Rains In AP Telangana : ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో నేడు వర్షాలు కురవనున్నాయి. మరో మూడు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయిని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాంలపై ఉంది. ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి జల్లులు కురవనుండగా,  రాయలసీమలో, తెలంగాణలో పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో..
ఈ ప్రాంతాల్లో మూడో మూడు రోజులపాటు ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు  విస్తరిస్తున్నాయి. రంపచోడవరం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనూ అక్కడక్కడ వర్షాలు పడతాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. విశాఖ నగరంలో మాత్రం వర్షాలుండవు. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత మరింత ఎక్కువైంది. ప్రస్తుతానికి విశాఖ నగర శివారులు గాజువాక​, పెందుర్తి, అనకాపల్లి, సబ్బవరం, సింహాచలం, విజయనగరంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని పలు చోట్ల అక్కడక్కడ కొన్ని వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తునిలో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో..
మరో వైపున రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువైంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పలు భాగాల్లో నేడు తేలికపాటి జల్లులు కురవనున్నాయి. అనంతపురం జిల్లా హిందుపురం, మడకశిర వైపు పిడుగులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపున నంద్యాల జిల్లా ఆత్మకూరు, నందికొట్కూరుకు వర్ష సూచన ఉంది. విజయవాడ - చీరాల బెల్ట్ లో ఎండల తీవ్రత ఎక్కువైంది. కర్నూలు, తిరుపతి, నంద్యాలలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్టంగా అనంతపురం జిల్లాలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని, ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.


తెలంగాణలో వెదర్ అప్‌డేట్స్..
తెలంగాణలోనూ ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురవనుండగా.. చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రామగుండం, నల్గొండలో 41 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రత.. హైదరాబాద్ లో 39.2 డిగ్రీలుగా నమోదైంది. నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 41 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలు నమోదయ్యాయి. పడమర, నైరుతి దిశల నుంచి 6 నుంచి 10 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.





Temperature in Andhra Pradesh, Telangana Temperature Today