స్థానిక నేతలు బ్రిడ్జ్ మూసివేశారని టీడీపీ నేతలు, అమరావతి జేఏసీ ఆరోపిస్తున్నారు. ఈ వాదనను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. 


మరో బ్రిడ్జ్ నుంచి పాదయాత్ర చేసుకోవచ్చు-ఎంపీ మార్గాని భరత్ 


 తాత్కాలిక మరమ్మత్తుల కోసమే రాజమండ్రి రోడ్ కమ్  రైలు బ్రిడ్జ్ మూసివేశామని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. అమరావతి రైతుల పాదయాత్ర అడ్డుకోవాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు. రాజమండ్రికి వచ్చే మరో రెండు బ్రిడ్జ్ లపై కూడా పాదయాత్ర  చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం బ్రిడ్జ్ రెయిలింగ్ కు  ఏర్పడిన పగుళ్లకు  మరమ్మత్తులు జరుగుతున్నాయని వెల్లడించారు. రైల్వే శాఖ భాగస్వామ్యంతో  త్వరలో రోమ్ కమ్  బ్రిడ్జ్ కు శాశ్వాత మరమ్మత్తులు చేపడతామన్నారు.  


రాత్రికి రాత్రే బ్రిడ్జ్ రిపేర్లు- గోరంట్ల 
 
అమరావతి రైతుల పాదయాత్ర అడ్డుకునేందుకు రాత్రికి రాత్రి రాజమండ్రి బ్రిడ్జ్ మూసివేశారని టీడీపీ సీనియర్  నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. బిడ్జ్ మూసివేస్తూ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు కచ్చితంగా హైకోర్టు ధిక్కరణే అవుతాయన్నారు. రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడా  రోడ్లకకు రిపేర్లు  చేయడం లేదని స్పష్టం చేశారు. రాత్రికి రాత్రే  బ్రిడ్జ్ మరమ్మత్తులు ప్రారంభిస్తారా? అని ప్రశ్నించారు. వారం రోజుల్లో  బ్రిడ్జ్ రిపేర్లు పూర్తయిపోతాయా? అని నిలదీశారు. పవన్ కల్యాణ్  యాత్రకు  ఇలాగే అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఈనెల 17న  పెద్దఎత్తున  ప్రజలు  రాజమండ్రి తరలివచ్చి అమరావతి  రైతులకు మద్దతు ఇవ్వాలని గోరంట్ల బుచ్చయ్య కోరారు.  


రూట్ మ్యాప్ ప్రకారమే పాదయాత్ర- జేఏసీ నేతలు 


 రాజమండ్రిలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో  అమరావతి జేఏసీ నాయకులు భేటీ అయ్యారు. అనంతరం అమరావతి జేఏసీ ఛైర్మన్ శివారెడ్డి మాట్లాడుతూ... హైకోర్టుకు సమర్పించిన రూట్ మ్యాప్ ప్రకారం పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. 17వ తేదీన రోడ్ కమ్  వంతెన మీదుగా రాజమండ్రి నగరానికి పాదయాత్ర రావాల్సి ఉందని, రాజకీయ కారణాలతో బ్రిడ్జ్ మూసి వేస్తున్నట్లు కలెక్టర్ ఆదేశాలు  ఇచ్చారని ఆరోపించారు. పాదయాత్రను అడ్డుకునేందుకు ఉభయగోదావరి జిల్లా వాసులను  ఇబ్బంది పెట్టొద్దని కోరారు. 
కలెక్టర్ ను  కలిసి 17వ తేదీన అనుమతి  ఇవ్వమని మెమొరాండం  ఇస్తామన్నారు. బ్రిడ్జ్ రిపేర్లు  18వ తేదీ నుంచి ప్రారంభించాలని కోరుతామన్నారు.  


గో బ్యాక్ పోస్టర్లు


అమరావతి ఏకైక రాజధాని ఉండాలంటూ అరసవెల్లి వరకు రైతులు చేపట్టిన పాదయాత్ర వ్యతిరేకంగా గో బ్యాక్ అంటూ నిడదవోలులో స్థానికులు కొందరు బ్యానర్లు ఏర్పాటు చేశారు. నిడదవోలు నియోజకవర్గంలోకి గురువారం పాదయాత్ర ప్రవేశించగానే 'స్టేట్‌ వర్సెస్‌ రియల్‌ ఎస్టేట్‌', 'అమరావతి రియల్ ఎస్టేట్ వద్దు - ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముద్దు' అన్న నినాదాలతో బ్యానర్లు, హోర్టింగులు కనిపించాయి. దీంతో అమరావతి పాదయాత్ర స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.  జగన్ ది స్టేట్.. చంద్రబాబు ఫర్ రియల్ ఎస్టేట్' అంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. 'జగన్ కోరుకొనేది అందరి అభివృద్ధి అయితే చంద్రబాబు కోరుకునేది అస్మదీయుల అభివృద్ధి' అని, 'జగన్‌ది సమైక్యవాదమైతే చంద్రబాబుది భ్రమరావతి నినాదం' అని,  'జగన్‌ది అభివృద్ధి మంత్రం చంద్రబాబుది రాజకీయ కుతంత్రం' అంటూ పరస్పర ఆరోపణలు ప్లెక్సీలు దర్శన మిస్తున్నాయి.  దీంతో గోదావరి జిల్లాల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.  అమరావతి పాదయాత్రకు వ్యతిరేకంగా, వికేంద్రీకరణకు మద్ధతు తో ప్లెక్సీలు వెలుస్తుండడం తో పోలీసులు అప్రమత్తం అయ్యారు.