Rajahmundry News : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర కళా కేంద్రంలో జగనన్న సాంస్కృతిక సంబరాలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 29, 30, డిసెంబర్ 1 వ తేదీ మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రారంభ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆర్కే రోజా, హోం మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. కళాకారులతో పాటు మంత్రి రోజా డ్యాన్స్ చేశారు. మంత్రి రోజా స్టెప్పులతో ఆడిటోరియం హోరెత్తింది. ఎంపీ మార్గాన్ని భరత్ రామ్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ మంత్రి కన్నబాబు, రుడా ఛైర్ పర్సన్ షర్మిల రెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు వివిధ రంగాలకు చెందిన కళాకారులు ప్రదర్శించనున్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సున్నా
అనంతరం మంత్రి రోజా మాట్లాడారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు తర్వాతైనా అడ్డమైన యాత్రలు ఇకనైనా మానెయ్యాలన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు బినామీలు కట్టుకున్న కోట బద్దలు అవుతున్నాయన్నారు. ప్రజల అవసరాల మేరకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆయన సొంత నిర్ణయాలు కాదన్నారు. 175 మీరే తెచ్చుకుంటే మేము ఏం చెయ్యాలని పవన్ అంటున్నారని, 2019లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఏంచేశారో అదే చెయ్యాలన్నారు.చంద్రబాబు, పవన్ ఇద్దరినీ చూసి జనం ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ వచ్చే సీట్లు సున్నా అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాతైనా రైతులు అమరావతి - అరసవెల్లి పాదయాత్రను నిలిపివేయాలని మంత్రి రోజా అన్నారు. అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. టీడీపీ, జనసేన ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు
రాజమండ్రిలోని శ్రీ వెంకటేశ్వర కళా కేంద్రంలో జగనన్న సాంస్కృతిక సంబరాలు కార్యక్రమానికి హోంశాఖ మంత్రి తానేటి వనిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. మంత్రి ఆర్.కె.రోజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భారత్ రామ్, ఎమ్మెల్యేలు కన్నబాబు, జక్కంపూడి రాజా, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, రుడా చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి, ఇతర వైస్సార్సీపీ నాయకులు, కళాకారులు పాల్గొన్నారు. సంప్రదాయ నృత్యాలైన కూచిపూడి, ఆంధ్ర నాటకం, భరత నాట్యం, గాత్రం పోటీలు నిర్వహించారు. అదేవిధంగా జానపద కళారూపాలు దప్పులు, గరగలు, చెక్క భజన, పులి వేషాలు, కాళికా వేషాలు, కొమ్ముకోయ, సవర, తదితర విభాగాల్లో జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నారు. కళాకారులు ప్రదర్శించిన తీరు ఆద్యంతం ఆకట్టుకుందని హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. రాష్ట్రంలోని కళాకారులను ప్రోత్సహించడంతో పాటు, లక్షల్లో బహుమతులను మంత్రి రోజా అందించడం శుభపరిణామన్నారు. కళాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించాలని హోంమంత్రి తానేటి వనిత అన్నారు.